ధవళేశ్వరం బంద్ విజయవంతం
ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : ఏకపక్షంగా ధవళేశ్వరం నుంచి సెంట్రల్ డివిజన్ కార్యాలయం అమలాపురం తరలించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకులు వీర్రాజు ఆధ్వర్యంలో ధవళేశ్వరంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బంద్ కారణంగా గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంక్‌లు మూతపడ్డాయి. తొలుత ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలు ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. ఆకుల వీర్రాజు ఇరిగేషన్ కార్యాలయాలకు వెళ్లి బంద్‌కు సంఘీభావం తెలపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్ కార్యాలయాల బంద్ కారణంగా వరుసగా రెండో రోజు కూడా మూతపడ్డట్టు అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకులు వీర్రాజు మాట్లాడుతూ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలిస్తే మైనర్ ఇరిగేషన్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. అమలాపురం వెళ్లాలంటే వంద కిలోమీటర్లు పైబడి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాన్ని మార్చడం పలు అనుమానాలకు బలం చేకూరుతుందన్నారు. వాస్తవ పరిస్థితులు చూడకుండా కార్యాలయ మార్పునకు అధికారులు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధుల మెప్పుకోసం ఇరిగేషన్ అధికారులు ఈ విధంగా వ్యవహరించడం తగదన్నారు. ధవళేశ్వరంలోనే సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ఉంచాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగర పాలకసంస్థ కార్పొరేటర్ మింది నాగేంద్ర, మాజీ ఎంపీటీసీ సాధనాల చంద్రశేఖర్(శివ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఏజీఆర్ నాయుడు, షట్టర్ భాషా, బర్రి కామేశ్వరరావు, రామరాజు, మోహన్‌బాబు, గపూర్, సత్యం వెంకటరమణ, ముత్యాల జాన్, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, కురుమళ్ల ఆంజనేయులు, బోడపాటి సత్యనారాయణ, బోడపాటి మూర్తి, బొబ్బిలి భాస్కరరావు, అయితిరెడ్డి అయ్యప్ప పాల్గొన్నారు.
కాటన్ ఆశయాలకు తూట్లు పొడవద్దు
వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి
ధవళేశ్వరం : సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి తరలించి కాటన్ ఆశయాలకు తూట్లు పొడవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ధవళేశ్వరం నుంచి సెంట్రల్ డివిజన్‌కార్యాలయాన్ని తరలిస్తే సహించేది లేదన్నారు. వందేళ్ల క్రితం కాటన్ నెలకొల్పిన కార్యాలయాలను వేరేచోటకు తరలించి ఆయన అపార అనుభవాన్ని అవమానించవద్దని జక్కంపూడి విజయలక్ష్మీ పేర్కొన్నారు. తాను పుట్టి పెరిగింది కోనసీమలోనే అన్నారు. రైతాంగానికి మేలు చేసే చర్యలు చేపట్టకుండా ఉన్న వాటిని తూట్లు పొడవడం దారుణమన్నారు. సెంట్రల్ డివిజన్ ఈఈ కోనసీమలోని డెల్టా రైతాంగానికి క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. అటు డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. కనీసం కార్యాలయ సిబ్బందికి కూడా తెలయకుండా కార్యాలయ మార్పుకు ప్రయత్నించడం ఏమిటని జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారుల తీరు ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరంలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏ విధమైన జీవో రానప్పటికీ 1988 నాటి జీవోను తెరమీదకు తీసుకురావడం వెనుక ఇరిగేషన్ అధికారలు అత్యుత్సాహం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల మెప్పుకోసం రైతులను ,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయవద్దని జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.