విద్యా సంస్థల బంద్ విజయవంతం
విద్యా సంస్థల బంద్ విజయవంతం
Published Mon, Aug 1 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
– కర్నూలులో సీఎం దిష్టిబొమ్మ దహనం
– విద్యార్థి సంఘాల నాయకులు అరెస్టు, తొమ్మిది మందిపై కేసు నమోదు
– ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై విద్యార్థుల మండిపాటు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ జిల్లాలో విజయవంతమైంది. కర్నూలు, ఆదోని, నంద్యాల, బనగానిపల్లె, కోవెలకుంట్ల, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలలు, కళాశాలలకు తాళాలు పడ్డాయి. ఉదయం నుంచే ఆయా విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలను బంద్ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రబంద్ ప్రశాంతంగా ముగిసింది. అయితే కర్నూలులో మాత్రం ఉద్రిక్తంగా మారింది. కేసీ కెనాల్ నుంచి కలెక్టరేట్ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగన్న, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు ఆనంద్, రాజ్‌కుమార్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేయనీయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తొపులాట జరింగింది. చివరకు పోలీసులు భారీ స్థాయిలో మొహరించి విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. తొమ్మిది మంది విద్యార్థి సంఘాల నాయకులపై త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల వాగ్దానాలను మరచి ప్రభుత్వ విద్యను కార్పొరేట్ పరం చేసేందుకు చూస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే మూసివేసని సంక్షేమ హాస్టళ్లను తెరపించాలని, ప్రభుత్వ పాఠశాలల మూసి వేత నిర్ణయాన్ని పునరాలోచించాలని, ఇంజినీరింగ్ కళాశాలల ఫీజును తగ్గించాలని, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే భవిష్యత్‌లో విద్యార్థిలోకం ఆగ్రహానికి తెలుగుదేశం ప్రభుత్వం గురికావాల్సి వస్తోందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మధు, శివ, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నాగరాజు, పీడీఎస్‌యూ నాయకులు శ్రీదేవి, మస్తాన్‌వలి, మధు పాల్గొన్నారు.
యూనివర్సిటీలో..
రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర బంద్‌లోభాగంగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు ఏడీ బిల్డింగ్ ఎదుట నిరసన వ్యక్తం చేశాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థుల కాస్మొటిక్, మెస్ చార్జీలను పెంచాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేంద్ర డిమాండ్ చేశారు.
Advertisement