
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)//: పరీవాహక ప్రాంతాల్లో వర్షాల విరామంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం ధవళేశ్వరం బ్యారేజీలో నీటి మట్టం 14.40 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41.50 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరే వరద మరింతగా తగ్గనుంది. ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్న కృష్ణా ప్రవాహం కూడా తగ్గింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్‌లలోకి వరద తగ్గింది. శ్రీశైలం నుంచి 2 గేట్ల ద్వారా, నాగార్జునసాగర్ నుంచి 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.
వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 12,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 391 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 12 వేల క్యూసెక్కులను కడలిలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,500 క్యూసెక్కులు వస్తుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. ఏలేరు ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment