barriage
-
తగ్గిన వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)//: పరీవాహక ప్రాంతాల్లో వర్షాల విరామంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం ధవళేశ్వరం బ్యారేజీలో నీటి మట్టం 14.40 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41.50 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరే వరద మరింతగా తగ్గనుంది. ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్న కృష్ణా ప్రవాహం కూడా తగ్గింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్‌లలోకి వరద తగ్గింది. శ్రీశైలం నుంచి 2 గేట్ల ద్వారా, నాగార్జునసాగర్ నుంచి 10 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 12,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 391 క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 12 వేల క్యూసెక్కులను కడలిలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,500 క్యూసెక్కులు వస్తుండగా అదే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. ఏలేరు ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. -
పెద్దపల్లి: సరస్వతి బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు
-
కదులుతున్న కాళేశ్వరం
► యుద్ధ ప్రాతిపదికన మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల నిర్మాణం ► భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు.. ► రాత్రిపూటా పనులు ► బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులు సమాంతరంగా.. చకచకా.. ► వచ్చే ఖరీఫ్ నాటికి 100 టీఎంసీలను ఎల్లంపల్లికి తరలించడమే లక్ష్యం ► వచ్చే మేలో ట్రయల్ రన్ నిర్వహిస్తాం: అధికారులు కాళేశ్వరం బ్యారేజీ ప్రాంతం నుంచి సోమన్నగారి రాజశేఖరరెడ్డి ఎక్కడ చూసినా లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, కంకర కుప్పలు.. భారీ యంత్రాలు.. వేల మంది కార్మికులు.. రాత్రి పూట ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లోనూ పనులు.. 360 డిగ్రీల కోణంలో నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..! గోదావరి, ప్రాణహిత నదుల సంగమ ప్రాంతానికి దిగువన కాళేశ్వరం వద్ద చేపట్టిన ఎత్తిపోతల పనుల దృశ్యమిదీ!! బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల మధ్య పోటీ పెట్టారా అన్నట్టుగా నిర్మాణ పనులు మహాయజ్ఞంలా సాగుతున్నాయి. రోజుకు ఒక్కో బ్యారేజీ వద్ద 15 వేల టన్నుల సిమెంట్ వినియోగిస్తూ కాంక్రీట్ పనులు చేస్తున్నారు. వర్షాలు కురిసినా, గోదావరి నుంచి నీరొచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాపర్ డ్యామ్ నిర్మాణాలు పూర్తి చేసి, డీ వాటరింగ్ పద్ధతిన నీటిని తొలగించే పనులు చకచకా జరుగుతున్నాయి. ఆరునూరైనా వచ్చే ఖరీఫ్ నాటికి 100 టీఎంసీల గోదావరి నీటిని ఎల్లంపల్లికి తరలించాలన్న సంకల్పంతో ఇంజనీర్లు పనిచేస్తున్నారు. మూడు ప్రధాన జలాశయాలు.. మేడిగడ్డ నుంచి 180 టీఎంసీల నీటిని మళ్లించి 18.40 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల ఎకరాల స్థిరీకరణ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నీటి నిల్వల కోసం కొత్తగా 147.71 టీఎంసీల సామర్థ్యం గల 20 జలాశయాలను నిర్మించనుండగా, అందులో ప్రధానమైనవి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల. ఈ మూడింటినీ కలిపి సుమారు 30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. మొత్తంగా రూ.13,811 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇందులో పంప్‌హౌజ్‌ల నిర్మాణాలకు రూ.7,998 కోట్లు, బ్యారేజీల నిర్మాణాలకు రూ.5,813 కోట్లు వెచ్చించనున్నారు. ప్రస్తుతం మూడు బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల పనులన్నింటినీ ఒకేమారు ఆరంభించి చేపట్టారు. కీలకం.. మేడిగడ్డ పంప్‌హౌజ్ 16.17 టీఎంసీల సామర్థ్యంతో మేడిగడ్డ బ్యారేజీ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ సుమారు 1,650 టీఎంసీల నీటి లభ్యత ఉండనుండగా.. గోదావరి ఏకంగా 1.3 కి.మీ. వెడల్పుతో ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరిలో 10 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నదిపై 1.63 కి.మీ. పొడవులో బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. ఈ బ్యారేజీ ప్రాంతం మహారాష్ట్రకు సరిహద్దు. ఆ రాష్ట్రంలో 170 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీంతో ఆ రాష్ట్ర సహకారంతో రెండు వైపులా బ్యారేజీ పనులు మొదలు పెట్టారు. మనవైపు (తెలంగాణ) ప్రాంతంలోని పనులు వేగంగా జరుగుతున్నాయి. పనిని మొత్తంగా 8 బ్లాక్‌లుగా విభజించి 6 బ్లాక్‌ల పనులు మొదలు పెట్టారు. ఏడో బ్లాక్‌లో పనులు చేసుకునేందుకు వీలుగా.. గోదావరి సహజ ప్రవాహానికి ఇబ్బంది కలగకుండా కాపర్ డ్యామ్‌లు పూర్తి చేశారు. వీటితోపాటే గోదావరి బెడ్‌లెవల్‌లో రాఫ్ట్ పనులు పూర్తయ్యాయి. 16 ఎక్స్కవేటర్లు, 55 టిప్పర్లు 24 గంటలు పనిచేస్తున్నాయి. మొత్తంగా రూ.65 కోట్ల పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బ్యారేజీ పనులను పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 22 కిలోమీటర్ల దిగువన పంప్‌హౌస్ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 11 పంపులను ఏర్పాటు చేయనుండగా మరో 6 పంప్‌లను భవిష్యత్ అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ 64 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పని జరగాల్సి ఉండగా 45 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. మరో 45 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తయింది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకున్నా.. పంప్‌హౌస్ పనులు పూర్తయితే 92 మీటర్ల లెవల్ నుంచి ప్రవహించే గోదావరి నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ్నుంచి వచ్చే ఖరీఫ్ నాటికి కనీసం 100 టీఎంసీలు అయినా పంపింగ్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డిప్యూటీ ఇంజనీర్ సూర్యప్రకాశ్ తెలిపారు. పనుల్లో ముందు.. అన్నారం మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి 13.2 కి.మీ. దూరంలో 11 టీఎంసీల కెపాసిటీతో అన్నారం బ్యారేజీ నిర్మాణం జరుగుతోంది. 1.2 కి.మీ. పొడవుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. భూసేకరణ పూర్తవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 6 బ్లాక్‌లుగా పనులు చేపట్టగా 4 బ్లాక్‌ల్లో పని మొదలైంది. ఇక్కడ రోజుకు 1,600 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేస్తున్నారు. రాఫ్ట్ పనులకు అత్యంత అధునాతన వాహనాలు వినియోగిస్తున్నారు. సుమారు వెయ్యి మంది మూడు షిప్టుల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా రూ.152 కోట్ల పనులు పూర్తయ్యాయి. జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బ్యారేజీ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో 12 పంపులతో పంప్‌హౌస్ నిర్మాణం చేపట్టారు. మొత్తం 6 బ్లాక్‌లుగా పని విభజన చేయగా.. అన్నింటా పనులు మొదలయ్యాయి. ఇక్కడ ఇప్పటికే రూ.200 కోట్ల పనులు పూర్తి చేసినట్లు డీఈ మధు తెలిపారు. 425 ఎకరాలకుగానూ మరో 67 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని, పంప్‌హౌస్‌ను జూన్ నాటికే సిద్ధం చేస్తామని వివరించారు. సుందిళ్ల ఓకే.. మిగతా బ్యారేజీలు, పంప్‌హౌస్‌లతో పోలిస్తే సుందిళ్ల బ్యారేజీ పనులు కాస్త ఆలస్యమైనా వేగంగానే జరుగుతున్నాయి. భూసేకరణకు ఆటంకాలు లేకపోవడంతో బ్యారేజీ పనుల్లో వేగం కనిపిస్తున్నా.. పంప్‌హౌజ్ పనులు కాస్త నెమ్మదించాయి. అన్నారం పంప్‌హౌస్‌కు 3 కిలోమీటర్ల ఎగువన 3.11 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన బ్యారేజీ పనులను 6 బ్లాక్‌లుగా విభజించగా.. మూడు బ్లాకుల్లో పని మొదలైంది. రోజుకు వెయ్యి క్యూబిక్ మీటర్లకు తగ్గకుండా పనులు జరుగుతున్నాయి. వచ్చే జూలై నాటికి మొత్తం 68 రేడియల్ గేట్లు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. బ్యారేజీ వరకు రూ.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. దీనికి 15 కి.మీ. దూరంలో పంప్‌హౌస్ నిర్మాణం చేయనుండగా.. 12 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ 51 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పనులు పూర్తవగా.. కాంక్రీట్ పనులు ఈ వారంలో ఆరంభించేలా చర్యలు తీసుకున్నారు. వచ్చే ఖరీఫ్‌కు 100 నుంచి 120 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి తరలిస్తామని, మే నెలలో ప్రాజెక్టు ట్రయల్ రన్, జూన్‌లో వెట్ రన్ నిర్వహిస్తామని సీఈ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. -
కాళే శ్వరం వద్దే బ్యారేజీ
► ప్రాణహిత నీరు ఆదిలాబాద్‌కే పరిమితం చేస్తాం ► ఎక్కడ ప్రాణహిత.. ఎక్కడ చేవెళ్ల? ►600 కి.మీ. నీటి తరలింపు సాధ్యం కాదు ► కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు నీరిస్తాం ► 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ► గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ కరువు ► నీళ్లు రాని పథకాలను పెట్టారు.. డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టారు ► నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డను.. నా ప్రజలను మోసం చేయను: సీఎం కేసీఆర్ ► గూడెం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు వివాదంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొదటిసారిగా స్పందించారు. ప్రాణహిత నీటిని ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేస్తామని, గోదావరి నదిపై కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాకు నీటిని తరలిస్తామని స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. దండేపల్లి మండలం గూడెం వద్ద నిర్మించిన శ్రీ సత్యనారాయణస్వామి (గూడెం) ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే.. న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం నాయకులు ప్రాణహిత డిజైన్‌ను మార్చవద్దంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అసహనానికి గురైన కేసీఆర్ వారిపై మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే ఈ కరువు. నీళ్లు రాని సాగునీటి పథకాలు పెట్టారు. నటించేందుకే ప్రాజెక్టులు కట్టారు. అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించారు. ప్రాజెక్టు ఉంటే కాలువలు ఉండవు. కాలువలు నిర్మిస్తే ప్రాజెక్టు ఉండదు. డూప్లికేట్ ప్రాజెక్టులు కట్టారు. ఎస్ఎల్బీసీ 40 ఏళ్లు అవుతోంది. మిషన్‌ను గుట్ట సొరంగంలో సొరగోట్టారు. అడ్వాన్సులు ఇచ్చేశారు. ప్రాణహితకు 120 టీఎంసీలు కేటాయించారు. తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. కమీషన్లతో నాలుగు వేల కోట్లు జేబుల వేసుకున్నరు. ఎక్కడ ప్రాణహిత.. ఎక్కడ చేవెళ్ల? 600 కిలోమీటర్ల దూరం నీటిని తీసుకుపోవడం సాధ్యం కాదు. మధ్యలో సింగరేణి గనులున్నాయి.. రిజర్వు ఫారెస్టు భూములున్నాయి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టు పనులకు అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ లేఖలు రాసింది. ఈ ప్రాజెక్టుతో తమకు ముంపు ఉందని, ఈ పనులు చేస్తే ఫలితం లేని ఖర్చు అవుతుందని రాసిన లేఖల రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ సర్కారు వచ్చాక మహారాష్ట్రతో మాట్లాడితే భూములు మునగకుండా నీళ్లు తీసుకుపోవాలని చెప్పారు. మహారాష్ట్ర భూములు మునుగకుండా ప్రత్యామ్నాయం చూస్తున్నాం. కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్‌కు వెళ్లేలా ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నాం. ప్రాణహితపై డైవర్షన్ ఆనకట్ట కట్టుకుని ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు.. ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ప్రాణహిత నీటిని ఆదిలాబాద్‌కు సరిపెట్టి.. గోదావరిపై కాళేశ్వరం వద్ద బ్యారేజీ కడితే కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశాలున్నాయి’’ అని కేసీఆర్ వివరించారు. ‘‘నేను నిఖార్సయిన తెలంగాణ బిడ్డని. నా ప్రజలను నేను మోసం చేయను. ఒక్క సుక్క నీళ్లు ఎక్కువే రావాల ని చూస్తా గానీ.. అబద్ధాలు చెప్పను. డైవర్షన్ ఆనకట్ట కట్టుకుని, కాలువలను అనుసంధానం చేస్తాం. నేనే స్వయంగా పనులు మొదలు పెట్టిస్తా. ఇందుకోసం రూపకల్పన చేస్తున్నా. ఎస్సారెస్పీ నుంచి నీటిని ఎత్తిపోసుకుని నిర్మల్ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగునీరందిస్తాం. ఏ పరిజ్ఞానం లేకుండా జిల్లా ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. ప్రజలే వారికి బుద్ధి చెప్పాలి. రాబోయే ఏడెనిమిదేళ్లలో జిల్లాలో ప్రతి ఇంచుకు నీళ్లిస్తాం’’ అని వివరించారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు గోదావరి పుష్కరాల తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక్కో జిల్లాలో రెండు, మూడు రోజులు బస్సు యాత్ర చేసి సమస్యలకు పరిష్కార మార్గాలు చూస్తామన్నారు. ఆదిలాబాద్‌లో టూరిజం అభివృద్ధికి జిల్లాలో మంచి అవకాశాలున్నాయన్నారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు వస్తుందని ఇతర ప్రాంతాలతో లింకు ఏర్పడుతుందని చెప్పారు. అడవిని నరకడం ఆపాలి ‘‘ఆదిలాబాద్ జిల్లాలో అడవులను ఆక్రమిస్తున్నారు. అడవులను నరికేస్తున్నారు. అడవిని కాపాడాలి.. జంగల్ ఉన్నది కాబట్టే వర్షాలు పడుతున్నాయి.. వందల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉన్న అడవిని కాపాడుకుని.. చెట్లను పెంచాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు. అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. అటవీ అభివృద్దికి నిధులు మంజూరు చేస్తామని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు నగేశ్, బాల్కసుమన్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.