
వెలుగుల జలసిరి
తూర్పు కనుమల పేరు వినగానే గుర్తొచ్చేవి సహజసిద్ధమైన గెడ్డలు, ఉప్పొంగే జలాలు. అవి ప్రస్తుతం ఎందరికో వెలుగునిస్తున్నవి. మరెందరో రైతులకు అండగా నిలుస్తున్నాయి. కాకులుదూరని కారడవుల నుంచి గోదావరి తీరం వరకు కొండ అంచుల వెంబడి ఒంపు సొంపుల మార్గంలో వేల కిలోమీటర్లు సాగే ఈ ప్రవాహం పర్యాటకులను ఆకట్టుకుంటూనే.. మార్గమధ్యలో ఉన్న విద్యుత్ కేంద్రాలు అన్నింటా సాగి రాష్ట్రంలో వెలుగులు నింపుతోంది. ఉభయగోదావరి జిల్లాల రైతుల పంటలకు ఆసరాగా నిలుస్తోంది.
గోదావరికి డెల్టాకు ఇలా...
ఏటా సీలేరు నుంచి గోదావరి జిల్లాల్లో రబీ పంటకు 50 టీఎంసీల నీరు విడుదల చేస్తుంటారు. డొంకరాయి, మోతుగూడెంలలో విద్యుదుత్పత్తి అనంతరం నీటిని విడుదల చేస్తారు. డిసెంబరు 25 నుంచి ఆంధ్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రస్తుతం విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శబరిలో కలుస్తున్న నీరు నేరుగా గోదావరిలోకి చేరుతుంది. అదంతా మోతుగూడెం విద్యుత్ కేంద్రం నుంచి గోదావరిలోకి కలిసేటప్పటికి సుమారు 5 రోజులు పడుతుంది. ఇది కాక సరిహద్దులోని మాచ్‌ఖండ్ 6 యూనిట్లలో 120 మెగావాట్లు, అనంతరం సీలేరులో 4 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి అనంతరం ఈ ప్రవాహం 30కిలోమీటర్లు కెనాల్ ద్వారా డొంకరాయి డ్యాంకు చేరుకుంటుంది. అక్కడ ఒక యూనిట్ ద్వారా 25 మెగావాట్లు విద్యుదుత్పత్తి అవుతుంది. ఒక్కోసారి ఈ విద్యుత్ కేంద్రం మూతపడితే ఖమ్మం జిల్లా మోతుగూడెం విద్యుత్ కేంద్రానికి నీరు విడుదల చేస్తారు.