అమలాపురం :రైతుల ముక్కుపిండి మరీ నీటి తీరువా వసూలుచేస్తున్న ప్రభుత్వం ఆ నిధులను అన్నదాతల ప్రయోజనాల కోసం ఖర్చుచేయడం లేదు. ప్రతిఏటా ప్రతీ ఏటా ఖర్చు చేయాల్సిన నీటి తీరువా నిధుల్లో సగానికి పైగా కోతపెడుతోంది. రైతుల నోట మన్నుకొడుతోంది. ప్రస్తుతం డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పంట కాలువలు, మురుగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయంటే అందుకు నీటి తీరువా నిధులు ఖర్చు చేయకపోవడమే ప్రధాన కారణమనే విమరశలు వినవస్తున్నాయి.జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో సుమారు 4,82,199 ఎకరాల ఆయకట్టు ఉంది. తూర్పుడెల్టాలో 2,45,333 ఎకరాలు, మధ్యడెల్టాలో 2,01,896 ఎకరాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)లో 35,970 ఆయకట్టు ఉంది. వీటిలో సుమారు 50 వేల ఎకరాలు చెరువులుగా, రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోయాయి. ఖరీఫ్‌లో వరిచేలు, ఇతర పంటలకు నీటితీరువా రూ.150 కాగా, రబీలో రూ.200 వరకు వసూలు చేస్తారు.
అదే చేపల చెరువుకు అయితే రూ.500 నీటి తీరువా రూపంలో వసూలు చేస్తారు. ఇలా గోదావరి డెల్టాలోనే సుమారు రూ.15 కోట్ల వరకు నీటితీరువా వసూలు అవుతోంది. ఇక ఏలేరు పరిధిలో 53,017 ఆయకట్టు ఉండగా ఇక్కడ రెండు పంటలు సాగు చేసేది తక్కువ ఆయకట్టు పరిధిలోనే. అలాగే చాగల్నాడు, ఏజెన్సీలోని ఇతర ప్రాజెక్టుల పరిధిలో ఒక పంటకు నీటి తీరువా వసూలు చేస్తారు. ఇలా మొత్తం మీద జిల్లాలో సుమారు రూ.18 కోట్ల మేర తీరువా వసూలు అవుతోంది. కొంతమంది రైతులు ఒక ఏడాది చెల్లించకున్నా తరువాత ఏడాది వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోంది. రెవెన్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్ పెట్టి మరీ వసూలు చేస్తుంటారు. 2011లో కోనసీమ రైతులు సుమారు 90 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయలేదు. అయినా రెవెన్యూ అధికారులు నీటితీరువా వసూలు చేశారు.
ఏ ప్రాజెక్టు పరిధిలో వసూలైన నీటి తీరువాను అక్కడే రైతుప్రయోజన పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. వసూలైన నీటి తీరువాను నీటి సంఘాలకు 55 శాతం, డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు 20 శాతం, ప్రాజెక్టులకు 20 శాతం, పంచాయతీలకు ఐదు శాతం చొప్పున పంపిణీ చేయాలి. గతంలో వసూలైన నీటి తీరువాను ఆయా సంఘాలకు చెక్కుల రూపంలో అందించేవారు. ఈ నిధులతో పంట కాలువల్లో పూడిక తొలగింపు, లాకులు, లాకుల షటర్లు వంటి ఆధునికీకరణ పనులు చేసేవారు. ఈ కారణంగా శివారు భూములకు సాగునీటి ఇబ్బందులు పెద్దగా ఉండేవి కావు. మైనర్, మీడియం మురుగునీటి కాలువల్లో పూడిక, గుర్రుపుడెక్క తొలగింపు పనుల వల్ల ముంపు తీవ్రత పెద్దగా ఉండేది కాదు. నిధులతో చేపట్టాల్సిన పనులను ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ స్థాయి అధికారి అనుమతి సరిపోయేది. అయితే నిధులు నేరుగా కేటాయించడం వల్ల అవినీతి జరుగుతుందని, నిధులను ట్రెజరీల ద్వారా చెల్లించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎస్‌ఈ స్థాయి అధికారి కాకుండా ఇరిగేషన్ కమాండ్ ఏరియా డవలప్‌మెంట్ అథారిటీ (కడా), ఇరిగేషన్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) అనుమతులు తప్పని సరి చేసింది. దీని వల్ల పనులకు అనుమతి రావడం తీవ్ర ఆలస్యం కావడం, చేసిన పనులకు నిధులు రాకపోవడం ఆరంభమైంది.
దీనితో ఏటా రూ.ఆరేడు కోట్ల నిధులు కూడా ఖర్చు కావడం లేదు. మిగిలిన నిధులను ప్రభుత్వం ఇతర పనులకు కేటాయించడం ఆరంభించింది. దీంతో గత నాలుగైదేళ్ల నుంచి ఏటా రూ.పది కోట్లకుపైగా నీటి తరువాత సొమ్ము ప్రభుత్వం జమ చేసుకుంటున్నట్టయింది. అలాగే ఆయా సంఘాలకు రూ.ఏడు కోట్లకుపైగా బకాయి సొమ్ములు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం నీటి సంఘాలు ఏలుబడిలో లేనప్పటికీ ప్రత్యేకాధిరుల వ్యవస్థ ఉన్నందున వాటి ఆధ్వర్యంలో పనులు చేయించే సౌలభ్యం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని పాత విధానంలో నిధులు మంజూరు చేయాలని, ఎస్‌ఈ స్థాయిలో పనులకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ కొంత కాలంగా వినిపిస్తోంది. గత జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇదే విషయాన్ని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు లేవనెత్తారు. నేరుగా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. అదే జరిగితే నీటి తీరువా నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసుకునే అవకాశముంటుంది.
ఇదిలా ఉండగా, ప్రస్తుత గోదావరి డెల్టాలో రబీ నీటి ఎద్దడి పొంచి ఉంది. పంట బోదెలు, చానళ్లు వంటివే కాకుండా ప్రధాన కాలువలూ పూడుకుపోవడంతో శివారుకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని సేకరించేందుకు రూ.పది కోట్ల వరకు నిధులవసరమని అధికారులు తేల్చిచెబుతున్నారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిధులను నీటి తీరువా నిధుల నుంచి కేటాయించే అవకాశముందని సమచారం. అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి నీటి తీరువా నిధులతో వచ్చే క్లోజర్‌లో కాలువలపై మరమ్మతు పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
వసూళ్లు వారెవ్వ..పనులు హవ్వ
Published Tue, Jan 20 2015 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement