డాబా ఇల్లు నేలమట్టం... పాక్షికంగా దెబ్బతిన్న మరో నాలుగు ఇళ్లు
14 మందికి గాయాలు... ఒకరి పరిస్థితి విషమం
బాణసంచా తయారీ వల్లేనని అధికారుల ప్రాథమిక అంచనా
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన సమీపాన రావులచెరువు ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో విస్ఫోటం సంభవించింది. డాబా ఇల్లు నేల కూలి తునాతునాకలైంది. మొత్తం 14 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... రావులచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొవ్వాల నాగేశ్వరరావుకు చెందిన డాబా ఇంట్లో ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇల్లు పూర్తిగా ధ్వంసమై నేలకూలిపోయింది. ఇరుగు పొరుగున ఉన్న నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న నలుగురు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వారితోపాటు సమీపంలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.
తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రెండు బైక్‌లు కూడా ఎగిరి కింద పడి కాలిపోయాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఇంట్లో అప్పుడప్పుడూ బాణసంచా తయారు చేస్తారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ బి.కృష్ణారావు పరిశీలించారు. బాణసంచా పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పీ తెలిపారు. విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపిస్తున్నామని, వారి నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో జి.కేశవవర్ధనరెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment