Huge explosion
-
తమిళనాడు: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
విరుదనగర్: తమిళనాడులో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదనగర్ జిల్లా చతుర్ దగ్గర ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగారు. ఫ్యాక్టరీలో భారీగా దీపావళి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. -
అమలాపురంలో విస్ఫోటం
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన సమీపాన రావులచెరువు ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో విస్ఫోటం సంభవించింది. డాబా ఇల్లు నేల కూలి తునాతునాకలైంది. మొత్తం 14 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... రావులచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొవ్వాల నాగేశ్వరరావుకు చెందిన డాబా ఇంట్లో ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇల్లు పూర్తిగా ధ్వంసమై నేలకూలిపోయింది. ఇరుగు పొరుగున ఉన్న నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న నలుగురు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వారితోపాటు సమీపంలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రెండు బైక్‌లు కూడా ఎగిరి కింద పడి కాలిపోయాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఇంట్లో అప్పుడప్పుడూ బాణసంచా తయారు చేస్తారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ బి.కృష్ణారావు పరిశీలించారు. బాణసంచా పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పీ తెలిపారు. విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపిస్తున్నామని, వారి నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో జి.కేశవవర్ధనరెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
చర్లపల్లిలో భారీ పేలుడు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మధుసూదన్‌రెడ్డి నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్యాకేజీ కవర్ల పరిశ్రమలో భారీ పేలుడు
షాద్‌నగర్: ఆహారాన్ని ప్యాక్ చేసే సిల్వర్ కవర్లను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా.. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారేనని తెలిసింది. పరిమితికి మించిన వేడితో.. షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కాశిరెడ్డిగూడ శివారులో బ్లెండ్ కలర్ పరిశ్రమ ఉంది. ఇందులో ఫుడ్ ప్యాకేజీకి సంబంధించిన సిల్వర్ కవర్లను తయారు చేస్తారు. ఇందుకోసం మెటాలిక్ పొడిని వినియోగిస్తారు. కార్మికులు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జాజిపతుర, పూర్ణాసింగ్, మందిరి,రాజుసాన్, మంజుదాస్, ప్రదీప్మాన్, సత్య, గిరిధర్‌సింగ్, రాహుల్ఘడ్, సునీల్ ఎంకీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకున్నారు. పేలుడు షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీలో కలర్ తయారు చేసే క్రమంలో వాడే మెటాలిక్ పొడి పరిమితికి మించి వేడి (ఓవర్ హీట్) కావడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఐదుగురు మృతి
సాక్షి, తమిళనాడు: మదురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు. వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే కార్మికుడితో సహా నలుగురు పురుషులు, ఒక మహిళ పనిచేస్తుండగా ఒక్కసారిగా భవనంలో పటాకులు పేలి మూడు భవనాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో అమ్మాసి, వల్లరసు, గోబి, విక్కీ, ప్రేమ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు -
భారీ శబ్దం కలకలం : ‘భూకంపం సంభవించిందా ఏంటి’
బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సమీప ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ శబ్దం వినిపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ శబ్దం ముఖ్యంగా బిదాది ప్రాంతం నుంచి వెలువడినట్లు.. బాంబు పేలినప్పుడు ఎంత భారీ శబ్దం వినిపిస్తోందో.. అలాంటి సౌండే వినిపించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ బారీ శబ్దం వల్ల జనాలు తీవ్ర ఆందోళనకు, గందరగోళానికి గురయ్యారు. భూకంపం వచ్చిందా.. లేక ఎక్కడైనా భారీ పేలుడు సంభవించిందా అంటూ నెటిజనులు సోషల్ మీడియాలో ప్రశ్నల మోత మోగించారు. ఇక ఈ వింత శబ్దంపై కర్ణాటక పోలీసులు స్పందించారు. బెంగళూరు, దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు సంభవించలేదని తెలిపారు. అలానే రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం భారీ శబ్దం వినిపించిందని పేర్కొంటున్న ప్రాంతాల్లో ఎలాంటి భూకంపం చోటు చేసుకోలేదని.. అలానే భూమి పొరల్లో కూడా ఎక్కడా.. ఎలాంటి మార్పులు జరగలేదని తెలిపారు. (చదవండి: కర్ణాటక: ఆ ప్రాంతం మరో గోవా కానుంది..) ‘‘అంతేకాక భారీ శబ్దం వినిపించింది అంటున్న సమయంలో ఏదైనా భూకంప సంకేతాలు వెలువడ్డాయా లేదా అని తెలుసుకోవడం కోసం భూకంప పరిశీలనల కేంద్రం డేటాను విశ్లేషించడం జరగింది. సీస్మోగ్రాఫ్‌లు స్థానికంగా ఎలాంటి ప్రకంపనలు, భూకంపం సంకేతాలను చూపించలేదు’’ అని అధికారులు తెలిపారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మరీ ఈ శబ్దం ఎక్కడ నుంచి వెలువడింది.. దానికి కారణం ఏంటనే దాని గురించి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. (చదవండి: భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ) ఇక 2021, జూలై 2న బెంగళూరులో ఇదే తరహా శబ్దం వినిపించింది. బెంగళూరులో జూలై 2న కూడా ఇదే విధమైన ధ్వని వినిపించింది, ఇది ధ్వని వేగం కంటే వేగంగా వెళ్లినప్పుడు జెట్ విమానం నుంచి వెలువడే సోనిక్ బూమ్ అని భావించారు. బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాలను పరీక్షించే సమయంలో ఈ శబ్దం వెలువడినట్లు భావించారు. అయితే భారత వైమానిక దళం సోనిక్ బూమ్ వాదనను ఖండించింది. మరోసారి ఇదే తరహా శబ్దం వినిపించడంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: పడిలేచిన పట్టణం.. ఇక్కడికి వెళ్తే యూరప్ చూసినట్లే! -
భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు
పశ్చిమ గోదావరి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి అక్కడ భారీ గుంత ఏర్పడింది. ఖాలీ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
13 మంది సజీవదహనం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ధులే జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. రసాయన కర్మాగారంలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. శిరపూర్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ సంజయ్ ఆహీర్ తెలిపిన వివరాల మేరకు.. శిరపూర్ సమీపంలోని వాఘాడీ గ్రామ సమీపంలో ఉన్న రుమిత్ కెమికల్ కంపెనీలో శనివారం ఉదయం సుమారు 9.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున మంటలు కూడా వ్యాపించాయి. పేలుడు తీవ్రతకు కంపెనీ ఆవరణలోని రేకుల షెడ్లు, పైకప్పు కూలిపోయాయి. దీంతో అనేక మంది కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయారు. మంటల తీవ్రతకు కంపెనీ పరిసరాల్లో పార్కింగ్ చేసిన వాహనాలతోపాటు చెట్లు కూడా మంటలకు కాలిపోయాయి. ఈ ఘటనలో 13 మంది చనిపోగా 65 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను ఆర్పారు. ముందు జాగ్రత్తగా పరిసరప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. -
నౌకలో భారీ పేలుడు
సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): విశాఖ తీరానికి సుమారు మూడు నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న చిన్న నౌక...టగ్‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో సముద్రంలో దూకి ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. 15మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముడి చమురు నౌకలను నిలిపి ఉంచే సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్పీఎం) టెర్మినల్ వద్ద హెచ్‌పీసీఎల్‌కు చెందిన అద్దె నౌక ‘టగ్’ కోస్టల్ జాగ్వార్లో (ఔట్ హార్బర్లో నిలిపి ఉన్న నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకువచ్చే నౌకను టగ్‌గా వ్యవహరిస్తారు) ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. హెచ్‌పీసీఎల్‌కు సంబంధించిన ముడి చమురును నౌకల్లోకి తరలించే భారీ నౌకలో ఆదివారం రాత్రి గాలుల ధాటికి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. వాటిని సరిచేసేందుకు కోస్టల్ జాగ్వార్ టగ్‌లో సోమవారం ఉదయం సిబ్బంది వెళ్లారు. టగ్‌ను భారీ నౌకకు హోస్ పైపులతో అనుసంధానించే క్రమంలో టగ్ అడుగు భాగం నుంచి ఆయిల్ లీక్ అయి రాపిడికి ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. క్షణాల్లోనే టగ్ 70 శాతం వరకు తగలబడింది. ఆరుగురు సిబ్బంది మంటల్లో చిక్కుకోగా వారి శరీరం చాలావరకు కాలిపోయింది. పేలుడు సమయంలో ప్రాణాలను రక్షించుకునేందుకు ఎనిమిది మంది సముద్రంలోకి దూకేశారు. వీరిలో ఆరుగురు ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఆసీస్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైందని హార్బర్ ఏసీపీ టి.మోహన్‌రావు తెలిపారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ కోస్ట్‌గార్డ్, పోర్టుకు చెందిన ఐదు నౌకలు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని రక్షించడంతో పాటు నౌకలోని మంటలను అదుపుచేశాయి. అగ్నిప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ విచారణకు ఆదేశించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నవారు.. వనమాడి అన్నవరం (40)–తూర్పు గోదావరి జిల్లా, అన్సార్ (39)–కోల్‌కతా, తాశారపు భరధ్వాజ్ (23)–విశాఖపట్నం, జస్వీర్ సింగ్ (46)– ఉత్తరప్రదేశ్, జువిన్ జోషి (24)– కేరళ, చింతపల్లి తండేలు (48)– శ్రీకాకుళం, ఎచ్చెర్ల -
డాంబర్ మిక్సింగ్ ప్లాంట్‌లో భారీ పేలుడు
తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడ శివారులో శుక్రవారం ఓ డాంబర్ మిక్సింగ్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఆయిల్ ట్యాంక్ బాయిలర్ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక్కసారిగా విస్పోటనం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. తాండూర్ మండలం రేపల్లెవాడ గ్రామ శివారు ప్రాంతంలో గ్లోబల్ సిరామిక్స్ ఫ్యాక్టరీ ఉంది. ఆయిల్ ట్యాంక్ బాయిలర్ వద్ద ప్లాంట్ యజమాని ఉండి కూలీలతో పనులు చేయిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో పేలుడు జరిగి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. పేలుడు ధాటికి ఆయిల్ ట్యాంక్ ఘటనాస్థలి నుంచి ఎగిరిపోయి వంద మీటర్ల దూరంలో పడింది. ఈ ఘటనలో రేపల్లెవాడకు చెందిన ప్లాంట్ యజమాని సలావుద్దీన్ సహా ఆరుగురు కూలీలపై మరిగించిన డాంబర్ మీదపడటంతో శరీరం కాలిపోయి తీవ్ర గాయాలయ్యాయి. సలావుద్దీన్, సాయితేజ, బ్రిజేష్, కేశవ్‌గౌడ్ శరీరం 80 శాతం వరకు కాలిపోయింది. క్షతగాత్రులకు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై రాకెట్లతో దాడి
కాబూల్: భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. మూడు రాకెట్లను ప్రయోగించారు. ఇందులో ఒకటి పార్లమెంటు ఆవరణలో పడగా మరో రెండు కాస్తంత దూరంలో పేలాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ బాంబు పేలుళ్ల సమయంలో దిగువ సభకు చెందిన సభ్యులు, వోలెసి జిర్గా సభ్యులు పార్లమెంటులో లోపల ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు. ముఖ్యమైన అధికారులు లోపలికి వెళుతున్న సమయంలోనే ఈ రాకెట్లను ప్రయోగించినట్లు చెప్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటి దాడులు గతంలో తాలిబన్లు చేశారు. ఈ భవనాన్ని భారత్ కట్టించి ఇవ్వగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో కూడా మోదీ మాట్లాడారు. -
న్యూస్ చానల్ బస్సుపై ఆత్మాహుతిదాడి
ఏడుగురు మృతి; 24 మందికి గాయాలు కాబూల్: అఫ్గానిస్తాన్ తొలిసారి ఒక మీడియా సంస్థ లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. రాజధాని కాబూల్‌లో, రష్యా రాయబార కార్యాలయం దగ్గర ప్రముఖ న్యూస్ చానల్ ‘టోలో’ ఉద్యోగులను ఇంటికి తీసుకువెళ్తున్న మిని బస్సుపై బుధవారం ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. దాడిలో సంస్థకు చెందిన ఏడుగురు ఉద్యోగులు చనిపోయారు. 24 మంది గాయాల పాలయ్యారు. భారీ పేలుడుతో బస్సుకు మంటలంటుకోవడంతో పలువురు ఉద్యోగులు లోపలే సజీవదహనమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్నవారిలో న్యూస్ చానల్‌కు చెందిన గ్రాఫిక్స్, డబ్బింగ్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉన్నారు. కుందుజ్ పట్టణంలో తాలిబాన్ ఉగ్రవాదులు ఒక యువతిపై అత్యాచారం చేశారన్న వార్తను ప్రసారం చేయడంతో కొన్ని నెలల క్రితమే.. టోలో, 1టీవీ చానళ్లపై దాడులు చేస్తామని ఉగ్రవాదులు చెప్పారు.. ఆ వార్తను సైతాను వ్యవస్థల అబద్ధపు ప్రచారంగా పేర్కొన్నారు. తాలిబాన్‌తో చర్చలను పునః ప్రారంభించే నిమిత్తం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, అమెరికా దేశాల ప్రతినిధుల భేటీ రెండు రోజుల క్రితమే కాబూల్‌లో జరగడం గమనార్హం. తాలిబాన్ ప్రతినిధులెవ్వరూ ఆ భేటీలో పాల్గొనలేదు. -
కోవైలో భారీ పేలుడు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కోయంబత్తూరులో గురువారం ఉదయం ఒక ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొక బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. కోవై ఉక్కడం సెల్వపురం బైపాస్ రోడ్డులోని కెంబట్టికాలనిలోని ఒక తోటలో చంద్రన్, భార్య దేవి (38) ఆస్బెస్టాస్ షీట్లతో నిర్మించిన ఇంటిలో నివసిస్తున్నారు. అదే ఇంటిలోని మరో పోర్షన్‌ను అద్దెకిచ్చారు. గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఇంటిలోని ఒక పోర్షన్లో భారీపేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 12 అడుగుల ఎత్తై గోడలతో నిర్మించిన ఆ ఇల్లు నేలమట్టమైపోయింది. పేలుడుతో బెంబే లెత్తిన ఇరుగుపొరుగు వారు భయంతో దూరంగా పారిపోయారు. ఈ ప్రమాదంలో 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. దేవి కుమారుడు నవీన్ (17) తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటికి సమీపంలోని ఒక కుక్క కూడా శిథిలాల కింద నలిగి ప్రాణాలు విడిచింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు బీటలు వారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడు సంభవించిన ఇంటి నుంచి అనేక జిలిటిన్ స్టిక్కులు, బాణ సంచాకు వినియోగించే మందు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో బాణ సంచా లేదా బాంబులు తయారుచేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. -
గ్యాస్ సిలిండర్లు పేలి భారీ విస్ఫోటనం
♦ మహిళ సజీవదహనం ♦ రెండు పూరిళ్లు, గడ్డివామి దగ్ధం ♦ 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు ఆహుతి పోలిపాడు (ఓజిలి) : ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో రెండు గ్యాస్సిలిండర్లు పేలి భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనం కాగా, రెండు పూరిళ్లల్లో 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.70 వేలు నగదు, బట్టలు, ఇతర సామగ్రి మంటల్లో ఆహుతయ్యాయి. రెండు పూరిల్లు, గడ్డివామి దగ్ధమయ్యాయి. ఈ విషాద ఘటన మండలంలోని భువనగిరిపాళెం పంచాయతీ పోలిపాడులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన పుచ్చకాయల నాగభూషణమ్మ (51), కోడలు నారాయణమ్మ ఇంటిలో చిన్నపాపతో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో పాప ఆకలికి ఏడ్చింది. దీంతో మనమరాలికి పాలు కాసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించగా, ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి దట్టమైన మంటలు వ్యాపించాయి. ఇంటిలోనే ఉన్న మరో పుల్ సిలిండర్ కూడా మంటల ధాటికి పేలిపోవడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దీంతో పూరిల్లు తాటి దబ్బలు నాగభూషణమ్మపై పడటంతో మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. హఠాత్ పరిణామంతో కోడలు నారాయణమ్మ చిన్నపాపను తీసుకుని ఇంటి బయటకు పరుగెత్తింది. గ్యాస్ సిలిండర్లు పేలి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె కుమారుడు నారాయణ, చుట్టు పక్కల వాళ్లు బిందెలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న మరో పూరిల్లు, ఒక గడ్డివామి ఆగ్నికి ఆహుతయ్యాయి. అప్పటి వరకు తమతోనే ఉన్న నాగభూషణమ్మను అంతలోనే మృత్యువు కబళించడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న ఎస్సై సాంబశివరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగభూషణమ్మ మృతదేహం పూర్తిగా మంటల్లో కాలిబూడిదైపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్తపేట ఘటనలో గాయపడిన ముగ్గురి మృతి
రాజమండ్రి(కొత్తపేట): తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పెలివెలలో మందు గుండు సామగ్రి తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రం గాయపడ్డారు. వీరంతా కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వీరిలో ముగ్గురు పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కొత్త పేట గ్రామంలోని కొబ్బరి తోటలో దూలం కొటేశ్వర రావు అనే వ్యక్తి అనధికారంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడుతో ఇటుక గోడలు, సిమెంట్ రేకులతో నిర్మించిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. అ సమయంలో సమీప గ్రామాలకు చెందిన ఐదుగురు అక్కడ పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడి షెడ్డు శిథిలాల కింద ఉండిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి, శిథిలాలను తొలగించారు. గాయపడిన వారిని స్తానిక ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు మృతిచెందారు. -
కొత్తపేటలో.. భారీ పేలుడు
♦ అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో ఘటన ♦ ఐదుగురికి తీవ్ర గాయాలు వారిలో ముగ్గురి పరిస్థితి విషమం ♦ పేలుడు తాకిడికి ఉడికిన దేహాలు.. ఊడిన చర్మం ♦ నరకయాతన అనుభవించిన క్షతగాత్రులు ♦ ధ్వంసమైన తయారీ కేంద్రం కొత్తపేట : స్థలం : కొత్తపేట మండలం పలివెల రెవెన్యూ గ్రామం.. సమయం : బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ఒక్కసారిగా భారీ పేలుడు.. ఆ ప్రాంతమంతా బాణసంచా పేలుళ్లతో దద్దరిల్లింది... అంతా అయోమయం.. కొద్ది సేపటికి తేరుకున్న వారు.. కొబ్బరితోటలో అనధికారికంగా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిందని గుర్తించారు. అక్కడికి వెళ్లే సరికి ఆ ప్రాంతంలో ఉడికిన దేహాలు, ఊడిన చర్మాలతో కొందరు క్షతగాత్రులుగా పడి ఉన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కొత్తపేట ప్రధాన గ్రామానికి పడమర దిశన బొబ్బర్లంక-అమలాపురం కాలువ అవతల అంబాజీపేట తూము వద్ద పలివెల రెవెన్యూ గ్రామ పరిధిలోని కొబ్బరి తోటలో దూలం కోటేశ్వరరావు అనే వ్యక్తి అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సంభవించిన భారీ పేలుడుతో ఇటుక గోడలు, సిమెంట్ రేకులతో నిర్మించిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో సమీప గ్రామాలకు చెందిన ఐదుగురు అక్కడ పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి వారు తీవ్ర ంగా గాయపడి షెడ్డు శిథిలాల కింద ఉండిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అగ్నిమాపక అధికారి సీహెచ్ నాగేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి, శిథిలాలను తొలగించారు. నరకయాతన... ప్రమాదంలో మద్దుల మెరకకు చెందిన రాయి సురేష్(35), పెదరాముడినూతి మెరకకు చెందిన వాసంశెట్టి శ్రీరాములు(60), గోగివారిపేటకు చెందిన సాకా నాగరాజు(30) చర్మం ఊడి, అన్ని అవయవాల నుంచి రక్తం కారుతూ తీవ్రవేదన అనుభవిస్తున్నారు. మార్కెట్ వీధికి చెందిన మావూరి శ్రీను(సామర్లకోట శ్రీను),సత్యచంద్ర థియేటర్ ప్రాంతానికి చెందిన పరమట వీరవెంకటసత్యనారాయణ చర్మం కాలి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మావూరి శ్రీను, సత్యనారాయణ సంఘటన జరిగిన కొద్దిసేపటికే యజమాని కోటేశ్వరరావు తన కారులో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి, పరారైనట్టు సమాచారం. కాకినాడ తరలింపు రావులపాలెం సీఐ పీవీ రమణ సంఘటన స్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను కాలువగట్టుపైకి చేర్చి అక్కడి నుంచి 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి అక్కడి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఆ ఐదుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, అమలాపురం ఆర్డీఓ జి గణేష్‌కుమార్, డీఎస్పీ ఎల్.అంకయ్య, తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఎస్సై డి.విజయకుమార్ సందర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించండి : ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట : కొత్తపేటలో బాణసంచా పేలుడు సంఘటనలో క్షతగాత్ర ులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కాకినాడ జీజీహెచ్ వైద్యులను ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోరారు. బుధవారం కుటుంబ సమేతంగా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి వెళ్లిన ఆయన కొత్తపేటలో బాణసంచా పేలుడు ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులను ఆరా తీసి, పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని వైద్యులను ఫోన్లో సంప్రదించారు. గురువారం కాకినాడ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నట్టు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తెలిపారు. అనధికార తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోండి : హోంమంత్రి రాజప్ప మారుమూల ప్రాంతాల్లో అనధికారికంగా బాణసంచా తయారు చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ఎస్సీ రవిప్రకాష్‌కు ఆదేశాలు జారీ చేశారు. కొత్తపేటలో బుధవారం జరిగిన పేలుడు సంఘటన విషయం తెలుసుకున్న ఆయన రాజమండ్రి నుంచి హుటాహుటిన కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరామర్శిం చారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనధికార బాణసంచా తయారీ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. ‘వర్షం రాకుంటే పెను ప్రమాదం జరిగేది’ కుమార్తె పుట్టిన రోజన్నా వినలేదు క్షతగాత్రుడి మేనల్లుడి ఫిర్యాదు కొత్తపేట : బాణసంచా తయారీ కేంద్రంలో ఎప్పుడూ సుమారు 10 మంది పని చేసేవారని, వర్షం రావడం వలన కొంత మంది పనికి రాలేదని లేకుంటే పెను ప్రమాదమే సంభవించేదని సంఘటన స్థలం వద్ద పలువురు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది మహిళలు కూడా ఇక్కడ పనిచేస్తారని వారు వెల్లడించారు. బలవంతంగా తీసుకె ళ్లాడు... తన రెండో కుమార్తె పుట్టిన రోజని, బుధవారం పనికి రానని ఎంత చెప్పినా వినకుండా తన మావయ్యను యజమాని దూలం కోటేశ్వరరావు బలవంతంగా తన కారులో తీసుకువెళ్లాడని బాణసంచా పేలుడు బాధితుడు రాయి సురేష్ మేనల్లుడు దార్ల సురేష్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు. వికలాంగుడైన సురేష్ ఇద్దరు ఆడపిల్లలని, కొన్నేళ్లుగా కోటేశ్వరరావు వద్దే పనిచేస్తున్నాడని, ఈ నేపథ్యంలో అతడికి రూ.ఐదు వేలు బాకీ పడ్డాడని, అది తీర్చే నిమిత్తం పని చేసేందుకు బలవంతంగా సురేష్‌ను కారు ఎక్కించుకుని కోటేశ్వరరావు తీసుకువెళ్లాడని మేనల్లుడు సురేష్ జేసీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేశాడు. మరో క్షతగాత్రుడు వాసంశెట్టి శ్రీరాములు భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. పిల్లలు లేకపోవడంతో బంధువుల అమ్మాయిని పెంచుకుంటున్నాడు. సాకా నాగరాజుకు కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమకాలు పోయింది. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే మావూరి శ్రీనుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సామర్లకోట శ్రీను ఎనిమిదేళ్ల క్రితం బాణసంచా పని నిమిత్తం కొత్తపేట వచ్చి స్థిర పడ్డాడు. పరమట సత్యనారాయణ అవివాహితుడు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు. -
పేలిపోయిన అమెరికా రాకెట్!
ప్రయోగించిన ఆరు సెకన్లకే విస్ఫోటం రూ.1,225 కోట్లు బుగ్గి పాలు వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కాంట్రాక్టులో భాగంగా ప్రైవేటు కంపెనీ ఆర్బిటల్ సెన్సైస్ కార్పొరేషన్ ప్రయోగించిన మూడో రాకెట్ పేలిపోయింది. ప్రయోగించిన ఆరు సెకన్లకే మొదటిదశ కూడా పూర్తికాకముందే ముక్కలుచెక్కలైన అంటారీజ్ రాకెట్ భారీ విస్ఫోటంతో నేలరాలింది. అమెరికాలోని వర్జీనియా తీరం నుంచి మంగళవారం సాయంత్రం 6:22 గంటలకు నిర్వహించిన ఈ ప్రయోగం విఫలం కావడంతో 2,267 కిలోల బరువైన 26 మినీ ఉపగ్రహాలు, పరికరాలు, మానవరహిత వ్యోమనౌక సిగ్నస్ అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయోగవేదిక ప్రాంతంలో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో రూ.1,225 కోట్లు బుగ్గిపాలు అయ్యాయి. ఈ రాకెట్ ప్రయోగం విఫలం కావడంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా వెంటనే అధికారులతో అత్యవసర భేటీలో వివరాలు తెలుసుకున్నారు. అయితే, రాకెట్ పేలిపోవడానికి కారణాలేంటన్నది ఇంకా తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తామని నాసా పేర్కొంది. -
నిజం నిప్పుల్లో సమాధి!
పిఠాపురం :యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో దీపావళి తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటం అనేక మంది కార్మికుల జీవితాల్లో చీకటి నింపింది. నెల రోజులుగా అనేక మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. సోమవారం కూడా 30 మంది వరకు బాణసంచా తయారీలో నిగ్నమయ్యారు. దీపావళి ఇక మూడు రోజులే ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు దారులు వస్తారని భావించిన యజమాని అప్పారావు అతడి తల్లి లక్ష్మి బాణసంచా తయారీ కేంద్రాన్ని ఆనుకుని ఒక టెంట్ వేసి అక్కడ కొంత సామగ్రి ఏర్పాటు చేశారు. ఓ వైపు అమ్మకాలు సాగిస్తూనే, మరో వైపు షెడ్ లోపల పనిచేస్తున్న కార్మికులను పర్యవేక్షిస్తున్నాడు అప్పారావు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తల్లీ కొడుకులిద్దరూ భోజనాలు చేశారు. కార్మికులు భోజనాలు ముగించి మళ్లీ పనిలో నిమగ్నమయ్యారు. సమయం మూడు గంటలు దాటింది .. లోపల షెడ్డులో నాలుగు గోడల మధ్య ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా భారీ విస్ఫోటం .. టెంట్లో ఉన్నవారు ఏంజరిగిందో ఊహించే లోపే భారీ పేలుళ్లు, ప్రాణభయంతో పరుగులు తీస్తున్న కార్మికులు. అయినా అప్పారావు లోనికి వెళ్లే సాహసం చేశాడు. ఇంతలో గోడ కాలిపై కూలిపోవడంతో ప్రాణాలను అరచేతపట్టుకుని అతడు పరుగులు తీశాడు. కొద్దిదూరం వెళ్లి చూస్తే కనిపించేదంతా అగ్నికీలలే. కార్మికుల ఆర్తనాదాలు బాంబు శబ్దంలో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో వచ్చిన శబ్దాలు, కమ్ముకున్న పొగలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. మందుగుండు సామగ్రి అంతా ఒక్కసారిగా పేలడంతో కార్మికుల శరీరాలు వంద మీటర్ల ఎత్తున ఎగిరిపడ్డాయి. ఏం జరిగిందో తెలుసుకుందామంటే చెప్పడానికి లోపల పనిచేస్తున్న వారెవరూ ప్రాణాలతో లేరు. కాలిన గాయాలతో బయటపడ్డ కొందరు జరిగిన విషయం చెప్పేందుకు నోరు మెదపలేని పరిస్థితి. వారిలో కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం ఎలా సంభవించిందనేది ప్రశ్నార్థకంగా మిగలనుంది. షెడ్డు నిర్మాణం విరుద్ధమే తయారీకి ఉపయోగించే పదార్థాలు ఎప్పుడైనా పేలి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అటువంటి వాటిని తయారు, నిల్వ చేసే షెడ్లు గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేవిగా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన మణికంఠ ఫైర్ వర్క్స్‌లో మాత్రం షెడ్డు చుట్టూ గోడలు ఉండడంతో గాలి, వెలుతురు లోనికి వెళ్లలేదు. దీని వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో పేలితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని, చుట్టూ గోడలు ఉండడంతో విస్ఫోట తీవ్రత ఎక్కువగా ఉందని వారి వాదన. శోకసంద్రంలో మూడు గ్రామాలు మృత్యువాతపడిన కార్మికుల కుటుంబాల రోదనతో మూడు గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. 18 మంది మృతి చెందడంతో ఎక్కడ చూసినా గుండెలవిసేలా రోదిస్తున్న వారే కనిపిస్తున్నారు. వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. -
దద్దరిల్లిన బందరు
దీపావళి బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు * ఎంబీఏ విద్యార్థి మృతి * మరో ఐదుగురికి గాయాలు * జిల్లాలో సంచలనం మచిలీపట్నం : దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించడంతో మంగళవారం బందరు దద్దరిల్లింది. అర్ధగంట పాటు భారీగా శబ్దం రావడంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. జోగి రాంబాబు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిగా బందరు బైపాస్‌రోడ్డు వెంబడి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాంబాబు తాను ఉంటున్న ఇంటి ఎదురుగానే చిన్న హోటల్ నిర్వహిస్తున్నారు. కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు కిరణ్, తులసీ, ఒక కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. కిరణ్ గుడ్లవల్లేరులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. తులసీ ఇంటర్మీడియెట్, నాగలక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి తయారుచేస్తున్నారు. కిరణ్ ఉల్లిపాయ బాంబులు తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించటంతోపాటు దట్టంగా పొగలు కమ్ముకోవడంతో బయటకు పరుగులు తీశారు. అయితే, పేలుడు ధాటికి చెలరేగిన మంటల్లో చిక్కుకుని కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. ఇంట్లో ఉన్న కిరణ్ తండ్రి రాంబాబు, సోదరుడు, సోదరి, తులసీ స్నేహితుడు మాచవరానికి చెందిన దిరిశన చాణుక్య గాయపడ్డారు. పేలుడు సంభవించిన పక్క గదిలో ఉన్న ఇంటి యజమాని బంధువు పామర్తి నాగబాలకు కూడా గాయాలయ్యాయి. అర్ధగంటపాటు పేలుడు, దట్టమైన పొగ మందుగుండు సామగ్రి పేలిన ఇంటి నుంచి అర్ధగంట పాటు పేలుడు శబ్దాలు వినిపించాయి. పేలుడు జరిగిన ఇంటి నుంచి దట్టంగా పొగ బయటికి రావడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన గదిలో శ్లాబు పిల్లర్లు బీట్లిచ్చాయి. ఈ ఇంట్లో ఆరు గదులు ఉండగా, అన్నింటిలోనూ వస్తువులు ఛిద్రమయ్యాయి. గుమ్మాలు, కిటికీలు, వాటి తలుపులు ఊడి కిందపడ్డాయి. ప్రహరీ, ఇంటి గోడ ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం పెద్దగా రావటంతో తొలుత అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని భావించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసి, కిరణ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పు తున్న సమయంలోనూ మందుగుండు సామగ్రి పేలుతూనే ఉంది. గాయపడిన వారు కింద పడిపోవటంతో ఇల్లంతా రక్తసిక్తంగా మారింది. పేలుడు సంభవించిన గృహం వరండాలో ఐదు సంచుల తాటాకు టపాకాయలు ఉన్నాయి. ఇవి పేలకపోవడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో పేలుడు సంభవించటంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ సోదరుడు తులసీకి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మాట్లాడలేని స్థితిలో ఉన్న చాణుక్య.. కిరణ్ అన్నయ్యకు ఏమైదంటూ దీనంగా పోలీసులను అడగడం చూపరులను కలచివేసింది. గాయాలపాలైన కిరణ్ సోదరి నాగలక్ష్మి చికిత్స పొందుతూనే ‘మా అన్నయ్య చనిపోయాడు..’ అంటూ కన్నీరుమురుగా విలపించింది. కిరణ్‌ను ఎంబీఏ చదివిస్తున్నామని, చేతికొచ్చే దశలో కళ్లెదుటే చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు రోదించారు. బాధితులను పరామర్శించిన మంత్రి రవీంద్ర ఈ ఘటనలో గాయపడిన బాధితులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం రాత్రి పరామర్శించారు. పేలుడు జరిగిన గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోగి తులసీ తదితరులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారులు బైపాస్‌రోడ్డులో పేలుడు సంభవించిన ఇంటిని బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, తహశీల్దార్ నారదముని, చిలకలపూడి సీఐలు సత్యనారాయణ, సుబ్బారావు, ఎస్ఐలు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. -
చైనా ఫ్యాక్టరీలో పేలుడు
68 మంది మృతి, 187 మందికి గాయాలు బీజింగ్: తూర్పు చైనాలోని జియాంగ్జు రాష్ట్రంలో ఒక లోహ పరిశ్రమలో శనివారం భారీ పేలుడు సంభవించింది. 68 మంది మృతి చెందగా, 187 మంది గాయపడ్డారు. షాంఘై నగరానికి చేరువలోని కున్షాన్ పట్టణంలో ఉన్న ప్రఖ్యాత వీల్ హబ్ పాలిషింగ్ కంపెనీ కున్షాన్ జోంగ్రాంగ్ మెటల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా ఉత్పత్తులను సరఫరా చేసే పెద్ద కంపెనీల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత జనరల్ మోటార్స్ లాంటి సంస్థలకు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. పేలుడు సమయంలో ఆ ఫ్యాక్టరీలో 260 మంది ఉన్నారు. 40 మృతదేహాలు ప్రమాద స్థలంలో లభించాయని, మిగతా 28 మంది ఆస్పత్రితో మృతిచెందారని మీడియా తెలిపింది. -
ఉలిక్కిపడ్డ ఆర్సీపురం
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని బోన్సాయ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెక్నిషియన్లు, ఇద్ద రు మహిళలు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వందలాది మంది ఆందోళనకు గురయ్యారు. అయితే గ్యాస్ కారణంగానే పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి నాలుగు ఫ్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడో అంతస్తులో జరిగిన ఘటనతో కింది ఫ్లోర్(211)లో నివసిస్తున్న మహిళలిద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రిపాలయ్యారు. కాగా పేలుడు జరిగిన ఇంట్లో చాలా కాలంగా ఎవ్వరూ ఉండటంలేదు. రహీం, ఖమల్ అనే ఇద్దరు టెక్నిషియన్లు బోన్సాయ్ అపార్ట్మెంట్ మొత్తంలో ఇన్‌బిల్ట్ గ్యాస్ వ్యవస్థను మరమ్మతులు చేసేందుకు వచ్చారు. వారు ఇతర ఇళ్లల్లో గ్యాస్‌పైపులైన్ పనులను ముగించుకుని మూడో అంతస్తుకు వచ్చి ఇంటి (311) కాలింగ్ బెల్ నొక్కారు. సరిగ్గా అప్పుడే పేలుడు జరిగింది. గాయపడ్డ టెక్నీషియన్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండో అంతస్తులో(312)లో ఉంటున్న వారు అప్పుడే బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ ఫ్లాట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి. మొత్తం అపార్ట్మెంట్లోని పలు ఫ్లాట్ల కిటికీల అద్దాలు పగిలాయి. లిఫ్టు ధ్వంసమైంది. పేలుడుతో ఆనుకుని ఉన్న ఇతర అపార్ట్మెంట్ల అద్దాలు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన ఇంటి యజమాని ప్రకాశ్ అమర్లాల్ బజాజ్ ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ గదిలో ఎలాంటి సామగ్రిలేదు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంగారెడ్డి నుంచి క్లూస్‌టీం కూడా ఇక్కడకు చేరుకుని పరిశోధన నిర్వహించింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని ప్రజలు చెబుతున్నారు. ఘటన స్థలాన్ని సందర్శించిన వారిలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, భీంరెడ్డి, ఎస్ఐ రవీందర్‌రెడ్డిలు ఉన్నారు. గ్యాస్‌తోనే పేలుడు బోన్సాయ్ అపార్ట్మెంట్లో పేలుడుకు కారణం గ్యాసేనని పోలీసులు ని ర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఇన్‌బిల్ట్ గ్యాస్ మెకానిక్ రహీంతో పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. గ్యాస్ అన్ని ఫ్లాట్లకు సరఫరా అవుతున్నదీ లేనిదీ మెకానిక్ పరిశీలిస్తున్నాడు. కొం తమందికి గ్యాస్ రావడంలేదని తెలుసుకున్న మెకానిక్ ఫ్లాట్ నంబర్ 311 వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఆ ఫ్లాట్ యాజమాని కొన్ని నెలలుగా అందులో ఉండడంలేదు. గ్యాస్వాల్వ్ ఓపెన్‌చేసి ఉండడం వల్ల గ్యాస్ అంతా రూంలో నిండి ఉండవచ్చునని, బెల్ కొట్టగానే పేలుడు జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.