డీఆర్‌డీఓ ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
షాద్‌నగర్: ఆహారాన్ని ప్యాక్ చేసే సిల్వర్ కవర్లను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా.. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారేనని తెలిసింది.
పరిమితికి మించిన వేడితో..
షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కాశిరెడ్డిగూడ శివారులో బ్లెండ్ కలర్ పరిశ్రమ ఉంది. ఇందులో ఫుడ్ ప్యాకేజీకి సంబంధించిన సిల్వర్ కవర్లను తయారు చేస్తారు. ఇందుకోసం మెటాలిక్ పొడిని వినియోగిస్తారు. కార్మికులు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జాజిపతుర, పూర్ణాసింగ్, మందిరి,రాజుసాన్, మంజుదాస్, ప్రదీప్‌మాన్, సత్య, గిరిధర్‌సింగ్, రాహుల్‌ఘడ్, సునీల్ ఎంకీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వారిని వెంటనే షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం డీఆర్‌డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకున్నారు. పేలుడు షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీలో కలర్ తయారు చేసే క్రమంలో వాడే మెటాలిక్ పొడి పరిమితికి మించి వేడి (ఓవర్ హీట్) కావడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment