Packaging Industry
-
ప్యాకేజీ కవర్ల పరిశ్రమలో భారీ పేలుడు
షాద్‌నగర్: ఆహారాన్ని ప్యాక్ చేసే సిల్వర్ కవర్లను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా.. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారేనని తెలిసింది. పరిమితికి మించిన వేడితో.. షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కాశిరెడ్డిగూడ శివారులో బ్లెండ్ కలర్ పరిశ్రమ ఉంది. ఇందులో ఫుడ్ ప్యాకేజీకి సంబంధించిన సిల్వర్ కవర్లను తయారు చేస్తారు. ఇందుకోసం మెటాలిక్ పొడిని వినియోగిస్తారు. కార్మికులు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జాజిపతుర, పూర్ణాసింగ్, మందిరి,రాజుసాన్, మంజుదాస్, ప్రదీప్మాన్, సత్య, గిరిధర్‌సింగ్, రాహుల్ఘడ్, సునీల్ ఎంకీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకున్నారు. పేలుడు షార్ట్‌సర్క్యూట్‌తో జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీలో కలర్ తయారు చేసే క్రమంలో వాడే మెటాలిక్ పొడి పరిమితికి మించి వేడి (ఓవర్ హీట్) కావడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. -
అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!
పుట్టింది ఒక మూరుమూల గ్రామం. చిన్నపుడే కష్టాలు. అయితేనేం అమ్మ ఆశీస్సులు ఫలించాయి. సంకల్పానికి ..కాలం కలిసి వచ్చింది. జీవితం కొత్త మలుపు తిరిగింది. దాన్ని అందిపుచ్చుకుని రూ. 22000 కోట్ల పడగలెత్తాడు. దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ప్రముఖ ప్యాకేజింగ్ కంపెనీ హాట్ప్యాక్ గ్లోబల్ గ్రూప్ ఎండీ పీబీ అబ్దుల్ జెబ్బార్ స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ .. కేరళలోని త్రిసూర్ జిల్లాలోని చమక్కలా అనే గ్రామంలో జన్మించారు పీబీ అబ్దుల్ జెబ్బార్. ఆరేళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. దీంతో కష్టాలు తప్పలేదు. పిల్లల్ని పెంచిపోషించి వారిని గొప్పోళ్లను చేయాలని తల్లి భావించడమేకాదు దాన్నొక సవాలుగా తీసుకుంది. అమ్మకు అండగా కొంచెం కొంచెం సంపాదిస్తూ తన చదువు ఖర్చులను తానే భరించేవాడు. దుబాయ్ లాంటి దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారిలో కేరళ వాసులే ఎక్కువ. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారి నుంచి వస్తువులను కొనుగోలు చేసి లాభాలకు అమ్మేవాడు. ఈ వ్యాపారమే అతనికి, కుటుంబానికి సాయంగా నిలిచింది.అయితే ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లడంతో జబ్బార్ జీవితం కీలక మలుపు తిరిగింది. విదేశాలకు వెళ్లాలని,విజయవంతమైన వ్యాపారవేత్త కావాలని కలల సాకారానికి తొలి అడుగు పడింది. టర్నింగ్ పాయింట్ 1990లో ఉద్యోగం వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లే అవకాశం రావడమే పీబీ అబ్దుల్ జెబ్బార్ జీవితంలో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. ఇండెంట్ కంపెనీలో మేనేజర్‌గా తొలి ఉద్యోగంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. విదేశీ పార్టనర్స్‌తో ఎలా మెలగాలో కూడా బాగా తెలిసి వచ్చింది. సేల్స్,అకౌంటింగ్, మనీ మేనేజ్మెంట్ , నిర్వహణ ఇలా అన్ని రంగాల్లోనే ఆల్ రౌండర్‌గా ఆరితేరాడు. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ ) 1995లో మజేద్ ప్లాస్టిక్స్ అనే తన ప్యాకేజింగ్ కంపెనీని ప్రారంభించాడు. పదేళ్లలో,తొలి తయారీ యూనిట్‌ను ప్రారంభించాడు. పేపర్ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్‌లు, డిస్పోజబుల్ ఫుడ్ ప్యాకేజింగ్ సహా 3500కి పైగా ఉత్పత్తులు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. హాట్ప్యాక్ నేడు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకుఎగుమతి చేస్తోంది. సస్టైనబుల్ ప్యాకేజింగ్‌లో అగ్రగామిగా కంపెనీ స్పెయిన్,యూకే, అమెరికా, ఆస్ట్రేలియాతో సహా 75 దేశాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి ఎదిగింది. 29 శాఖలు, 3500 మంది ఉద్యోగులు , 25000 క్లయింట్లతో మూడు పువ్వులు ఆరు కాయలుగా రూ. 22000 కోట్ల టర్నోవర్ కంపెనీగా వెలుగొందుతోంది. అక్కడే ఆగిపోలేదు శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టు తిరిగి ఇవ్వకపోతే లావే పోతాం అనుకున్నాడేమో ఎమో గానీ..తన పుట్టిన గడ్డ కేరళకు తిరిగి ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. త్రిసూర్‌లో ఎన్విరోగ్రీన్ క్యారీ బ్యాగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ప్రారంభించాడు. ఇది పర్యావరణ అనుకూలమైన కాగితం ఉత్పత్తులను తయారు చేస్తుంది. దయా హాస్పిటల్, యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా నడుపుతున్నాడు. వీటి ఆరోగ్య సంరక్షణ విద్యా రంగంలో సేవలందిస్తూ పలువురి ప్రశంసలందుకుంటున్నారు. అమ్మ ఆశీస్సులు, కల ఈ విజయం తన తల్లికి అంకితమని ఆమె ఆశీస్సులే తనను విజయపథంలో నడిపించాయని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు జెబ్బార్. ఏదైనా కొత్త వెంచర్‌ను ప్రారంభించే ముందు ఎపుడూ ఆమె ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) అవార్డులు గ్లోబల్ మీడియా ఈవెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ అవార్డు ఎన్ఆర్ఐ ఎంటర్ప్రెన్యూర్ కైరాలి టీవీ అవార్డు సీఈవో ఫర్ లైఫ్ 2021 ప్యాకేజింగ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2021 (ప్రైమ్ అవార్డ్స్) 2022 మిడిల్ ఈస్ట్ మీడియా (సీఈఓ) ఐటీపీ మీడియా -
ఈ ప్యాకేజింగ్ షేర్లు.. పవర్ ప్యాక్డ్ సుమా
ప్యాకేజింగ్ రంగంలోని పలు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో నష్టాల మార్కెట్లోనూ ప్యాకేజింగ్ రంగ కౌంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. వెరసి కాస్మో ఫిల్మ్స్(రూ. 491) షేరు సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. ఎస్సెల్ ప్రొప్యాక్(రూ. 300), జిందాల్ పాలీఫిల్మ్(రూ. 524), యూఫ్లెక్స్(రూ. 373), ఈస్టర్ ఇండస్ట్రీస్(రూ. 76.5), హైటెక్ కార్ప్(రూ. 126.5), పాలీప్లెక్స్ కార్పొరేషన్(రూ. 844), యూఫ్లెక్స్(రూ. 373) తాజాగా 52 వారాల గరిష్టాలను తాకాయి. ఇందుకు ప్రధానంగా కాస్మో ఫిల్మ్స్, ఎస్సెల్ ప్రొప్యాక్, యూఫ్లెక్స్ సాధించిన పటిష్ట ఫలితాలు దోహదం చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంట్రోల్ ప్రింట్, హిందుస్తాన్ టిన్వర్క్స్, ఎవరెస్ట్ కాంటో, హటమకీ తదితర కంపెనీల షేర్లు జోరు చూపుతున్నాయి. ఫలితాలు ఇలా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కాస్మో ఫిల్మ్స్ నికర లాభం 69 శాతం జంప్‌చేసి రూ. 47 కోట్లకు చేరింది. ఇక ఎస్సెల్ ప్రొప్యాక్ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 46 కోట్లను తాకింది. ఇక యూఫ్లెక్స్ నికర లాభం సైతం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 197 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. షేర్ల స్పీడ్ ఎన్ఎస్ఈలో కంట్రోల్ ప్రింట్ 16 శాతం పురోగమించి రూ. 251కు చేరగా.. జిందాల్ పాలీ 12.4 శాతం దూసుకెళ్లి రూ. 524ను తాకింది. ఈ బాటలో ఎవరెస్ట్ కాంటో షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 32 వద్ద, ఎస్సెల్ ప్రొప్యాక్ 5 శాతం ఎగసి రూ. 295 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో హటమకీ పీపీఎల్ 5 శాతం పుంజుకుని రూ. 260 వద్ద, పాలీప్లెక్స్ కార్పొరేషన్ 5.5 శాతం జంప్‌చేసి రూ. 844 వద్ద కదులుతున్నాయి. ఇదే విధంగా ఈస్టర్ ఇండస్ట్రీస్ 5 శాతం లాభపడి రూ. 76.5ను తాకగా, హైటెక్ కార్ప్ 5 శాతం పెరిగి రూ. 126.5కు చేరింది. యూఫ్లెక్స్ 4 శాతం బలపడి రూ. 373 వద్ద ట్రేడవుతోంది. -
ఫుడ్ తయారీ సంస్థలో కరోనా కలకలం
బెంగుళూరు: ప్రముఖ రెడీ టూ ఈట్ ఇన్స్టంట్ ఫుడ్ సంస్థ ‘ఎంటీఆర్ ఫుడ్స్’ కంపెనీలో కరోనా కలకలం రేగింది. వివరాల ప్రకారం.. కర్ణాటక లోని బొమ్మసాంద్రలో గల ఎంటీఆర్ ఫుడ్స్ తయారీ పరిశ్రమలో ఏకంగా 40 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఫ్యాక్టరీని మరి కొంతకాలం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 6న ఫ్యాక్టరీలో మొట్టమొదటి కరోనా కేసు నమోదవగా వెంటనే కంపెనీని మూసివేసి శానిటైజేషన్ నిర్వహించారు. జూలై 10న ఫ్యాక్టరీ తెరవాలని భావించినా కాంట్రాక్ట్ ట్రేసింగ్‌లో భాగంగా మిగతా ఉద్యోగులకు కూడా కరోనా నిర్ధారణ అయినట్లు తేలింది. ఇప్పటివరకు ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో ఈనెల 20 వరకు ఫ్యాక్టరీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, శ్రేయస్సే తమకు ప్రథమ కర్తవ్యం అని ఓ ప్రకటన జారీ చేసింది. (సీఎం కార్యాలయం బయట వ్యక్తి ఆందోళన ) వివిధ సూపర్ మార్కెట్లలో ఎంటీఆర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నందున ఏం చేయాలన్న ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిపై కంపెనీ సీఈవో స్పందిస్తూ ప్రజలెవరూ దీనిపై ఆందోళన చెందవద్దని మనుషుల ప్రమేయం లేకుండా యంత్రాల సహాయంతో ఫుడ్ ప్యాకెజింగ్ చేస్తామని తెలిపారు. తమ ఉత్పత్తులన్నీ మనిషి స్పర్శతో సంబంధం లేకుండా ఆటోమేటెడ్ లైన్లలో తయారు చేయబడతాయని పేర్కొన్నారు. బెంగళూరులో లాక్డౌన్ అనంతరం తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ర్టంలో ఓ ప్రముఖ కంపెనీలో వైరస్ కలకలం రేగడం ఇది కొత్తేమి కాదు. ఇంతకుముందు మైసూరు నంజన్‌గూడ్‌లోని జూబిలెంట్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీలో 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే విధంగా బళ్లారి జిల్లాలో ఓ స్టీల్ ప్లాంట్‌లో ఏకంగా 200 మంది కార్మికులకు కరోనా సోకింది. రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్నందున బెంగుళూరులో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. (‘లక్షణాలు లేకుంటే ఓకే’) -
ప్యాకేజింగ్ ప్రమాణాల కోసం కమిటీ
ముంబై: దేశీయ ప్యాకేజింగ్ పరిశ్రమ రానున్న నాలుగేళ్లలో 30 నుంచి 35 బిలియన్ డాలర్లు (రూ.2,34,500 కోట్లు) స్థాయికి వృద్ధి చెందుతుందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిశ్రమ స్థాయి 25 బిలియన్ డాలర్లు (1.67 లక్షల కోట్లు) స్థాయిలో ఉండగా ఏటా 15 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఇందర్జిత్ సింగ్ తెలిపారు. ఈ కీలక రంగంలో వృద్ధి అవకాశాలను, ఎగుమతుల పరంగా ఉన్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని తగిన ప్యాకేజింగ్ ప్రమాణాలను ఖరారు చేసేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ముంబైలో జరిగిన ఏషియన్ ప్యాకేజింగ్ కాంగ్రెస్ 2016 సదస్సులో ఇందర్జిత్ సింగ్ ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిటీలో ఈ రంగానికి చెందిన వారితోపాటు ఎగుమతిదారులు ఉంటారని, వీరు ప్యాకేజింగ్ నాణ్యతా ప్రమాణాలను నిర్దేశిస్తారని చెప్పారు. -
రానున్నది ఎల్ఈడీ ప్రింటింగ్..
ఐపీఎం కార్యదర్శి సి.పి.పాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముద్రణ రంగంలో ఎల్ఈడీ టెక్నాలజీ సంచలనాలకు వేదిక కానుందని ఇండియన్ ప్రింటింగ్ ప్యాకేజింగ్, అల్లైడ్ మెషినరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎం) కార్యదర్శి సి.పి.పాల్ గురువారమిక్కడ తెలిపారు. గంటకు 18,000 షీట్లు ముద్రించొచ్చని చెప్పారు. పాత మెషినరీకి కూడా ఈ వ్యవస్థను అమర్చొచ్చన్నారు. ఫిబ్రవరి 11-15 తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరిగే ప్రింట్ ప్యాక్ ఇండియా సదస్సు విశేషాలను వెల్లడించేందుకు ఏర్పాటైన మీడియా సమావేశంలో ఐపీఎం సంయుక్త కార్యదర్శి ఎస్.దయాకర్‌రెడ్డి, గ్రాఫిక్ సేల్స్ కార్పొరేషన్ సీఎండీ కేశవ్కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. పాత మెషినరీకి అడ్డుకట్ట: భారత్‌కు నెలకు 500ల దాకా మల్టీ కలర్ ఆఫ్సెట్ ప్రింటింగ్ మెషీన్లు పాతవి దిగుమతి అవుతున్నాయి. వీటి తయారీ దేశంలో లేకపోవడం, అలాగే తక్కువ ధరకు వస్తుండడంతో పాతవి తెచ్చుకుంటున్నారు. దీంతో గత ఆరేళ్లలో మెషినరీ తయారీలో ఉన్న సుమారు 150 కంపెనీలు మూతపడ్డాయి. పాత మెషీన్ల దిగుమతిపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని పాల్ తెలిపారు.భారత్‌లో ముద్రణ, ప్యాకింగ్ పరిశ్రమ 10-15 శాతం వృద్ధి రేటుతో రూ.96,000 కోట్లుంది. కాగా, ప్రింట్ ప్యాక్ ప్రదర్శనకు ఒక లక్ష మంది సందర్శకులు వస్తారని అంచనా. 400 కంపెనీలు నూతన టెక్నాలజీని ప్రదర్శించనున్నాయి.