రానున్నది ఎల్‌ఈడీ ప్రింటింగ్..
ఐపీఎం కార్యదర్శి సి.పి.పాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముద్రణ రంగంలో ఎల్‌ఈడీ టెక్నాలజీ సంచలనాలకు వేదిక కానుందని ఇండియన్ ప్రింటింగ్ ప్యాకేజింగ్, అల్లైడ్ మెషినరీ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎం) కార్యదర్శి సి.పి.పాల్ గురువారమిక్కడ తెలిపారు. గంటకు 18,000 షీట్లు ముద్రించొచ్చని చెప్పారు. పాత మెషినరీకి కూడా ఈ వ్యవస్థను అమర్చొచ్చన్నారు. ఫిబ్రవరి 11-15 తేదీల్లో గ్రేటర్ నోయిడాలో జరిగే ప్రింట్ ప్యాక్ ఇండియా సదస్సు విశేషాలను వెల్లడించేందుకు ఏర్పాటైన మీడియా సమావేశంలో ఐపీఎం సంయుక్త కార్యదర్శి ఎస్.దయాకర్‌రెడ్డి, గ్రాఫిక్ సేల్స్ కార్పొరేషన్ సీఎండీ కేశవ్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
పాత మెషినరీకి అడ్డుకట్ట: భారత్‌కు నెలకు 500ల దాకా మల్టీ కలర్ ఆఫ్‌సెట్ ప్రింటింగ్ మెషీన్లు పాతవి దిగుమతి అవుతున్నాయి. వీటి తయారీ దేశంలో లేకపోవడం, అలాగే తక్కువ ధరకు వస్తుండడంతో పాతవి తెచ్చుకుంటున్నారు. దీంతో గత ఆరేళ్లలో మెషినరీ తయారీలో ఉన్న సుమారు 150 కంపెనీలు మూతపడ్డాయి. పాత మెషీన్ల దిగుమతిపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని పాల్ తెలిపారు.భారత్‌లో ముద్రణ, ప్యాకింగ్ పరిశ్రమ 10-15 శాతం వృద్ధి రేటుతో రూ.96,000 కోట్లుంది. కాగా, ప్రింట్ ప్యాక్ ప్రదర్శనకు ఒక లక్ష మంది సందర్శకులు వస్తారని అంచనా. 400 కంపెనీలు నూతన టెక్నాలజీని ప్రదర్శించనున్నాయి.