ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున గీతా జయంతి
ఈ సందర్భంగా కేవలం ఒక్క రూపాయికే భగవద్గీతను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన గీతా ప్రెస్
1923లో జయదయాల్ గోయంద్కా, హనుమాన్ ప్రసాద్ పొద్దార్ స్థాపించిన గీతాప్రెస్
హిందూ మత గ్రంథాలను సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడమే గీతాప్రెస్ లక్ష్యం
గీతా ప్రెస్ తన 100 ఏళ్ల ప్రయాణంలో 42 కోట్ల పుస్తకాలను ప్రచురించింది
ఎలాంటి తప్పులు దొర్లని భగవద్గీతను ప్రజలకు అందించాలని భావించిన గోయంద్కా
1926లో ‘కల్యాణ్’ పేరుతో మాసపత్రికను వెలువరించిన గీతాప్రెస్
13 భాషలలో హిందూ ధర్మచింతనకు సంబంధించిన గ్రంథాల ప్రచురణ
నేడు(డిసెంబరు 11) గీతా జయంతి. ఇది హిందువులకు అత్యంత పవిత్రదినం. గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ దినాన్నే అర్జునునిలోని అజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు గీతను బోధించాడని చెబుతారు. గీతా జయంతితో పాటు మోక్షద ఏకాదశి వ్రత్రాన్ని కూడా ఈ రోజునే ఆచరిస్తారు. ఈ సందర్భంగా కేవలం ఒక్క రూపాయికే భగవద్గీతను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన గీతా ప్రెస్ 100 ఏళ్ల ఘన చరిత్ర గురించి తెలుసుకుందాం.
42 కోట్ల పుస్తకాల ముద్రణ
ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లో గల ప్రముఖ గీతాప్రెస్ గత ఏడాది గాంధీ శాంతి బహుమతిని అందుకుంది. గీతా ప్రెస్‌ను 1923లో జయదయాల్ గోయంద్కా, హనుమాన్ ప్రసాద్ పొద్దార్ సంయుక్తంగా స్థాపించారు. హిందూ మత గ్రంథాలను సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడమే గీతాప్రెస్ లక్ష్యం. గీతా ప్రెస్ ప్రచురించిన భగవద్గీత, తులసీదాస్ రచనలు, పురాణాలు, ఉపనిషత్తులకు చెందిన లక్షలాది కాపీలు విక్రయమయ్యాయి. గీతా ప్రెస్ తన 100 ఏళ్ల ప్రయాణంలో 42 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. వీటిలో భగవద్గీత పుస్తక కాపీలు 18 కోట్లు ఉన్నాయి. ఈ ప్రెస్‌లో రోజుకు 70 వేల పుస్తకాలు ముద్రింతమవుతుంటాయి. గీతాప్రెస్ ప్రచురించిన హనుమాన్ చాలీసా రెండు రూపాయలకే లభ్యమవుతుంది.
తొలి ముద్రణ భగవద్గీత
గీతా ప్రెస్ తన కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి హిందూ సమాజానికి సంబంధించిన అతిపెద్ద ప్రచురణకర్తగా కొనసాగుతోంది. గీతాప్రెస్‌లో 16 భాషలకు చెందిన 1,800 పుస్తకాల కాపీలు హైటెక్ యంత్రాల సాయంతో ప్రతిరోజూ ముద్రితమవుతుంటాయి. గీతాప్రెస్ 1923లో ఒక అద్దె దుకాణంలో ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని చురు నివాసి జయదయాల్ గోయంద్కా 1923 ఏప్రిల్ 29న గోరఖ్‌పూర్‌లోని హిందీ బజార్‌లో 10 రూపాయల అద్దె ఇంట్లో గోయంద్కా ప్రెస్‌ను ప్రారంభించారు. దానికి ఆయన గీతా ప్రెస్ అని పేరు పెట్టారు. తొలుత జయదయాల్ గోయంద్కా భగవద్గీత పుస్తకాన్ని ముద్రింపజేశారు.
ఎలాంటి తప్పులు దొర్లకూడదని..
ఎలాంటి తప్పులు దొర్లని భగవద్గీతను ప్రజలకు అందించాలని గోయంద్కా భావించారు. ఇందుకోసం ఆయన 1922లో కలకత్తా వాణిక్ ప్రెస్‌ను సంప్రదించారు. అయితే అందులో చాలా తప్పులు దొర్లాయి. దీనిపై గోయంద్కా ప్రెస్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీనికి యాజమాన్యం సరైన సమధానం ఇవ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గోయంద్కా తన సొంత ప్రెస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గోరఖ్‌పూర్‌కు చెందిన ఘనశ్యామ్‌దాస్ జలాన్ ఇందుకు తన సహాయాన్ని అందించారు. ఈ విధంగా గోరఖ్‌పూర్‌లో గీతా ప్రెస్ స్థాపితమయ్యింది. 1926లో ప్రింటింగ్ మెషీన్‌ను అమెరికాలోని బోస్టన్ నుంచి దిగుమతి చేసుకున్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ సూచనతో..
గీతా ప్రెస్ ఒక ట్రస్ట్‌గా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. దీని లక్ష్యం లాభాలు ఆర్జించడం కాదు. ప్రజలకు తక్కువ ధరకే హిందూ ఆధ్యాత్మిక చింతనతో కూడిన పుస్తకాలను అందించడం. గీతా ప్రెస్‌లో ముద్రించిన మొదటి పుస్తకం ధర ఒక రూపాయి. 1926లో గీతా ప్రెస్ ‘కల్యాణ్’ పేరుతో ఒక మాసపత్రికను అందుబాటులోకి తీసుకువచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఆ పత్రికలో వ్యాసాలను రాసేవారు. గాంధీజీ 1927లో గీతా ప్రెస్‌కు రెండు సలహాలు ఇచ్చారు. ఈ పత్రికల్లో ఎలాంటి ప్రకటనలు రాకూడదని, ఏ పుస్తకాన్ని సమీక్షించకూడదని సూచించారు. గాంధీజీ నాడు ఇచ్చిన సూచనలను ఏనాడూ ఉల్లంఘించలేదని గీతా ప్రెస్ మేనేజర్ లల్మణి తివారీ తెలిపారు.
13 భాషలలో పుస్తకాల ప్రచురణ
హిందీ, సంస్కృతంతో పాటు గీతా ప్రెస్ 13 ఇతర భాషలలో హిందూ ధర్మచింతనకు సంబంధించిన గ్రంథాలను, సాహిత్యాన్ని ప్రచురిస్తుంది. భగవద్గీత, రామచరిత మానస పుస్తకాలకు సంబంధించిన 90 కోట్లకు పైగా కాపీలను గీతాప్రెస్ ముద్రించింది. గీతా ప్రెస్ పలుమార్లు అనేక ఎత్తుపల్లాలను చూసింది. చాలాసార్లు మూతపడే స్థితికి వచ్చింది. అత్యంత తక్కువ ధరలకు పుస్తకాలను అందిస్తున్న కారణంగా సంస్థ నష్టాలలోనే కొనసాగుతోంది.
గీతాప్రెస్‌ను చూసేందుకు విదేశీ అతిథులు
గీతా ప్రెస్ ట్రస్ట్ తమ సంస్థ నుంచి వెలువడే పుస్తకాల ముద్రణకు వివిధ పరిశ్రమల నుండి నేరుగా ముడి సరుకులను కొనుగోలు చేస్తుంటుంది. తద్వారా ముద్రణ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంది. గీతాప్రెస్‌ను చూసేందుకు దేశవిదేశాల నుంచి గోరఖ్‌పూర్‌నకు తరలివస్తుంటారు. గీతా ప్రెస్‌లోని జపనీస్, ఇటాలియన్, జర్మన్ ప్రింటింగ్ మెషీన్ల ధర రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. గీతాప్రెస్ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రతినెలా దాదాపు రూ.80 లక్షల మొత్తాన్ని జీతాల రూపంలో అందిస్తుంటుంది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ఈ దేశాల్లో పర్యాటకుల తాకిడి.. హనీమూన్ స్పాట్‌లో జంటల సందడి
Comments
Please login to add a commentAdd a comment