అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి.. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినిపించిన కర్తవ్య బోధ. అర్జునుడిని కార్యోన్ముఖుణ్ని చేసిన మహా ఉపదేశం ఇది. జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్లు, మోదం, ఖేదం తప్పవనీ.. అన్నిటినీ ఓర్పుతో, నేర్పుతో ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే అనే జీవితపాఠాన్ని నేర్పే కార్యనిర్వాహక గ్రంథం ఇది. రాక్షస స్వభావాన్ని అంతం చేసే నిప్పుకణిక ఈ గ్రంథం. మానవాళి మొత్తానికి జీవనాడి ఈ గ్రంథం. జీవన పథాన్ని, విధానాన్ని నిర్దేశించే మహాగ్రంథం భగవద్గీత. మన జీవితాలను మార్చే మహామంత్రం.
మార్గశిర శుద్ధ ఏకాదశి రోజుని 'గీతా జయంతి'గా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా.. భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం. ఇందులో అన్ని వయసుల వారూ జీవితంలో విజయాలు సాధించడానికి దోహదపడే మార్గదర్శకాలు ఉన్నాయి. నిత్య జీవితాన్ని నడపడానికి తెలుసుకోవాల్సిన విషయాలెన్నో భగవద్గీతలో ఉన్నాయి.
బుద్ధి వికాసానికి...
మన జీవన పయనం సాఫీగా సాగాలంటే, ఎత్తుపల్లాలను అధిగమించాలంటే, జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ‘భగవద్గీత’ అనే క్షీర సాగరంలో మునగాలి’’ అన్నాడు అమెరికన్ రచయిత హెన్రీ డేపిట్ థోరో. ప్రతి శ్లోకాన్నీ పఠించి, అర్థం చేసుకుంటే బుద్ధి శుద్ధి అవుతుందని చెప్పారు. ఆధునిక విజ్ఞానం జనాన్ని వేగంగా గమ్యాన్ని చేరుకునేలా ఉరకలు పెట్టిస్తుందే తప్ప..కింద పడితే మళ్లీ లేచి పుంజుకోవడం ఎలా అనేది నేర్పించడం లేదు. దీన్ని గీత నేర్పిస్తుంది.
ఆరోగ్య గీత...
ఆరోగ్యపరంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత ఆరో అధ్యాయం వివరించింది. ఎలాంటి ఆహారం తినాలో పదిహేడో అధ్యాయంలో ఉంది.. ఆహార విషయంలో సయమనం పాటించకపోవడం వల్లే రోగాల పాలవుతున్నామని నొక్కి చెప్పింది. మనసును ఉద్రేకపరచని, రుచికరమైన, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందగలమనేది గీతోపదేశం.
మనోధైర్యం..
శరీరం దృఢంగా ఉన్నా మనోబలం లోపిస్తే చేసే పనిలో ఫలితం సాధించలేం. ఈ విషయాన్నే భగవద్గీత రెండో అధ్యాయం మూడో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు మహా బలవంతుడు. కానీ మనోదౌర్బల్యం కారణంగా యుద్ధం చెయ్యనన్నాడు. కృష్ణుడు అది గమనించి, అర్జునుణ్ణి ఉత్తేజపరచి, అతనిలోని అంతర్గత శక్తిని ప్రేరేపించి, కార్యోన్ముఖుణ్ణి చేశాడు.
వైఫల్యాన్ని అధిగమించాలంటే..
ఒక వ్యక్తి జీవితంలో సరిగ్గా స్థిరపడకపోతే, దానికి కారణం ఇతరులేనని ఆరోపిస్తాడు. తన వైఫల్యాలకు తనే కారణం అని గుర్తించడు. మనస్సునూ, ఇంద్రియాలనూ తన ఆధీనంలో ఉంచుకుంటే తనకు తానే మిత్రుడు. అలా కానినాడు తనకు తానే శత్రువు. కాబట్టి మనస్సును నిగ్రహించుకోవడం అత్యావశ్యకం.దీనికి క్రమశిక్షణతో కూడిన అభ్యాసం అవసరం. మనసు వశమైతే సాధించలేని కార్యం ఏదీ ఉండదు.
ఆధ్యాత్మిక గీత...
శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందినా... ఆధ్యాత్మిక వికాసం లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు. పరిపూర్ణత సిద్ధించదు. రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, భేద బుద్ధి తొలగాలంటే ఆధ్యాత్మిక వికాసం పొందాల్సిందే. చైతన్యం కలగాలి. సమదృష్టి పెంపొందాలి. భగవంతుడు ఉన్నాడనీ, అతడే జగన్నాటక సూత్రధారి అనీ గ్రహించాలి. ఇలా భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకున్నట్లయితే(ఆచరిస్తే) ‘జీవనగీత’గా దారి చూపిస్తుంది.
(చదవండి: మహిమాన్వితమైన సూగూరేశ్వర ఆలయం!..ఎక్కడ లేని విధంగా రథోత్సవం..)
Comments
Please login to add a commentAdd a comment