
అతని కళ్లకు లోకమంతా గాఢాంధకారం. అంతమాత్రాన ఆ ఉపాధ్యాయుడు నిరాశ చెందలేదు. భగవద్గీత– హిందువుల ఆరాధ్య గ్రంథం. కళ్లులేని వాళ్లు దాన్నెలా చదవాలి, ఎవరైనా చదువుతుంటే వినడం తప్ప! అందుకే భగవద్గీతను తన తోటి అంధులకు అందించాలని నిశ్చయించుకున్నారు. భగవద్గీతను బ్రెయిలీ లిపిలో రాశారు. ఎందరో అంధులకు భగవద్గీతను చదివే అవకాశం కల్పించాలనేదే అలూరుకు చెందిన అంధ ఉపాధ్యాయుడు బూర్ల తిక్కలక్ష్మన్న సంకల్పం. ఇదీ ఆయన స్ఫూర్తి గాథ..
రామకృష్ణ, కర్నూలు కల్చరల్
ఒకవైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే, బ్రెయిలీ లిపిలో భగవద్గీతను రాసిన బూర్ల తిక్కలక్ష్మన్న కర్నూలు జిల్లా ఆలూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు బూర్ల హనుమన్న, నరసమ్మ. పదో తరగతి వరకు ఆలూరులోనే చదువుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ అంధుల కళాశాలలో ఇంటర్, టీటీసీ పూర్తిచేసి, బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. తర్వాత అలూరు మండలం మూసానిపల్లెలో 1993లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆలూరు మండలం హులేబీడు ప్రభుత్వ పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎమ్‌గా పనిచేస్తూ, మరోవైపు కర్నూలులోని ఒక కళాశాలలో బీఈడీ చదువుతున్నారు.
చిన్మయి మిషన్ సహకారం
చిన్మయి మిషన్ ఆదోని శాఖ సహకారంతో బ్రెయిలీ భగవద్గీతను 2001లో వెయ్యి కాపీలను ముద్రించారు. దీనిని ముంబైలోని చిన్మయి మిషన్ స్వామీజీ తేజోమయానంద చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిన్మయి మిషన్ అనుమతితో రెండోసారి కూడా బ్రెయిలీ భగవద్గీత ప్రతులను ముద్రించారు. వీటిని అప్పటి ఆలూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ హేమ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే రాయచోటి రామయ్య సహకారంతో ఆదోని లక్ష్మమ్మవ్వ జీవిత చరిత్రను మాస్టారు బ్రెయిలీ లిపిలో రాశారు.
మాస్టారి సేవలు.. సత్కారాలు
⇒ 2005లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
⇒ 2012లో కర్నూలులో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్, కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిల చేతుల మీదుగా సన్మానం.
⇒ 2004 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రాంతాల్లో గీతా జ్ఞాన యజ్ఞాల నిర్వహణ.
⇒ 2014 నుంచి బ్రెయిలీ భగవద్గీత ఆలయం వద్ద ప్రతి ఆదివారం భగవద్గీత శ్లోకాల పోటీల నిర్వహణ. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.1000, రూ.500, రూ.300 చొప్పున నగదు బహుమతుల ప్రదానం.
⇒ కుటుంబ సభ్యుల సహకారంతో 2014లో ఆలూరులో బ్రెయిలీ భగవద్గీత ఆలయం నిర్మాణం పరిపూర్ణం.
⇒ భగవద్గీతపై అవధానం కొనసాగిస్తున్న మొదటి అంధ ఉపాధ్యాయుడు లక్ష్మన్న.
⇒ 2020 ఏప్రిల్ 4న ఆదోనిలోని శ్రీకృష్ణదేవరాయ స్కూల్‌లో మొదటిసారి భగవద్గీతపై అష్టావధానం నిర్వహణ.
ఐదేళ్ల శ్రమ: బూర్ల తిక్కలక్ష్మన్న
‘పుట్టుకతోనే అంధుడిని. నిరుపేదను. నాకు చదువుకోవాలనే ఆశ ఉండేది. నా తపన గమనించి మా నాన్న ఎన్నో కష్టాలకోర్చి నన్ను చదివించారు. కృష్ణుడిపై భక్తి భావంతో బ్రెయిలీలో భగవద్గీతను రాయాలనుకున్నాను. తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాదరావు సహకారంతో భగవద్గీత 18 అధ్యాయాల్లోని 701 శ్లోకాలకు ప్రతి పదార్థ తాత్పర్యాలు రాసి, 300 పేజీల పుస్తకాన్ని ముద్రించాను. యజ్ఞంలా తలపెట్టిన ఈ పని పూర్తికావడానికి ఐదేళ్లు శ్రమించాను.
మా తెలుగు ఉపాధ్యాయుడు శివశంకరయ్య చిన్నతనం నుంచి భగవద్గీత గురించి చెప్పారు. మరో తెలుగు ఉపాధ్యాయుడు వరప్రసాద్ సహకారంతో భగవద్గీతను తెలుగు బ్రెయిలీ లిపిలో రాశాను. ఆయన నా భక్తికి మెచ్చి మేము కట్టించిన గుడికి రాధాకృష్ణుల విగ్రహాలను బహుమానంగా ఇచ్చారు. పిల్లల మనసు పరిశుభ్రమైన పలక వంటిది. పిల్లలకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, భగవద్గీత, భాగవతం లాంటì వాటిని నేర్పించాలి. ఏటా మూడు నెలలు అన్ని పాఠశాలల్లో భగవద్గీత గురించి ప్రచారం చేస్తాం. తరువాత భగవద్గీత పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేస్తున్నాం. భగవద్గీత అష్టావధాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. మరిన్ని అవధానాలు నిర్వహించాలన్నదే నా లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment