Braille
-
బ్రెయిలీ భాషలో స్టార్ హెల్త్ పాలసీ
చెన్నై: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది. ‘స్పెషల్ కేర్ గోల్డ్’ పాలసీని ‘బ్రెయిలీ’ భాషలో విడుదల చేసింది. కంటి చూపు సరిపడా లేని వారు సైతం ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని స్వయంగా తెలుసుకుని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుందని సంస్థ తెలిపింది. దేశంలో 3.4 కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారని.. వారికి తగిన నైపుణ్యాలు, శిక్షణ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా అవకాశం ఇవ్వడం ద్వారా మద్దతుగా నిలవనున్నట్టు ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా ఆరోగ్య బీమా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని.. బ్రెయిలీలో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ విడుదల ఈ దిశగా మైలురాయి అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ పేర్కొన్నారు. అంధులైన వారి సమగ్రమైన, సమ్మిళిత ఆరోగ్య బీమా రక్షణ అవసరాలను ఈ పాలసీ తీరుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంధుడైన పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీకాంత్ బొల్లా పాల్గొన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ సహకారంతో స్పెషల్ కేర్ గోల్డ్ పాలసీ బ్రెయిలీ వెర్షన్‌ను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూపొందించింది. -
బ్రేలి లిపిలో కేసీఆర్ సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకం
-
మునివేళ్లపై భవిష్యత్తు
అంధురాలైన రేషమ్ తల్వార్ తన భవిష్యత్తు బాగుండాలంటే బ్రెయిలీ నేర్చుకోక తప్పదని తొమ్మిదేళ్ల వయసులోనే గ్రహించింది. బ్రెయిలీలోనే ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఇగ్నోలో పి.జి చేసింది. ఆ చదువు ఆమెకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేడు సక్సెస్ఫుల్ రేడియో జాకీగా ఆమెకు ఉపాధిని ఇస్తోంది. చెన్నైకి చెందిన అంధురాలు బెనో జెఫైన్ బ్రెయిలీలో దొరికే మెటిరియల్లో ఐ.ఏ.ఎస్‌కు ప్రిపేర్ అయ్యి ఐ.ఎఫ్.ఎస్ సాధించిన తొలి అంధ మహిళగా రికార్డు స్థాపించింది. స్త్రీలు అంధులైతే కుటుంబాలు వారిని ఇంట కూచోబెడతాయి. కాని బ్రెయిలీ అనే అలీబాబా దీనిన్ని రుద్ది వారు అద్భుత విజయాలు సాధిస్తూనే ఉన్నారు. చీకటి తమ వెలుతురుకు అడ్డు కాదంటున్నారు. మన దేశంలో కోటీ యాభై లక్షల మంది పాక్షిక/పూర్తి అంధులు ఉన్నారు. వారిలో 2 లక్షల మంది చిన్నారులు. భారత్ వంటి వెనుకబడిన దేశాలలో అంధుల శాతం ఎక్కువ. దీనికి కారణం గర్భధారణ సమయంలో సరైన పరీక్షలు చేయించకపోవడం, పుట్టిన వెంటనే కంటి సమస్యలను గుర్తించకపోవడం, జన్మించాక వచ్చే ఐ ఇన్ఫెక్షన్స్కు సరైన చికిత్స చేయించకపోవడం, పిల్లల్లో వచ్చే హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి వంటి సమస్యలకు కూడా అద్దాల వంటి సహాయక పరికరాలను ఉపయోగించకపోవడం. అంధులుగా జన్మించడం అంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొనడం. అబ్బాయిలు అంధులుగా పుడితే కుటుంబం ఏదో ఒక మేరకు వారికి తర్ఫీదు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాని అమ్మాయి అంధురాలైతే చాలామటుకు నిరుత్సాహమే ఎదురవుతుంది. అంధుల అక్షరాస్యత కళ్లున్న వాళ్లకు అక్షరాస్యత ఉన్నట్టే అంధులకు కూడా అక్షరాస్యత ఉంటుంది. మన దేశంలో అంధుల అక్షరాస్యత కేవలం ఒక శాతం. బ్రిటన్‌లో ఇది 4 శాతం ఉంది. అంధుల అక్షరాస్యత అంటే బ్రెయిలీని చదవడం రాయడం రావడమే. లూయిస్ బ్రెయిలీ అనే ఫ్రెంచ్ అంధ విద్యావేత్త రూపకల్పన చేసిన బ్రెయిలీ కోడ్ పుట్టి 200 ఏళ్లు అయినా 70 ఏళ్ల క్రితమే భారతీయ భాషల కోసం ఉమ్మడి ‘భారతీ బ్రెయిలీ’ని మనం తయారు చేసుకున్నా నేటికీ బ్రెయిలీ అంధ విద్యార్థులకు అందని ఫలంగానే ఉంది. సంప్రదాయ బ్లైండ్ స్కూళ్లు, కాలేజీలలో బ్రెయిలీ నేర్పిస్తున్నా సమ్మిళితంగా (ఇన్‌క్లూజివ్) మామూలు పిల్లలతో కలిసి చదువుకోవాలనుకునే పిల్లలకు బ్రెయిలీ అందడం లేదు. దీనికి కారణం తగినంత మంది స్పెషల్ టీచర్లు లేకపోవడం, విద్యార్థులు ఎక్కువగా ఆడియో పాఠాల మీద ఆధారపడటం. కాని ఆడియో పాఠాలు విని సహాయకునితో పరీక్ష రాసి పాసైనప్పటికీ బ్రెయిలీ చదవడం, సొంతగా రాయడం రాక΄ోతే వారు నిరక్షరాస్యులు అవుతారు. తాముగా చదవగలం, రాయగలం అనే భావనే ఆత్మవిశ్వాసం ఇవ్వగలదు. ప్రతికూలతలను దాటి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా అంధత్వాన్ని జయించి ముందుకు సాగిన స్త్రీలు స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నారు. చెన్నైకి చెందిన బెనో జెఫైన్ పుట్టుకతో అంధురాలైనా బ్రెయిలీలో చదువుకుంది. ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బ్యాంక్ ఆఫీసర్ అయ్యింది. అయినప్పటికీ ఇంకా సాధించాలనే ఉద్దేశంలో ఉద్యోగం చేస్తూనే బ్రెయిలీలో దొరికిన మెటీరియల్ చదివి 2015లో ఐ.ఏ.ఎస్ పరీక్షలు రాస్తే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యింది. ఇప్పటివరకు ఐ.ఎఫ్.ఎస్‌లో అంధులకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ మేరకు బెనో చరిత్ర సృష్టించింది. ఇప్పుడామె ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. వివాహం చేసుకుని భర్త, కుమార్తెతో ముందుకు సాగుతోంది. బ్రెయిలీ భాష మాత్రమే ఆమెను ఇక్కడి వరకూ చేర్చింది. అలాగే ఢిల్లీకి చెందిన పాతికేళ్ల రేషమ్ తల్వార్ అక్కడి రేడియో ఉడాన్‌లో జాకీగా పని చేస్తోంది. పూర్తి అంధురాలైన రేషమ్‌ను తల్లిదండ్రులు అలాగే వదిలేయ దలచుకోలేదు. మామూలు విద్యార్థులతో΄ాటు కలిసి చదివేలా చేశారు. బ్రెయిలీలో స్కూలు పాఠాలు చదివించడంలో శ్రద్ధ చూపారు. రేషమ్ ఆగలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌గా నిలిచింది. అంతేకాదు, ఆ ఆత్మవిశ్వాసంతో రేడియో జాకీగా చేరింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టు గా పని చేస్తోంది. నిపుణుల సూచన ఇవాళ అంధ విద్యార్థులకు సాయపడే యాప్స్ (టెక్ట్స్‌బుక్స్‌ను ఆడియోగా మారుస్తాయి) ఉన్నప్పటికీ బ్రెయిలీలో చదవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పాఠ్యపుస్తకాలే కాదు సాహిత్యం, కథలు, పురాణాలు, గ్రంథాలు... ఏవి బ్రెయిలీలో అందుబాటులో ఉంటే అవన్నీ చదవడం వల్ల మాత్రమే అంధులకు తమ మీద తమకు విశ్వాసం ఏర్పడుతుందని సలహా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు, ముఖ్యంగా అంధ విద్యార్థినులు బ్రెయిలీ భాషను నేర్చుకోవడం గురించి, ఆ విషయంలో వారు ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి విద్యాశాఖ దృష్టిపెట్టడం అవసరం. -
జ్యోతిగౌడ్‌కు ‘బెస్ట్ బ్రెయిలీ’ అవార్డు
సనత్‌నగర్: బేగంపేట మయూరీ మార్గ్‌లోని ‘దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ కరస్పాండెంట్ ఎ.జ్యోతిగౌడ్‌కు ‘బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ది కంట్రీ–2019’ అవార్డు దక్కింది. అంధ విద్యార్థుల కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించనుంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకో నున్నారు. సాధారణ చిన్నారులతో సమానంగా అంధ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో బ్రెయిలీ లిపిలో ఆమె వేల సంఖ్యలో పుస్తకాల ప్రచురణ చేశారు. గత 27 ఏళ్లుగా పాఠ్యపుస్తకాలతోపాటు ఆధ్యాత్మిక గ్రంథాలు, సందేశాత్మక, మహనీయుల చరిత్రలనూ బ్రెయిల్ లిపిలో అందించారు. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అంధు లకు ఈ పుస్తకాలను ఉచితంగా అందించారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్, జనరల్ నాలెడ్జ్ బుక్స్, కథల పుస్తకాలు, సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్, వివేకానంద వంటి మహనీయుల చరిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇంగ్లిష్ భాషలో బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ప్రచురించి దేశవ్యాప్తంగా లైబ్రరీలకు అందించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లా డుతూ.. అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. సాధారణ విద్యార్థులతో పోటీపడేలా అంధ విద్యార్థులను చూడాలన్నదే తమ అభిమతమని చెప్పారు. -
అరుదైన అవకాశం
మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్‌లో దేశంలోనే మొదటిసారిగా అంధుల కోసం ప్రత్యేక ఓటరు కార్డులు ముద్రించారు. అలాగే అంధులు గుర్తించేలా ప్రత్యేక బ్యాలెట్‌ను కూడా ఇక్కడ రూపొందిస్తున్నారు. చాదర్‌ఘాట్: దేశ చరిత్రలోనే మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్ ప్రభుత్వ కార్యాలయం గుర్తింపు సాధించిందని బ్రెయిలీ ప్రెస్ ఎడిటర్ జి.వెంకటేశ్వరరావు (అంధుడు) తెలిపారు. బుధవారం మలక్‌పేటలోని కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు ఎక్కడాలేని విధంగా అంధుల కోసం ప్రత్యేకంగా ఓటరు ఐడీ కార్డు ముద్రించలేదన్నారు. ప్రస్తుతం మలక్‌పేట బ్రెయిలీ ప్రెస్ ఉద్యోగులు ముద్రించినట్లు చెప్పారు. నగర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల ప్రధానాధికారి రావత్ బ్రెయిలీ ఓటర్ ఐడీ కార్డును అభినందించారన్నారు. అంధులు ఎవరికి ఓటు వేయాలో గుర్తించేలా బ్యాలెట్ పేపర్‌ను తయారు చేస్తున్నట్లు రావత్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్లో జరగనున్న ఎన్నికల్లో బ్రెయిలీ లిపిలో తయారు చేసిన సుమారు 50 వేల ఓటరు ఐడీ కార్డులను ముద్రించినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. -
అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలోని అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డుల్ని త్వరలో జారీచేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయకర్తలను నియమించనున్నట్లు వెల్లడించారు. కేవలం ఓటర్కార్డుల్నే కాకుండా ఓటర్ స్లిప్పులను కూడా దివ్యాంగులు వాడుకునేలా రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడంపై బుధవారం నాడిక్కడ జరిగిన జాతీయ స్థాయి సదస్సులో రావత్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై దివ్యాంగులకు అవగాహన కల్పిచేందుకు త్వరలోనే ఓ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సహాయక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆడియో, వీడియోలతో పాటు సైగ భాషల రూపంలో వీరికి అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. -
రాజు ది గ్రేట్
జ్ఞానం మూడో నేత్రం అంటారు. మరీ ముఖ్యంగా అంధులకు చదువు చాలా ముఖ్యం. కళ్లతో లోకాన్ని చూడలేకపోయినా ఆత్మస్థైర్యం, పట్టుదలతో ప్రపంచాన్ని జయించగలరు. అంధులకు ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జీవితమే దీనికి ఉదాహరణ. తన మూడు సంవత్సరాల వయస్సులోనే ఒక ప్రమాదంలో ఆయన చూపు కోల్పోయారు. కానీ ఆత్మస్థైర్యాన్ని వీడక బ్రెయిలీ పేపర్ మీద ఎత్తు చుక్కల ఆధారంగా ఒక భాష రూపొందించారు. ఈ చుక్కలను స్మర్శించడం ద్వారా కనిపించకపోయినప్పటీకీ చదివేలా లిపి రూపొందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నేడు ఆ చుక్కల భాషే ఎందరో అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన అంధ ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజుది ఇటువంటి ఆదర్శప్రాయమైన జీవితమే. నేడు లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆ వివరాలు ఇలా.. జంగారెడ్డిగూడెం రూరల్ :కంటి చూపు కోల్పోయినా పట్టుదలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజు. మేనరికం కారణంగా బాల్యం నుంచి చూపుకు దూరమైనా ఎంతో కష్టపడి పీజీ స్థాయి వరకు చదువుకొని తాను విద్యనభ్యసించిన పాఠశాలలోనే ఉపా«ధ్యాయుడిగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మల్లాబత్తుల పోతురాజు ఇదే గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల మెయిన్‌లో 7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. అనంతరం 8 నుంచి టెన్త్ వరకు హైదరాబాద్‌లోని జీబీహెచ్‌ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ మలక్‌పేటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో, పీజీ ఉస్మానియాలో, బీఈడీ నల్లగొండలో విద్యనభ్యసించారు. 2001 డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన అనంతరం పోతురాజు మాస్టారు 2002 జనవరిలో పోలవరం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2003 నుంచి జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి తన స్వగ్రామమైన శ్రీనివాసపరంలో ఉన్న తాను చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బా«ధ్యతలు చేపట్టారు. తన సొంత గ్రామంలో, చదివిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయడం పోతురాజు జీవితంలో మరిచిపోని అనుభూతిగా నిలిచింది. పోతురాజు బ్రెయిలీ ద్వారా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆకట్టుకునే విద్యాబోధన పోతురాజు మాస్టారు విద్యాబోధన అంటే విద్యార్థులకు ఎంతో ఆసక్తి. అంధత్వం ఉన్నా పాఠ్యాంశాలకు సంబంధించిన బ్రెయిలీ పుస్తకాలను తెప్పించుకుని మరీ విద్యను బోధిస్తున్నారు. బ్రెయిలీ పుస్తకంలో చుక్కలను చేతితో తాకుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. బోర్డు దగ్గరగా తన కళ్లను పెట్టి అక్షరాలను కూడా అవలీలగా రాస్తూ విద్యాబోధన చేస్తున్నారు. 2012 సంవత్సరంలో పోతురాజు మాస్టారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. నా ఆత్మస్థైర్యమే నన్ను నడిపించింది నాకు చిన్ననాటి నుంచి అంధత్వం ఉన్నా ఏనాడు కుమిలిపోలేదు. ఆత్మస్థైర్యంతో చదివి అనుకున్నది సాధించాను. నా తల్లితండ్రులైన రాములు, సీతల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. నా స్వగ్రామంలో నేను చదవిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది. వైకల్యం కలిగిన వారిని చూసి అయ్యో పాపం అనేదాని కన్నా.. చేతనైనా సాయం చేస్తే ఎంతో మేలు చేసినవారవుతారు. –మల్లాబత్తుల పోతురాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
బ్రెయిలీలో భగవద్గీత
తెలుగుపై అభిమానం ఉన్న వారందరినీ మహాసభలు హైదరాబాద్‌కి నడిపిస్తున్నాయి. ముఖ్యంగా పండితులు, రచయితలు తాము రాసిన పద్యాలు, కవితలు, పుస్తకాల గురించి వినిపించాలని తాపత్రయపడుతున్నారు. అలా కర్నూలు నుంచి తాను రాసిన బ్రెయిలీ భగవత్గీత తీసుకొని వచ్చారు బూర్ల తిక్క లక్ష్మన్న. మహాసభల్లో పాల్గొనాలనే ఆసక్తి ముందు ఆయన అంధత్వం అడ్డంకి కాలేదు. తోడుగా మనువడిని తీసుకుని వచ్చిన ఆయన అవకాశమిస్తే స్టేజ్ మీద నాలుగు శ్లోకాలు చదివే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన్ను పలకరించినప్పుడు చెప్పిన విశేషాలు... కర్నూలు జిల్లా ఉరుకుండ గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే భగవంతుని ప్రేరణతో భగవద్గీత రాయాలని, గుడి నిర్మించాలని సంకల్పించుకున్నాను. సంస్కృత పండితులు, మా గురువు వరప్రసాద్ ఆశీస్సులు, సహకారంతో ఐదేళ్లలో ఈ పుస్తకాన్ని పూర్తి చేశాను. పద్యాలూ, వాటి అర్థాలనూ బ్రెయిలీలో రాశాను. తేజోమయనంద చిన్మయ మిషన్ 2001 డిసెంబర్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది. వికలాంగులకు ప్రాధాన్యమిచ్చే గ్రంథం వికలాంగులు ఎవరైనా వారి వైకల్యం పట్ల బాధతో ఉంటుంటారు. భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి ప్రార్థన శ్లోకంలోనే కృష్ణ భగవానుడు వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చాడు. మూకం కరోతి వాచాలం... అంటే.. కాళ్లు లేనివాడు కొండలెక్కుట, మూగవాడు సత్గ్రంథ పఠనం చెయ్యుట పరంధాముని కృపాయోగంతో జరుగుతాయని అర్థం. అర్జున విషాదం భగవద్గీత ప్రథమ అధ్యాయం, అందులో అంధుడైన ధృతరాష్ట్రుడు యుద్ధంలో ఏం జరుగుతుందని సంజయుడిని అడుగుతాడు. ఆ విధంగా ఈ గ్రంథంలో దివ్యాంగునికి ప్రథమంగా చోటు కల్పించినట్లయింది. జీవన దిక్సూచి ఈ గ్రంథం పిల్లల మనసు పలక లాంటిది. ఏం రాస్తే అదే ముద్రించుకుపోతుంది. చిన్నప్పుడే ఈ గ్రంథాన్ని పఠించేలా చేస్తే జీవితంలో మరింత అభివృద్ధి పొందుతారు. గీతా సారం శాంతికి మార్గం. ప్రయత్న లోపం ఉండరాదు, ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు, కాలం విలువైనది, రేపటికి రూపులేదు. మంచి పని వాయిదా వెయ్యకు లాంటి జీవిత సూక్తులను చెప్పి మన జీవితానికి దిక్సూచిలా నిలుస్తుంది భగవద్గీత. జీవిత లక్ష్యం నాలాంటి అంధులకు గీతా సారాన్ని అందించేందుకు నా జీవితం అంకితం. భగవద్గీత పద్యాలను వీలైనన్ని ఎక్కువ చోట్ల గానం చేస్తూ ఎక్కువ మందికి ఈ గ్రంథ సారాన్ని తెలియజేయలన్నదే నా జీవిత లక్ష్యం. ఒక అవకాశం.. ఫలాపేక్ష లేకుండా తెలుగు మహాసభల్లో భగవద్గీత గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలని వచ్చాను. ఇంత దూరం వచ్చిన నేను... వచ్చే ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ పుస్తకంలోని కొన్ని శ్లోకాలను వేదికపై చదవాలని ఉంది. అవకాశం ఇస్తే బాగుండు అని ఎదురుచూస్తున్నాను. - ఓ మధు -
డైజీ రికార్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి
– ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంలో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(అర్బన్): దివ్యాంగుల కోసం జిల్లాలో డైజీ రికార్డింగ్ సెంటర్‌కు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. బుధవారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా కర్నూలులోని అంధుల శిక్షణాభివృద్ధి కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు ఎస్. పుష్పరాజ్ అద్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా లూయిస్ బ్రెయిలీ జన్మదిన వేడుకలకు తాను హాజరవుతున్నానన్నారు. అంధుల సమాఖ్య తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడంతో పాటు సోషల్ జస్టిస్ మంత్రితో కూడా చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాకు సెన్సరీ పార్కు మంజూరు చేశామన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలన్నింటిని గ్రామ స్థాయి వరకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంధుల సమాఖ్య కార్యాలయ స్థలం కోసం పోరాడతానని చాంబర్‌ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి అన్నారు. మోడరన్ ఐ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతు , రోటరీ క్లబ్ న్యూసిటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు , అంధుల సమాఖ్య జాతీయ కార్యదర్శి విశ్వనాథరెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. అనీల్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. సుబ్రమణ్యం, కేవీఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు బి. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
చూపు ఉండీ... చూడలేకపోయారు!
నేడు వరల్డ్ బ్రెయిలీ డే అంధుల కోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టిన విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ. 1809 జనవరి 4న ఆయన ఫ్రాన్స్‌లో జన్మించారు. మూడేళ్ల వయసులో చూపు కోల్పోయారు. పదిహేనేళ్ల వయసులో... తన లాంటి అంధుల కోసం చదవడానికి, రాయడానికి ప్రత్యేక లిపిని కనిపెట్టారు. తన తర్వాతి తరాల అంధులకు దిక్చూచి అయ్యారు. అందుకే ఏటా ప్రపంచం ఆయన జన్మదినాన్ని ‘బ్రెయిలీ డే’గా జరుపుకుంటోంది. మనం మాత్రం ఇవాళ... చూపు ఉండీ చూడలేకపోయిన కొందరి గురించి చెప్పుకుందాం. ‘అబ్బే’ అని పెదవి విరిచారు! మొదట హ్యారీ పోట్టర్ నవలను 12 మంది పబ్లిషర్లు తిరస్కరించారు. స్క్రిప్టు చదవడం, బాగోలేదని వెనక్కి ఇచ్చేయడం! చివరికి బ్లూమ్స్బరీ ప్రచురణ సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా ఆ ప్రచురణ కర్త ఎనిమిదేళ్ల కూతురు ఏలిస్కు నచ్చబట్టి అది పుస్తకంగా వచ్చింది. తర్వాతి సంగతి మీకు తెలిసిందే. హ్యారీ పోట్టర్ ఏడు నవలలు, ఎనిమిది సినిమాలుగా వర్థిల్లింది. నవల 60 భాషల్లోకి తర్జుమా అయింది. రచయిత్రి జె.కె.రోలింగ్‌కు 100 కోట్ల డాలర్లకు పైగా సంపాదించి పెట్టింది. హిట్లర్ కనిపిస్తే వదిలేశాడు! ఈ ఫొటోలో ఉన్నది 1914 నాటి బ్రిటన్ సైనికుడు హెన్రీ టాండే. మొదటి ప్రపంచ యుద్ధంలో చురుగ్గా పాల్గొన్నాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అప్పటికి జర్మనీ సైన్యంలో సాధారణ సైనికుడు మాత్రమే. బ్రిటన్, జర్మనీల మధ్య యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో హెన్రీ టాండేకి అనుకోకుండా ఓ సొరంగంలో హిట్లర్ కనిపించాడు. చేతిలో ఆయుధం లేకుండా, గాయాలతో పడి ఉన్న హిట్లర్‌ను కాల్చి పారేయబోయిన హెన్రీ.. ఓ క్షణం ఆలోచించి, అది యుద్ధ ధర్మం కాదని తలచి హిట్లర్‌ను వదిలేశాడు. ఆ రోజు కనుక హెన్రీ టాండే.. హిట్లర్‌పై దయ చూపకుండా ఉండి ఉంటే, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సాగించిన నరమేధానికి 60 లక్షలమంది యూదులు బలై ఉండేవారు కాదేమో! సిరి వస్తుంటే వర్రీ అయ్యాడు! గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ 1999లో ఎగ్జయిట్ కంపెనీ సిఈవో జార్జి బెల్‌ను కలిసి ‘మా కంపెనీని 10 లక్షల డాలర్లకు చవగ్గా అమ్మేస్తాం కొంటారా?’ అని ఆఫర్ ఇచ్చారు. జార్జి బెల్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. వెనక్కొచ్చి మళ్లీ వెళ్లారు ఆ ఇద్దరు స్నేహితులు. ‘పోనీ ఓ పావు తగ్గించుకుని 7 లక్షల 50 వేల డాలర్లు ఇవ్వండి’ అని బేరం పెట్టారు. జార్జి బెల్ విసుగ్గా చూశాడు. ‘అబ్బే అంతకూడా ఎక్కువే’ అనేశాడు. ‘సరే, మీరు చెప్పండి.. ఎంతకు కావాలో’ అని అడిగారు లారీ, సెర్గీ. ‘ఎంతకు ఇచ్చినా వద్దు’ అనేశాడు జార్జి బెల్. దాంతో.. కష్టమో, నష్టమో గూగుల్‌ని తామే ఉంచుకుందా మని డిసైడ్ అయిపోయారు ఇద్దరు మిత్రులు. ఇప్పుడు గూగుల్ వాల్యూ ఎంతో తెలుసా? ఊపిరి బిగబిట్టి చదవండి. 36,500 కోట్ల డాలర్లు! అటుదిటు, ఇటుదటు అయింది! 2005లో ‘మిజోహో సెక్యూరిటీస్’ ప్రతినిధి తమ షేర్లలో ఒక షేర్‌ను ఆన్లైన్లో 6,10,000 ఎన్‌లకు అమ్మబోయి, పొరపాటున రాంగ్ కీ టైప్ చేయడంతో 6,10,000 వేల షేర్లు 1 ఎన్ ధర చొప్పున ట్రేడ్ అయ్యాయి! వెంటనే తన తప్పును తెలుసుకుని ‘తూచ్’ అని మొత్తుకున్నా టోక్యో స్టాక్ ఎక్ఛేంజి ఒప్పుకోలేదు. ట్రేడు ట్రేడే అని తెగేసి చెప్పేసింది. దాంతో ఆ కంపెనీ తన షేర్లను తనే ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవలసి వచ్చింది. హాయ్ అంటే పోవోయ్ అన్నాడు! 13వ శతాబ్దంలో.. మంగోలు చక్రవర్తి ఛంగిజ్‌ఖాన్, తన పొరుగున ఉన్న ఖ్వారెజ్మిద్ (నేటి ఇరాన్, ఇరాక్) చక్రవర్తి అల్లా ఉద్దీన్ మహ్మద్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడం కోసం, తన తరఫున ఒక దూతను పంపించాడు. అల్లా ఉద్దీన్ ఆ దూత తల నరికి, ఛంగిజ్‌ఖాన్ స్నేహహస్తాన్ని తిరస్కరించాడు. దాంతో తీవ్రంగా కోపోద్రిక్తుడైన చంగిజ్ఖాన్ రెండు లక్షల మంది యోధులను పంపించి ఖ్వారెజ్మిత్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయించాడు. ప్లాట్ఫారంలో ఇరుక్కుపోయాయి! 2014లో ఫ్రెంచి రైల్వే ఎస్.ఎన్.సి.ఎఫ్.. రెండువేల కొత్త రైలుబండ్ల నిర్మాణం కోసం 1500 కోట్ల డాలర్లను ఖర్చుపెట్టింది. అయితే దేశంలో ఉన్న 1300 రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల నిడివి... ఆ కొత్త డిజైన్‌తో తయారైన రైళ్ల వెడల్పుకు అనుగుణంగా లేకపోవడంతో ఆ పొరపాటును సరిద్దికోడానికి ఫ్రాన్స్ రైల్వే సంస్థ 5 కోట్ల డాలర్లకు పైగా ఖర్చుపెట్టి ప్లాట్‌ఫారమ్‌లను వెడల్పు చేయించవలసి వచ్చింది. -
త్రీ ఐడియాస్
చెవులకు చూపించింది అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న చిన్నారులలో కూడా కొందరు ఆర్థిక స్థితి బాగోలేకపోవడం వల్ల స్కూలుకు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. అలాటిది అసలు చూపు లేని పిల్లలయితే ఏమి చేస్తారు? ఎలా చదువుకుంటారు? సాంకేతిక విజ్ఞానం అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నా కూడా అలాంటి వారి కోసం బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలు తప్ప మరో విధమైన ఆధారం లేకపోవడం విచారకరం. దీనికి ప్రత్యామ్నాయం చూపించగలిగితే బాగుండుననుకుంది నిధి అరోరా. గుర్గావ్ కేంద్రంగా అంధులకోసం పని చేసే ఈషా అనే ఎన్జీవో వ్యవస్థాపకురాలీమె. తన సంస్థ ద్వారా నిధి అరోరా ‘సెంట్రల్ లైబ్రరీ ఆఫ్ ఆడియో బుక్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్’ (ఇఔఅఆఐఔ) అనే పథకాన్ని రూపొందించింది. అదేమిటంటే దృష్టిలోపం వంటి సమస్యలతో రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లలేని వారికోసం ఆడియో బుక్స్ తయారు చేయడం. అలా తయారు చేసిన ఈ పుస్తకాలు సునో అనే యాప్ ద్వారా ఆన్లైన్లో లభిస్తాయి. వీటిలో ప్రేమ్‌చంద్, కబీర్ దాస్ వంటి వారి ఉత్తేజపూరితమైన జీవిత కథలతో సహా ఎన్నో క్లాసిక్ కథలు, జానపద కథలు కూడా చదువుకోవచ్చు... సారీ వినొచ్చు. ఇంగ్లిష్తో సహా 17 భారతీయ భాషల్లో మొత్తం 5,398 ఫైళ్లను ఇఔఅఆఐఔలో పొందుపరిచారు. ఇందుకోసం ఈశా సంస్థకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా పని చేసే వేలాది వాలంటీర్లు ఉన్నారు. అనేక సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం విహ ంచేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. - నిధి అరోరా టైర్ల నుండి డీజిల్ పిండాడు! అరిగిపోయిన కారు టైర్లను ఏమి చేస్తారు? మామూలుగా అయితే విసిరి అవతలపారేస్తారు. లేదా వాటిని తగులబెట్టి పర్యావరణాన్ని పాడు చేస్తారు. కానీ అందరిలా వాటిని తాను అలా చేయదలచుకోలేదు గుర్గాన్‌కు చెందిన పదహారేళ్ల అనుభవ్ వాధ్వా. సర్వీస్ అయిపోయిన టైర్లతో పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని సంకల్పించాడు. పర్యావరణానికి పనికొచ్చే ఏదైనా ఒక మంచి పని చేయాలని ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుండేవాడు. అలా ఇతను రూపొందించిన టెక్ ఆప్టో అనే పథకం 600 స్టార్టప్ కంపెనీల్లో ఉత్తమమైందిగా నిలిచింది. ఓ రోజు అరిగి, పాడైపోతున్న పాత టైర్ల మీద అతని దృష్టి పడింది. ‘చెత్తనుంచి విద్యుత్‌ను, ఇంధనాన్ని తయారు చేస్తున్నప్పుడు, పేడనుంచి గోబర్ గ్యాస్‌ను తయారు చేస్తున్నప్పుడు టైర్లను ఉపయోగించి ఇంధనాన్ని ఎందుకు ఉత్పత్తి చేయకూడదు’ అనుకున్నాడు. అనేక ప్రయోగాల తర్వాత బయో డీజిల్‌ను ఉత్పత్తి చేయగలగడంలో సక్సెస్సయ్యాడు. పాత కారు టైర్లను సేకరించడం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌నూ రూపొందించాడు. అతనికి ఒక మెయిల్ ఇస్తే చాలు... కంపెనీ వారి ట్రక్ మన వద్దకు వచ్చి మరీ పాడైపోయిన టైర్లను తీసుకొని వెళ్తుంది. అలా పోగైన టైర్లను వర్గీకరించి, వాటిని రీ ట్రేడింగ్ చేస్తాడు. అందుకు కూడా పనికిరాని వృథా నుంచి బయో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తాడు. ఇలా తయారైన బయోడీజిల్ పూర్తి పర్యావరణహితమైంది. అనుభవ్ వాధ్వా యార్డునే ఏరిపారేసింది! పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ లేదా చెత్తకుండీ లేదా చెత్తను తీసుకుని వెళ్లే వాహనం ముందునుంచి వెళ్లవలసి వస్తే ఏం చేస్తాం? ఆ వాసన మన ముక్కుపుటాల్లోకి వెళ్లకుండా ముక్కును అదిమిపెట్టి పరుగు పరుగున దాటి వెళ్తాం. అయితే రోజూ ఆ వాసన మధ్యనే గడపవలసి వస్తే? స్లొవేకియాకు చెందిన లాయర్ జుజానా కపుటోవా ముక్కు మూసుకోలేదు. నోరు తెరిచి పదిమందినీ పోగేసింది. ఈమె ఇంటికి సమీపంలోనే ఒక పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ ఉంది. అది ఇరుగు పొరుగు దేశాల నుంచి డంప్ చేసుకున్న ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన చెత్త. అది చాలదన్నట్టు ఆ పట్టణంలో మరో చెత్త డంపింగ్ యార్డ్ కూడా పెట్టనున్నట్లు పత్రికల వార్తల ద్వారా తెలుసుకుంది. ఒక్క యార్డు ఉంటేనే ఇంత వాసన వస్తుంటే, ఇక రెండో యార్డు కూడా తోడైతే? ఇంకేమైనా ఉందా? దాంతో ఇరుగుపొరుగును కూడగట్టుకుని చెత్త డంపింగ్ యార్డును తమ పట్టణంలో పెట్టకూడదంటూ ఉద్యమించింది. ఈ ఉద్యమంలో ఎంతోమంది భాగస్వాములయ్యారు. ఆమె చేపట్టిన ఈ ఉద్యమం స్లొవేకియా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఫలితం... ప్రజలు నివసించే ప్రదేశంలో చెత్త డంపింగ్ యార్డ్ పెట్టడమేమిటంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది. అంతేకాదు... అంతవరకూ ఉన్న డంపింగ్ యార్డునూ అక్కడినుంచి తరలించాలంటూ తీర్పు చెప్పింది. దాంతో ప్రభుత్వం దిగి వచ్చింది. జుజానే పుణ్యమా అని ఆ పట్టణప్రజలంతా ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చగలుగుతున్నారు. - జుజానా కపుటోవా -
బ్రెయిలీలో పాఠ్యపుస్తకాలు సిద్ధం
తెలంగాణ వ్యాప్తంగా బ్రెయిలీ పాఠశాలలకు బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేసినట్టు బ్రెయిలీ ప్రెస్ మేనేజర్ రమేశ్ మంగళవారం తెలిపారు. అలాగే సర్వ శిక్షాభియాన్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బ్రెయిలీ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2,320 క్యాలెండర్లు, 2,500 పుస్తకాలు తయారు చేసినట్లు తెలిపారు. జిల్లాల ఉపాధ్యాయులు సర్వ శిక్షాభియాన్ ద్వారా ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా నార్వే దేశం నుంచి దాదాపు రూ.30 లక్షల విలువ గల ప్రింటర్లు కొనుగోలు చేస్తున్నట్లు రమేశ్ తెలిపారు. దీనివల్ల పుస్తకాలను కొరత లేకుండా సరఫరా చేస్తామన్నారు. -
బ్రెయిలీలో యోగా పుస్తకం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: బ్రెయిలీ లిపిలో ప్రచురించిన 'యోగి కా స్పర్శ్' అనే పుస్తకాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కుమార్తె, స్వయంగా యోగా టీచరైన నివేదితా జోషి ఈ పుస్తకాన్ని రాశారు. పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడిన ప్రణబ్.. మనిషి శారీరక, మానసిక, నైతిక వికాసానికి యెగా చక్కటి పరిష్కారమని పేర్కొన్నారు. యోగా గొప్పతనాన్ని ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంగీకరిస్తోందన్నారు. కాగా అంధులకు కూడా యెగాను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే పుస్తకాన్ని తీసుకొచ్చినట్టు నివేదితా జోషి తెలిపారు. దాదాపు 19 ఏళ్ల క్రితం పూర్తిగా అనారోగ్యం పాలైన తాను యోగా వల్ల పూర్తిగా కోలుకున్నానని ఆమె అన్నారు. ఇక అప్పటినుంచి తన జీవితాన్ని పూర్తిగా యోగాకు అంకిత చేశానని జోషి పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభకు నివేదిత తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. -
బ్రెయిలీ ఆలయం
మిణుగురులు సమాజానికి దివిటీలు వారికి చూపులేదు. కానీ, వారి వేళ్లకు చూపుంది. అందుకే, ఆ వేళ్లతోనే ప్రపంచాన్ని వీక్షిస్తున్నారు. ఆ వేళ్లతోనే పాఠశాల అంధ బాలలకు కావల్సిన పుస్తకాలను ముద్రిస్తున్నారు. చేసే పనిని దైవకార్యంగా, ముద్రణాలయాన్ని దేవాలయంగా భావిస్తూ తమ జీవితాల్లో నిండుదనాన్ని నింపుకుంటున్నారు. ప్రభుత్వ బ్రెయిలీ పాఠ్యపుస్తక ముద్రణాలయం అది. అక్కడ 12 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో ఎనిమిది మంది అంధులే! తాము నేర్చుకున్న విద్యను యంత్రాల సాయంతో బ్రెయిలీ పుస్తకాలను తయారు చేయడంలో నిమగ్నులై ఉంటారు వీరంతా! హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో ఉన్న ఈ ‘ఆలయం’ నుంచి ఇరవై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వ అంధుల పాఠశాలలకు, స్వచ్ఛంద సంస్థలకు, కాలేజీలకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు వెళుతున్నాయి. అచ్చంగా అచ్చు ముందు గదిలో విశాలమైన బల్ల, దానిపై అల్యూమినియమ్ షీట్‌ను యంత్రానికి అమర్చి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో బటన్లను ఉపయోగిస్తూ బ్రెయిలీ లిపికి ప్రాణం పోస్తుంటారు. మార్బర్ స్టెరియో టైపర్ అనే ఈ యంత్రంపై చేసేవి ప్రాథమిక దశ పనులు. ఈ మిషనరీ దగ్గర మొదటి నుంచీ పనిచేస్తున్న వెంకటేశ్వరరావు పూర్తిగా అంధులు. ‘‘1986లో తొమ్మిది మందితో ఈ ముద్రణాలయం ఏర్పాటైంది. అందులో మొదటి బ్యాచ్ నుంచీ పనిచేస్తున్నాను. ఈ పనికి ఎంపికవడానికి ముందు మద్రాస్‌లోని పల్లవరంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. నాతోపాటు మరో 8 మంది ఈ శిక్షణ తీసుకున్నారు. మా కమ్యూనిటీకి ఈ విధంగా సేవ చేసే భాగ్యం దక్కిందని, ఎంతో మంది అంధుల చేతుల్లో మేం తయారు చేసిన పుస్తకాలు ఉంటాయని, వారి వేళ్లకు మేం చూపుగా అయ్యామన్న ఆనందం, సంతృప్తితో ఈ పనులను చాలా ఇష్టంగా చేస్తుంటాం మేమంతా’’ అని వెంకటేశ్వరరావు వివరించారు. స్టీరియోటైపర్ నుంచి కాస్త పక్కకు జరిగితే అక్కడే మరో బల్లపై ప్రూఫ్‌రీడింగ్ జరుగుతుంది. అచ్చులో వచ్చిన తప్పులను మరో యంత్రం సాయం తో సరిచేస్తారు. అంటే డాట్స్‌లో తేడాలు వస్తే వాటిని తీసేయడం, లేదా తిరిగి డాట్స్ వేయడం ఈ పద్ధతిలో జరుగుతుంది. 28 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న రమేష్‌కి చూపు బాగానే పనిచేస్తుంది. అంధులకు సహాయంగా ఉంటూ చేసే పని తన జన్మకు ధన్యతను చేకూర్చుని చెబుతూ ‘‘ఇక్కడ అచ్చు వేయడం దగ్గర నుంచి, పుస్తకం బయటకు వచ్చేవరకు అన్ని పనులు చేస్తుంటాను’’ అని తెలిపారు. పుస్తకాల నిలయం ప్రూఫ్ రీడింగ్ నుంచి ప్రింటింగ్ సెక్షన్‌కు వెళితే అక్కడ మరో మూడు పద్ధతుల్లో పనులు జరుగుతుంటాయి. అక్కడంతా గులాబీ, తెలుపు రంగులో పెద్ద పెద్ద చార్టులు, వాటిని పుస్తకరూపం లోకి మార్చి, పేర్చిన దొంతర్లు కనపడతాయి. ‘‘ముందు పుస్తకానికి కావల్సిన పరిమాణాన్ని ఎంపికచేయడానికి ఒక చార్ట్ వేసుకుంటాం. దాని ప్రకారంగా మిగతా అన్ని చార్ట్‌లను వరుసక్రమంలో ఉంచుతాం. ఇవన్నీ హీడెల్‌బర్గ్ ప్రింటింగ్ మెషిన్లో సెట్ చేస్తాం. ఎన్ని కాపీలు కావాలో ముందే నిర్ణయించుకుని ఉంటాం కాబట్టి, ఆ లెక్కన మిషనరీ సాయంతో కాపీలు తీసుకుంటాం’’ అని తెలిపారు కంటిచూపు కొంతవరకే (పార్షియల్ బ్లైండ్) బాగున్న మురళి. పాతికేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న జయప్రకాష్ కూడా అంధుడే. ‘‘ఇక్కడ ముద్రించిన కాపీలను కటింగ్ మిషన్ ద్వారా కావల్సిన సైజ్‌లో కట్ చేసి, బైండ్ చేస్తాం. అటు నుంచి పుస్తకాలన్నీ క్రమపద్ధతిలో అమర్చి, వచ్చిన ఆదేశాల ప్రకారం పంపిణీ చేస్తాం. అయితే, ఇంత సంఖ్య అని కచ్చితంగా ఉండదు’’ అని తెలిపారు జయప్రకాష్. బయట ఎన్ని సమస్యలున్నా, ఇక్కడికొచ్చామంటే అన్నీ మర్చిపోతాం. ఈ రోజు జరగాల్సిన కృషి ఏంటి.. అనే దాని మీద మా మధ్య చర్చలు ఉంటాయని తెలిపారు అక్కడ పనిచేస్తున్న మిగతా సభ్యులు. పనులు వేగవంతం కంప్యూటర్ ద్వారా ఉర్దూ పాఠ్యాంశాలను బ్రెయిలీ లిపిలో అందిస్తున్న సయ్యద్ యాదుల్లాను పలకరిస్తే -‘‘ఉర్దూ బ్రెయిలీ ప్రింటర్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. కంప్యూటర్లో ఉర్దూ బ్రెయిలీని టైప్ చేసి, ఆ తర్వాత ప్రింట్స్ తీసి, బైండింగ్ చేసే దగ్గరకు పంపిస్తుంటాను’’అని తెలియజేశారు సయ్యద్. - నిర్మలారెడ్డి -
బ్రెయిలీ లిపిలో రామాయణం
తిరుమల: బ్రెయిలీ లిపిలో రూపొందించిన రామాయణం గ్రంథాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు గురువారం ఆవిష్కరించారు. చూపులేని భక్తులకు ఆధ్యాత్మిక, సాహిత్యజ్ఞానాన్ని కల్పించేందుకు టీటీడీ బ్రెయిలీ లిపిలో ఉషశ్రీ రామాయణాన్ని రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన దేవనార్ ఫౌండేషన్ సహకారంతో దీన్ని ప్రచురించారు. ఈ మేరకు శ్రీవారి వసంతోత్సవాల సందర్భంగా వసంత మండపం ముందు ఈ గ్రంథాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో దేవనార్ ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబుగౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారికి రూ. 50 లక్షల విరాళం తిరుమల శ్రీవారి ట్రస్టులకు గురువారం రూ. 50 లక్షలు విరాళంగా అందింది. ముంబైకి చెందిన ఏబీఏ. దుభాష్ తన జీ అండ్ బుమాంజీ చారిటీ ట్రస్టు పేరుతో రూ. 50 ల క్షలు విరాళంగా ఇచ్చారు. -
అంధరివాడు
బ్రెయిలీ లిపి అంధులకు మాత్రమే కాదు, అందరికీ అవసరమేనంటారు విశ్రాంత ఉద్యోగి గంగారామ్. అంధులతో పాటు, అనాధలను ఆదుకోవడానికి, యువతీ యువకులలో జీవితం పట్ల ఆశావహ దృక్పథం పెంపొందించడానికి ఆయన ఓ చారిటబుల్ ట్రస్టును, వికలాంగులకోసం ‘ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ డిజేబిలిటీ’ అనే మరో స్వచ్ఛంద సంస్థనూ నెలకొల్పి, సేవలు అందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇన్ని పనులు చేస్తున్న గంగారామ్ కూడా అంధుడే కావడం! - నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి బ్రెయిలీ ఫర్ ఆల్... ఇదీ గంగారామ్ నినాదం. చూపున్నవారికి కూడా ఆయన బ్రెయిలీ లిపి నేర్పిస్తున్నారు! ‘‘పిల్లలకు, పెద్దలకు ఇప్పుడు ఏకాగ్రత లేకపోవడం ప్రధాన సమస్య. అందుకే అంధులు మాత్రమే అలవరచుకునే స్పర్శ జ్ఞానాన్ని మిగతావారు కూడా సాధన చేయాలి. స్పర్శజ్ఞానం ఏకాగ్రతను కలిగిస్తుంది. వృద్ధులయ్యాక చాలామందిలో అరవై శాతం కంటిచూపు తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఒంటరి జీవితం గడిపేవారు బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలను అవలీలగా చదువుకోవచ్చు. ఒంటరితనాన్ని దూరం చేసుకోవచ్చు. చీకట్లో కూర్చుని కూడా పుస్తకాలు చదువుకోవచ్చు. ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ బ్రెయిలీ లిపిలో పుస్తకాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. పుస్తకపఠనం పట్ల ఆసక్తి ఉన్న అంధులకు అవి అందుబాటులో లేవు. వీలైనన్ని పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి అనువదిస్తే ఎంతో విజ్ఞానం అంధులకు చేరువలోకి వస్తుంది’’ అంటూ, ఇలాంటివే ఎన్నో విలువైన సూచనలు ఇస్తారు గంగారామ్! అలాగని సలహాలతో సరిపెట్టడం లేదు ఆయన. తన స్నేహితులకు, ఇంటి వద్ద ఉండే పిల్లలకు, వృద్ధులకు, మిత్రులకు.. బ్రెయిలీ లిపిని నేర్పుతున్నారు. అందుకు కావల్సిన బ్రెయిలీ కిట్‌ను తానే సమకూర్చుతున్నారు. అంధుల సమస్యలను అర్థం చేసుకోండి అంటూ ‘మా కోసం ఓ నిమిషం’ అనే నినాదంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రేరణ ఇచ్చిన మిత్రుడు పదేళ్ల క్రితం గంగారామ్ మిత్రుడు (కంటిచూపు బాగున్న వ్యక్తి) ‘నాకూ బ్రెయిలీ లిపి’ నేర్పించవా అని ఆసక్తిగా అడిగాడట. ‘నీకెందుకయ్యా. చూపు బాగున్నవాడికి!’ అన్నారట గంగారామ్. ఆ తర్వాత అతను ఊరు వెళ్లిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మిత్రుడు గంగారామ్‌కు ఫోన్ చేసి ‘ప్రమాదంలో రెండు కళ్లూ పోయాయి. బ్రెయిలీ లిపి అప్పుడే నేర్చుకుని ఉంటే ఇప్పుడు పనికొచ్చేది కదా!’ అన్నాడట. ఆ విషయాన్ని గంగారామ్ ప్రస్తావిస్తూ- ‘నాకు చాలా బాధ వేసింది. ఏదో తప్పిదం చేసినట్టు కూడా అనిపించింది. అప్పటి నుంచే ‘బ్రెయిలీ ఫర్ ఆల్’ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను. సాధ్యమైనంత మందికి ఈ లిపి నేర్పించాలని గట్టిగా అనుకున్నాను. అలా చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ఇప్పటికి చాలామందే ఈ లిపిని నేర్చుకున్నారు. ఇంకా నేర్చుకుంటున్నారు. మలక్‌పేట సూపర్ బజార్లో బ్రెయిలీ పార్క్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది. అందులోనే ‘డిజేబుల్ టుడే’ అని అంధులకు బ్రెయిలీ లిపి నేర్పించే దిశగా కృషి చేయబోతున్నాను. వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికీ బ్రెయిలీ లిపి నేర్పించాలనుకుంటున్నాను’’ అని తెలిపారు గంగారామ్! కౌన్సెలింగ్ సెంటర్ గంగారామ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఉద్యోగ జీవితం, కుటుంబం, మిత్రుల సాంగత్యం.. ఇద్దరు కూతుళ్ల వివాహ వేడుకలు.. అంతా సవ్యంగా జరిగిపోతున్న తరుణంలో రెండవ కూతురు బాలవీక్షణ తన స్నేహితురాలు చనిపోయిందనే ఆవేదనతో తనూ ఆత్మహత్య చేసుకుంది. అంధులైన వారే ఎంతో ఆత్మస్థైర్యంతో జీవిస్తుంటే అన్నీ సక్రమంగా ఉన్నవారు మానసిక బలహీనులై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు! కూతురు అతనిలో రేపిన ఈ ఆలోచనతోనే ‘బాల మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్’ (హైదరాబాద్, మలక్‌పేట) ఏర్పాటు చేసి, దాని ద్వారా అన్ని వయసుల వారికి కౌన్సెలింగ్ ఇస్తూ, జీవితం పట్ల ఆశావహ దృక్పధాన్ని పెంపొందిస్తున్నారు గంగారామ్. డాట్స్ విత్ డేట్స్ క్యాలెండర్ చూపున్నవారికే తప్ప చూపులేనివారికి అది తెలియజేసేదేమీ ఉండదు. ఈ అవస్థ అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి మూడేళ్ల క్రితం క్యాలెండర్లో బ్రెయిలీ డాట్స్‌ను ప్రవేశపెట్టి అంధులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు గంగారామ్. దానిని మరికాస్త అభివృద్ధి పరిచి ‘డాట్స్ విత్ డేట్స్’ పేరిట ఈ యేడాది క్యాలెండర్‌ను ముద్రించారు. జీతం ద్వారా వచ్చే డబ్బులోనే కొంత భాగాన్ని వికలాంగ విద్యార్థుల సంక్షేమం కోసం వెచ్చిస్తూ వచ్చిన గంగారామ్ ఇప్పుడు పెన్షన్ ద్వారా లభించే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు వికలాంగులకు అందేలా కృషి చేస్తున్నారు. చూపున్నవారితో పోటీ పడి పనులు చేయడమే కాదు, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడుతున్నారు! మూడేళ్ల వయసులో... నిజామాబాద్‌లో పుట్టిన గంగారామ్‌కి మూడేళ్ల వయసులో అమ్మవారు పోసి అంధత్వం ప్రాప్తించింది. అయితే అతని తెలివి తేటలకు ముచ్చటపడిన బంధువులు హైదరాబాద్‌లోని దారుషాహి అంధుల స్కూల్లో చేర్పించారు. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నారు. అక్కడే బ్రెయిలీ లిపి నేర్చుకున్నారు. తర్వాత బి.ఇడి, ఎంఫిల్ చేశారు. హిందీ భాషతో పాటు తెలుగు సాహిత్యంపై మక్కువతో ఎన్నో పుస్తకాలు చదివారు. ముందు అధ్యాపకుడిగా, ఆ తర్వాత బ్రెయిలీ ప్రెస్‌లో ‘స్టీరియో ఆపరేటర్ కమ్ ఫ్రూఫ్ రీడర్’గా, ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో కౌన్సెలింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫీసర్‌గా, పదేళ్ల పాటు బ్రెయిలీ ప్రెస్ మేనేజర్‌గా.. ఇలా వివిధ శాఖలలో విధులు నిర్వహించారు. -
బ్రెయినీ పిల్లాడి బ్రెయిలీ ప్రింటర్
అమావాస్య చీకటి లాంటి అంధుల జీవితంలో పున్నమి వెలుగును పంచిన వ్యక్తి లూయీ బ్రెయిలీ. అంధులకంటూ ఒక ప్రత్యేకమైన లిపిని రూపొందించి వారికి ఒక వరాన్నిచ్చాడాయన. అయితే అది అందరికీ అందుబాటులోకి రావడం లేదు. ఎందుకంటే... అంధులకోసం పుస్తకాలను ముద్రించే ప్రింటర్ల ఖరీదు చాలా ఎక్కువ. ఫలితంగా బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాల ధర లు కూడా ఎక్కువే! ప్రత్యేకించి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు చెందిన అంధులకు బ్రెయిలీ లిపిలోని పుస్తకం కొనడం తలకు మించిన భారమే! దీంతో అంధుల కోసం తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి, సరికొత్త ప్రింటర్‌ను రూపొందించాడు క్యాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయ కుర్రాడు శుభమ్ బెనర్జీ (12). . ‘‘ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ దారిలో కొంతమంది వ్యక్తులు ‘అంధుల సంక్షేమార్థం’ నిధులు సేకరించడాన్ని గమనించాను. ఇంటికి వెళ్ళాక కూడా ఆ దృశ్యం నన్ను వెంటాడింది. అంధుల చుట్టూనే నా ఆలోచనలన్నీ తిరిగాయి. ఇంతకీ అంధులు ఎలా చదువుకొంటారు? అనే సందేహం వచ్చింది. ఆ విషయాన్నే అమ్మానాన్నలను అడిగితే, ‘వెళ్లి ‘గూగుల్’ లో చూడు’ అన్నారు. అలా అంధులపై నా పరిశోధన మొదలైంది’’ అని శుభమ్ చెప్పుకొచ్చాడు. అంధులు బ్రెయిలీ లిపి ద్వారా చదువుతారని తెలుసుకొన్న శుభమ్ బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్ల ఖరీదు కూడా ఎక్కువని అర్థం చేసుకొన్నాడు. అసలే వైకల్యంతో బాధపడుతున్న వాళ్లకు అలా ప్రింటర్ల ధర, పుస్తకాల ధర కూడా ఎక్కువగా ఉండడం ఏమిటా అన్న ఆలోచనలో పడ్డాడు. ‘‘వారికోసం తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంచొచ్చు కదా? అనే ఆలోచన వచ్చింది, సమాధానం కూడా నేను ఇచ్చుకోవాలనుకొని బ్రెయిలీ ప్రింటర్ రూపకల్పనకు పూనుకొన్నాను’’ అని క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో సెవన్త్ గ్రేడ్ చదువుతున్న ఈ అబ్బాయి చెప్పాడు. బ్రె యిలీ ప్రింటర్ ఎలా పనిచేస్తుందనే విషయం గురించి పరిశోధించాడు. ఓ పక్కన స్కూలులో ఇచ్చిన ఎసైన్మెంట్లు చేసుకొని, ఆ తరువాత ఈ నవీన ఆవిష్కరణ కోసం కుస్తీలు పట్టేవాడు. ఈ చిన్న కుర్రాడు ఒక్కో రోజున అర్ధరాత్రి 2 గంటల దాకా మెలకువగా ఉండి మరీ పని చేసేవాడు. చివరకు తక్కువ ఖర్చులో బ్రెయిలీ ప్రింటర్ నమూనాను రూపొందించాడు. ‘‘నా ఊహాల్లోని ప్రింటర్‌కు నా తల్లితండ్రుల సహకారంతో ఒక రూపాన్నిచ్చాను. అది విజయవంతమైంది’’ అన్నాడు శుభమ్. అతను రూపొందించిన ఈ ప్రింటర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఉన్న ఫైల్స్‌కు కాగితంపై అక్షర రూపాన్నిస్తుంది. అయితే దాన్ని మార్కెటింగ్ చేసే ఉద్దేశం అతనికి లేదు. ‘‘నేను వ్యాపారిని కావడానికి దీన్ని రూపొందించలేదు. అంధుల సౌకర్యార్థమే ఈ ప్రయత్నం. అది విజయవంతం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే... ఇది పెద్ద ఎత్తున పుస్తకాల తయారీకి ఉపయోగపడదు. ఎవరికి వారు తమ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కిట్ గురించి పూర్తి వివరాలు నా వెబ్సైట్లో ఉన్నాయి. కావాలనుకొనే వాళ్లు ఆర్డర్ చేయవచ్చు. మీరే ఇంటి దగ్గర ఆ కిట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు’’ అని శుభమ్ బెనర్జీ వివరించాడు. ఈ మధ్య అమెరికాలోని ఓ సైన్స్ ప్రదర్శనలో శుభమ్ తన నమూనాను ప్రదర్శించినప్పుడు అందరూ ఆసక్తిగా గమనించారు. చూపు లేనివారికి ఉపయోగపడే ఈ కారు చౌక ప్రింటర్ ఇప్పుడు పెద్ద సంచలనమైంది. అమెరికన్ మీడియా అంతా చిన్న వయసులోనే పెద్ద మేధావి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది. ఖరీదు తక్కువ! సాధారణంగా ఒక బ్రెయిలీ ప్రింటర్ ఖరీదు లక్షా ఇరవై వేల రూపాయల వరకూ ఉంటుంది. అయితే శుభమ్ బెనర్జీ రూపొందించిన మోడల్ ప్రింటర్ ఖరీదు కేవలం ఇరవై వేల రూపాయలకే అందుబాటులో ఉంటుంది. దీని పేరు ‘బ్రెయిగో’. అంధులకు లిపిని రూపొందించిన లూయీ బ్రెయిలీ పేరు, అందుకు సంబంధించిన ప్రింటర్ లెగో పేరు కలుపుతూ తన కొత్త ప్రింటర్‌కు ‘బెయిగో’ అని పెట్టాడు. -
ఇక పుస్తకాలనూ వినవచ్చు!
వాషింగ్టన్: ఏదైనా పుస్తకంలో అక్షరాలపై మీ వేలు కదిలిస్తుండగా... అది మీకు వినిపిస్తే... హాయిగా కళ్లు మూసుకునో, కుర్చీలో జారగిలపడి నచ్చిన పుస్తకాలను వినగలిగితే! ఎంత బాగుంటుందో కదూ! అలాంటి సరికొత్త ఫింగర్ రీడర్ పరికారాన్నిమసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మీడియా ల్యాబ్ పరిశోధకులు రూపొందించారు. సాధారణ వ్యక్తుల కంటే దృష్టిలోపం ఉన్నవారు పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడానికి ఈ ‘ఫింగర్ రీడర్’ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అందుకోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశామని... లైన్ ప్రారంభం, ముగింపు, తర్వాతి లైన్లోకి మారడం, ఒకే లైన్లో కదలడం వంటివాటిని ఈ పరికరం గుర్తించి, చెబుతుందని తెలిపారు. ఈ పరికరంతో అక్షరాలను చదవడం మాత్రమేగాకుండా... మరో భాషలోకి తర్జుమా చేసుకుని వినే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
ఆయుర్జ్యోతి.. అనిల్
సాక్షి, హన్మకొండ : వైద్య రంగంలో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో పుస్తకాన్ని ముద్రించిన ఘనత వరంగల్ నగరానికి దక్కింది. నగరానికి చెందిన అనిల్ ప్రపంచంలోనే తొలిసారిగా అంధులు, ప్రత్యేక అవసరాలు కలిగినవారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రెయిలీ లిపిలో ఆయుర్జ్యోతి అనే పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్నేషనల్ ఆయుర్వేద అకాడమీ ఆధర్యంలో శనివారం నాలుగో తేదీన దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ ఆయుర్వేద, యోగా కాన్ఫరెన్స్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.63కోట్ల మంది అంధులకు ఈ పుస్తకం వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఘనత మనదే ఆయుర్జ్యోతి పుస్తకాన్ని రచించిన పులి అనిల్‌ది నగరంలోని గోపాలపురం. తండ్రి రాజయ్య డీఎస్పీగా పనిచేస్తున్నారు. తల్లి కళావతి గృహిణి. అనిల్ 2004లో అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ కోర్సులో చేరారు. 2011లో ఎండీ కోర్సు చదివేందుకు కర్ణాటకలోని హాసన్ వెళ్లారు. అక్కడున్నప్పుడు అంధ విద్యార్థులకు ఉపయోగపడే అతిపెద్ద లైబ్రరీ మైసూరులో ఉందని తెలిసి దాన్ని చూసేందుకు 2012లో వెళ్లారు. అక్కడ ఆర్థిక శాస్త్రం, గణితం, సాహిత్యం, ఆంగ్లం.. ఇలా అన్ని అంశాలపై బ్రెయిలీ లిపిలో పుస్తకాలున్నాయి. కానీ వైద్యశాస్త్రంపై ఒక్క పుస్తకం కూడా కనిపించలేదు. ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నాయోమోనని వెతికి చూశారు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఇలా ఏ విభాగంలోనూ బ్రెయిలీ లిపిలో పుస్తకం ఉన్నట్టుగా ఆనవాళ్లు కనిపించలేదు. ఆరు నెలల్లో పూర్తి సరళమైన వ్యవహారిక భాషలో ఆయుర్వేద వైద్య విధానంలో ఉన్న విలువైన అంశాలను బ్రెయిలీలిపిలో ఓ పుస్తకం రాసి దాన్ని అందుబాటులోకి తెస్తే అంధులు తమంతట తాముగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే లక్ష్యంతో ఆయుర్జ్యోతి పుస్తకం రాయాలని అనిల్ నిర్ణయించుకున్నారు. నిత్య జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సూచనలు, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలతో 2013లో మేలో పుస్తకం రాయడం మొదలుపెట్టారు. ఆర్నెళ్ల పాటు శ్రమించి పుస్తకాన్ని తొలుత ఆంగ్లంలో ముద్రించారు. ఆ తర్వాత బ్రెయిలీ లిపిలోకి దానిని మార్చి హైదరాబాద్‌లోని సమన్వయి పాఠశాలలోని అంధులతో చదివించారు. వారు చేసిన సూచనల మేరకు మరికొన్ని మార్పులు చేసి తుది పుస్తకాన్ని 2013 డిసెంబర్ నాటికి ముద్రించారు. సకల సమాచారం పుణె కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సన్‌రైజ్ పీపుల్ అనే సంస్థ ఈ పుస్తకాన్ని బ్రెయిలీ లిపిలో ముద్రించింది. ఇందులో మొత్తం 147 పేజీలున్నాయి. ఆయుర్వేద పరిచయం, దినచర్య, రుతుచర్య, రాత్రిచర్య, షడ్రస, వేగధారణ, సత్వృత్తం, ఆహార విహారాలు, విరుద్ధ ఆహారం, ఆయుర్వేద మెథడాలజీ వంటి అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన వాషింగ్టన్‌లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ బ్లైండ్, మల్టిపుల్ డిసేబుల్డ్ లైబ్రరీలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న 30కి పైగా గ్రంథాలయాలకు ఈ పుస్తకాన్ని ఉచితంగా అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా అంధుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సంస్థలకు కూడా ఈ పుస్తకాన్ని అందివ్వడానికి అనిల్ ముందుకొచ్చారు. ఒక్కరికి ఉపయోగపడినా చాలు సాధారణంగా అంధులు ఇతరులతో కలిసి ఉండేది చాలా తక్కువ. వారి నిత్య జీవితంలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు నా ఆయుర్జ్యోతి పుస్తకం చక్కని పరిష్కారం చూపిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ పుస్తకం ఒక్క అంధుడికి ఉపయోగపడినా నా శ్రమ ఫలించినట్లే. బ్రెయిలీ లిపిలో పుస్తకం రాస్తున్నానని తెలియగానే ముద్రణా సంస్థలు, ఫార్మా కంపెనీలు స్వచ్ఛందగా ముందుకొచ్చి సహకారం అందించాయి. - పులి అనిల్, ఆయుర్జ్యోతి పుస్తక రచయిత -
చీకటిని ఓ చూపు చూశాడు!
ఐదేళ్ల వయసులో షాకీర్ కళ్ల ముందరి రంగులన్నీ డిజాల్వ్ అయిపోయాయి! చీకటి మాత్రమే ఒక రంగుగా మిగిలింది. ఊహ తెలిసివచ్చి, యవ్వనకాంతులీనే వేళ... చుట్టూ చీకటి! సముద్రమంత చీకటి. ఆకాశమంత చీకటి. షాకీ ర్కి వేరే మార్గం లేదు. చీకటిని ఛేదించాలి, చీల్చి చెండాడాలి. లేకుంటే జీవితమే డిజాల్వ్ అయిపోతుంది. దేవుడిచ్చిన జీవితాన్నివృధా కానీయకూడదనుకున్నాడు. దేవుడేదో ఇవ్వలేదని... వ్యధ చెందకూడదనుకున్నాడు. ఇప్పుడు షాకీర్ ఓ లైట్ హౌజ్!! జీవన సాగరయానం చేస్తున్న ఎందరో యువతీయువకులకొక దీపస్తంభం! ఈవారం ‘జనహితం’ చదవండి. షాకీర్కి ఎన్ని కళ్లున్నాయో, అవి ఎంత నిశితంగా చూస్తున్నాయో తెలుస్తుంది. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, స్పోకెన్ ఇంగ్లీష్ అధ్యాపకుడిగా పేరుతెచ్చుకున్న 33 ఏళ్ల షాకీర్ ఉంటున్నది హైదరాబాద్ లోని అమీర్‌పేట్‌లో! సొంత ఊరు తిరుపతి. తల్లిదండ్రులకి కలిగిన ఐదుగురు సంతానంలో మూడవ బిడ్డ షాకీర్! తండ్రిది మిలటరీలో ఉద్యోగం. తల్లికి పిల్లల ఆలనపాలనే సర్వస్వం. తల్లిదండ్రులది మేనరికం అవడం వల్లనో, మరే కారణమో తెలియదు గాని షాకీర్‌కు ఐదేళ్ల వయసులోనే గ్లకోమా వ్యాధి వల్ల లోకం చీకటిమయమైంది. ఎన్నో ఆసుపత్రులు తిప్పారు. ఎంతోమంది డాక్టర్లను కలిశారు. ఇక చూపు రాదని డాక్టర్లు తేల్చిచెప్పేశారు. కుటుంబం మొత్తం షాకీర్ మీద ఆశలు వదులుకుంది. కాని వెక్కిరించిన విధిని ధిక్కరించాలనుకున్నాడు షాకీర్. చదువంటే అమితమైన ఇష్టం. ఐదో తరగతి వరకు అంధుల పాఠశాలలో చదివాడు. అటు పిమ్మట చూపున్న పిల్లలు చదివే స్కూల్‌కే వెళ్లేవాడు. పాఠాలు చూసి చదివే పరిస్థితి లేదు. స్నేహితులు పాఠాలు పెద్దగా చదివితే, రికార్డ్ చేసుకొని, వాటిని మళ్లీ మళ్లీ విని గుర్తుపెట్టుకొని పరీక్ష లకు హాజరయ్యేవాడు. అలా టెన్త్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. కంటిచూపు లేకపోతేనేం వినడానికి చెవులున్నాయి కదా! అనుకునేవాడు. అందరిలా అన్నీ చేయలేకపోయినా ఏదో చేయాలన్న కసి మాత్రం అతన్ని కుదురుగా కూర్చోనిచ్చేది కాదు. ఇంటర్మీడియెట్‌లో సైన్స్ గ్రూప్‌లో చేరాలనుకుంటే, ‘చూపులేని వాడి వి ప్రాక్టికల్స్ ఎలా చేస్తావు’ అనడిగారు. దాంతో తప్పనిసరై ఆర్ట్స్ గ్రూప్ ఎంచుకున్నాడు. ఒక దారి మూసుకుపోతేనేం మరో దారి ఉంది కదా అని బయల్దేరేవాడు షాకీర్! అతని పట్టుదలకు తగిన ప్రోత్సాహాన్నివ్వడమే అతనికి ఇవ్వవలసిన ఆస్తిగా భావించారు కుటుంబ సభ్యులు. తల్లిదండ్రుల ఆసరాతో డిగ్రీ అయ్యాక ఎం.బి.ఏ పూర్తి చేశాడు. రాష్ట్రంలోనే మొదటిసారి ఓ అంధుడు ఎం.బి.ఏ పూర్తిచేసిన రికార్డ్‌ను షాకీర్ సొంతం చేసుకున్నాడు. జీతం తీసుకోవడం కాదు... ఇవ్వాలి... డిగ్రీ పూర్తయ్యాక షాకీర్‌కు విజయవాడలోని ఓ గవర్నమెంట్ కాలేజీలో క్లర్క్ ఉద్యోగం వచ్చింది. అకౌంట్స్ చూడాలంటే కళ్లు కనపడవు. తనకోసం బ్రెయిలీ లిపిలో అకౌంట్స్ చేయలేరు. అలా రోజంతా ఖాళీగా కూర్చొని జీతాలనాడు జీతం తీసుకోవాలంటే.. చాలా గిల్టీగా అనిపించేది. దీనికితోడు చుట్టూ ఉన్నవారి వెటకారంతో కూడిన సానుభూతి... ఇంతకుమించి మంచి జీవితం తనకు రాదా అని ప్రశ్నించుకున్నాడు. తన శక్తిని తాను గుర్తించి, ప్రయోగం చేయగలిగినవాడు ఎక్కడైనా సక్సెస్ అవుతాడు అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. కాలేజీలో లెక్చరర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తే ఇంటర్వ్యూలో ‘బోర్డు మీద రాస్తావా?’అని ప్రశ్నించారు. కంప్యూటర్ జాబ్కెళితే ‘ఆపరేట్ చేయగలవా!’ అన్నారు. తన పరిస్థితికి బాధపడుతూ కూర్చోవడం కాదు, తానే పదిమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలనుకున్నాడు. హైదరాబాద్‌కు పయనమయ్యాడు. ఉదయం లేచింది మొదలు ఇంటర్నెట్ ముందు కూర్చునేవాడు. వ్యక్తిత్వ వికాస పుస్తకాలు బ్రెయిలీ లిపిలో చదివేవాడు. టాకింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాక షాకీర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. ప్రయత్నించేవాడికి నడిసముద్రంలో కూడా ఊతం లభిస్తుందనడానికి షాకీర్ జీవితమే ఒక చక్కని ఉదాహరణ. పుస్తకాన్ని స్కాన్ చేసి, టాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు అటాచ్ చేస్తే చాలు.. అందులో ఉన్న అంశాలన్నీ చక్కగా వినవచ్చు. ఈ సాఫ్ట్వేర్ అతనికి ఎంతో ఉపకరించింది. ‘‘జీవితంలో లేని దాని గురించి బాధపడటం కన్నా, ఉన్నవాటితో ఏం చేయగలమో ఆలోచించగలిగితే ప్రతిదానికీ పరిష్కారం దొరుకుతుంది’’ అంటాడు షాకీర్! సాఫ్ట్వేర్స్కి మోటివేటర్!! జీవితం అంటే ఏంటి? ఏం చేస్తే, ఎంత సాధిస్తే గొప్పవాళ్లమవుతాం..? ఈ తరహాలో ఎప్పుడూ ఆలోచించలేదు షాకీర్! లెక్కలు వేస్తూ, మంచి టైమ్ అదే వస్తుందిలే అని కూర్చోలేదు. నెట్ పాఠాలు వింటూ ఇంగ్లీష్ మీద పట్టు సాధించాడు. ఇంట్లోనే స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాడు. మొదట ఒకరూ ఇద్దరూ వచ్చేవారు. మెల్లగా కాలేజీలకు వెళ్లి గెస్ట్ లెక్చర్ ఇచ్చేవాడు. అక్కడి నుంచి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారాడు. ఆ తర్వాత టాప్ లెవల్ మల్టీనేషనల్ కంపెనీలకు మోటివేటర్‌గా మారాడు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అనడానికి షాకీర్ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు. జీవితంలో చీకటిని మాత్రమే చూసిన షాకీర్ ఎంతోమందిని వెలుగులోకి ఎలా తీసుకురావాలో తెలుసుకున్నాడు. ఎలా మాట్లాడాలి, ఎలా పని విభజన చేయాలి, టీమ్‌ను ఎలా లీడ్ చేయాలి, లీడర్‌గా ఎలా ఎదగాలి.. ఇలా ఎన్నో లక్ష్యాలకు మార్గాలు చూపాడు షాకీర్! ఇప్పుడు ఎన్నో కంపెనీలకు షాకీర్ మోటివేటర్! విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మారిన ప్రయాణం ఇలా అనుకోని మలుపు తిరిగింది. ఐటి, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా సంస్థల్లో ట్రైనింగ్ ప్రారంభించాడు. సొంతంగా ‘ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్’ ప్రారంభించాడు. నిష్ణాతులైన మెమరీ ట్రైనర్స్‌ని కలిశాడు. ‘‘మనకు తెలియంది నేర్చుకుంటూ ఉండాలి. పదిమందికి నేర్పుతూ ఉండాలి’’ అంటాడు. ‘‘జ్ఞానం అందరికీ ఉంటుంది. కాని ఆ జ్ఞానాన్ని లక్ష్యానికి అనుగుణంగా మలుచుకోవాలి. నేను ఏర్పాటుచేసిన ఎంపవర్ని ఒక ఎంపైర్‌గా మార్చాలి. అంత ర్జాతీయ స్థాయిలో పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు కండక్ట్ చేయాలన్నవి నా లక్ష్యాలు. సమస్య ఉందని ఆగిపోకూడదు. సమస్యను సైతం సవాల్‌గా తీసుకునే ధైర్యాన్ని పెంచుకోవాలి. అందరూ ఎంప్లాయ్ కావాలనుకుంటే ఎంప్లాయర్ ఎవరు అవుతారు? ఈ విధంగా ఆలోచించగలిగితే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది’’ అంటాడు ఉద్వేగంగా షాకీర్! షాకీర్ వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా క్లాస్‌లు తీసుకోవడమే కాదు పుస్తకాలూ రాస్తుంటాడు. తన కాళ్ల మీద తను నిలబడ్డాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పడమే కాదు అమ్మాయి ఇష్టాన్నీ కనుక్కున్నాడు. ఇప్పుడు షాకీర్‌కు పెళ్లయి నాలుగు నెలలు అవుతోంది. షాకీర్ ఇంటర్మీడియెట్ నుంచే ఖురాన్ని బ్రెయిలీ లిపిలో రాయడం మొదలుపెట్టాడు. రోజులో పది గంటల సమయాన్ని దీనికోసమే కేటాయించేవాడు. అలా ఖురాన్‌లోని 60 భాగాలు బ్రెయిలీ లిపిలో రాశాడు. దీంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదైంది. ఈ సందర్భంగా నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ని కలిసినప్పుడు ‘‘సముద్రంలో ఓడలకు దారి చూపే లైట్ హౌజ్ లాంటి వాడివి నువ్వు. నీలాంటి వాళ్లే ఈ దేశానికి అవసరం’’ అని అభినందించారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. అన్నీ ఉన్నా కష్టాల సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాం అని భావించే ఎంతో మందికి... షాకీర్ లాంటి వ్యక్తుల శ్రమ, తపనలే ఆదర్శం. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఆత్మవిశ్వాసం పెంచారు మాది వైజాగ్! మా కాలేజీలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వర్క్‌షాప్ నిర్వహించారు. అందులో షాకీర్సార్ చెప్పిన విషయాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. చదువు పూర్తి కాగానే శిక్షణ కోసం షాకీర్ సార్ దగ్గర చేరాను. ఇప్పుడు నాలో ఏ పని అయినా చేయగలను అనే కాన్ఫిడెన్స్ పెరిగింది. త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నాను. - భార్గవ్, షాకీర్ స్టూడెంట్ నా అదృష్టం మాది చిత్తూరు. పదోతరగతి వరకు చదువుకున్నాను. మా పెద్దలు ఈ సంబంధం తీసుకువచ్చినప్పుడు కొంచెం తటపటాయించిన మాట నిజం. ఈయన ఆశయాలు విన్నాక నాకు అద్భుతం అనిపించింది. ఆ ఆశయాలకు సపోర్ట్‌గా నిలిచే అదృష్టాన్ని ఆ భగవంతుడే ఇచ్చాడని భావించాను. - షబానా, షాకీర్ భార్య నిరంతర శ్రమ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలను ఇంటర్నెట్ ద్వారా చదువుతూ, వింటూ అందులోని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదు వందలకు పైగా క్లాసులు తీసుకున్నాను. నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను. - షాకీర్ -
అంధుల కోసం స్పెషల్ మెనూ!
‘బ్రెయిలీ లిపి’ అంధులకు లూయీ బ్రెయిలీ అందించిన అద్భుత సదుపాయం. దీన్ని ఆధారం చేసుకుని అనేక విషయాల్లో అంధులకు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో... బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలోని ‘ఓమ్’ అనే రెస్టారెంట్ అంధుల కోసం ప్రత్యేకంగా మెనూ కార్డ్‌ను తయారుచేసింది. రుచిగా, శుచిగా ఆహారాన్ని అందిస్తుందనే పేరున్న ఈ వెజిటేరియన్ రెస్టారెంట్ మెనూకార్డ్ను బ్రెయిలీ లిపిలో ప్రింట్ చేసి అందుబాటులో ఉంచింది. దీర్ఘ దృష్టి సమస్య ఉన్న వారి కోసం కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ఉండే ఈ మెనూ కార్డ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ వారు అంధులకు ఈ సౌకర్యం తీసుకురావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఓమ్ రెస్టారెంట్‌కు పక్కగా ఒక ఎన్జీవో ఆఫీస్ ఉంటుంది. విజువల్లీ చాలెంజ్డ్ పర్సన్స్ కోసం పనిచేసే ఆ సంస్థ కార్యాలయానికి చాలామంది అంధులు వస్తుంటారు. పని మీద ఆ ఎన్జీవో ఆఫీస్‌కు వచ్చి, తినడానికి వచ్చే వారి కోసం రెస్టారెంట్ ఓనర్లు ఈ అవకాశాన్ని కల్పించారు. తమకు కావలసిన ఆహారం గురించి చదువుకొని.. ఆర్డర్ చేసేంత కాన్ఫిడెన్స్‌ను ఇస్తోంది రెస్టారెంట్. ఈ ఏడాది ఉగాది నుంచే ఈ మెనూ కార్డ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే తాము చేసిన పనికి ప్రచారం వస్తోందని, అనేక మంది రెస్టారెంట్ ఓనర్లు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఓమ్ రెస్టారెంట్ ఓనర్లు తెలిపారు.