చూపు ఉండీ... చూడలేకపోయారు!
నేడు వరల్డ్ బ్రెయిలీ డే
అంధుల కోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టిన విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ. 1809 జనవరి 4న ఆయన ఫ్రాన్స్‌లో జన్మించారు. మూడేళ్ల వయసులో చూపు కోల్పోయారు. పదిహేనేళ్ల వయసులో... తన లాంటి అంధుల కోసం చదవడానికి, రాయడానికి ప్రత్యేక లిపిని కనిపెట్టారు. తన తర్వాతి తరాల అంధులకు దిక్చూచి అయ్యారు. అందుకే ఏటా ప్రపంచం ఆయన జన్మదినాన్ని ‘బ్రెయిలీ డే’గా జరుపుకుంటోంది. మనం మాత్రం ఇవాళ... చూపు ఉండీ చూడలేకపోయిన కొందరి గురించి చెప్పుకుందాం.
‘అబ్బే’ అని పెదవి విరిచారు!
మొదట హ్యారీ పోట్టర్ నవలను 12 మంది పబ్లిషర్లు తిరస్కరించారు. స్క్రిప్టు చదవడం, బాగోలేదని వెనక్కి ఇచ్చేయడం! చివరికి బ్లూమ్స్‌బరీ ప్రచురణ సంస్థ ముందుకు వచ్చింది. అది కూడా ఆ ప్రచురణ కర్త ఎనిమిదేళ్ల కూతురు ఏలిస్‌కు నచ్చబట్టి అది పుస్తకంగా వచ్చింది. తర్వాతి సంగతి మీకు తెలిసిందే. హ్యారీ పోట్టర్ ఏడు నవలలు, ఎనిమిది సినిమాలుగా వర్థిల్లింది. నవల 60 భాషల్లోకి తర్జుమా అయింది. రచయిత్రి జె.కె.రోలింగ్‌కు 100 కోట్ల డాలర్లకు పైగా సంపాదించి పెట్టింది.
హిట్లర్ కనిపిస్తే వదిలేశాడు!
ఈ ఫొటోలో ఉన్నది 1914 నాటి బ్రిటన్ సైనికుడు హెన్రీ టాండే. మొదటి ప్రపంచ యుద్ధంలో చురుగ్గా పాల్గొన్నాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అప్పటికి జర్మనీ సైన్యంలో సాధారణ సైనికుడు మాత్రమే. బ్రిటన్, జర్మనీల మధ్య యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో హెన్రీ టాండేకి అనుకోకుండా ఓ సొరంగంలో హిట్లర్ కనిపించాడు. చేతిలో ఆయుధం లేకుండా, గాయాలతో పడి ఉన్న హిట్లర్‌ను కాల్చి పారేయబోయిన హెన్రీ.. ఓ క్షణం ఆలోచించి, అది యుద్ధ ధర్మం కాదని తలచి హిట్లర్‌ను వదిలేశాడు. ఆ రోజు కనుక హెన్రీ టాండే.. హిట్లర్‌పై దయ చూపకుండా ఉండి ఉంటే, రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సాగించిన నరమేధానికి 60 లక్షలమంది యూదులు బలై ఉండేవారు కాదేమో!
సిరి వస్తుంటే వర్రీ అయ్యాడు!
గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ 1999లో ఎగ్జయిట్ కంపెనీ సిఈవో జార్జి బెల్‌ను కలిసి ‘మా కంపెనీని 10 లక్షల డాలర్లకు చవగ్గా అమ్మేస్తాం కొంటారా?’ అని ఆఫర్ ఇచ్చారు. జార్జి బెల్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. వెనక్కొచ్చి మళ్లీ వెళ్లారు ఆ ఇద్దరు స్నేహితులు. ‘పోనీ ఓ పావు తగ్గించుకుని 7 లక్షల 50 వేల డాలర్లు ఇవ్వండి’ అని బేరం పెట్టారు. జార్జి బెల్ విసుగ్గా చూశాడు. ‘అబ్బే అంతకూడా ఎక్కువే’ అనేశాడు. ‘సరే, మీరు చెప్పండి.. ఎంతకు కావాలో’ అని అడిగారు లారీ, సెర్గీ. ‘ఎంతకు ఇచ్చినా వద్దు’ అనేశాడు జార్జి బెల్. దాంతో.. కష్టమో, నష్టమో గూగుల్‌ని తామే ఉంచుకుందా మని డిసైడ్ అయిపోయారు ఇద్దరు మిత్రులు. ఇప్పుడు గూగుల్ వాల్యూ ఎంతో తెలుసా? ఊపిరి బిగబిట్టి చదవండి. 36,500 కోట్ల డాలర్లు!
అటుదిటు, ఇటుదటు అయింది!
2005లో ‘మిజోహో సెక్యూరిటీస్’ ప్రతినిధి తమ షేర్‌లలో ఒక షేర్‌ను ఆన్‌లైన్‌లో 6,10,000 ఎన్‌లకు అమ్మబోయి, పొరపాటున రాంగ్ కీ టైప్ చేయడంతో 6,10,000 వేల షేర్లు 1 ఎన్ ధర చొప్పున ట్రేడ్ అయ్యాయి! వెంటనే తన తప్పును తెలుసుకుని ‘తూచ్’ అని మొత్తుకున్నా టోక్యో స్టాక్ ఎక్ఛేంజి ఒప్పుకోలేదు. ట్రేడు ట్రేడే అని తెగేసి చెప్పేసింది. దాంతో ఆ కంపెనీ తన షేర్‌లను తనే ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవలసి వచ్చింది.
హాయ్ అంటే పోవోయ్ అన్నాడు!
13వ శతాబ్దంలో.. మంగోలు చక్రవర్తి ఛంగిజ్‌ఖాన్, తన పొరుగున ఉన్న ఖ్వారెజ్మిద్ (నేటి ఇరాన్, ఇరాక్) చక్రవర్తి అల్లా ఉద్దీన్ మహ్మద్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడం కోసం, తన తరఫున ఒక దూతను పంపించాడు. అల్లా ఉద్దీన్ ఆ దూత తల నరికి, ఛంగిజ్‌ఖాన్ స్నేహహస్తాన్ని తిరస్కరించాడు. దాంతో తీవ్రంగా కోపోద్రిక్తుడైన చంగిజ్‌ఖాన్ రెండు లక్షల మంది యోధులను పంపించి ఖ్వారెజ్మిత్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయించాడు.
ప్లాట్‌ఫారంలో ఇరుక్కుపోయాయి!
2014లో ఫ్రెంచి రైల్వే ఎస్.ఎన్.సి.ఎఫ్.. రెండువేల కొత్త రైలుబండ్ల నిర్మాణం కోసం 1500 కోట్ల డాలర్లను ఖర్చుపెట్టింది. అయితే దేశంలో ఉన్న 1300 రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల నిడివి... ఆ కొత్త డిజైన్‌తో తయారైన రైళ్ల వెడల్పుకు అనుగుణంగా లేకపోవడంతో ఆ పొరపాటును సరిద్దికోడానికి ఫ్రాన్స్ రైల్వే సంస్థ 5 కోట్ల డాలర్లకు పైగా ఖర్చుపెట్టి ప్లాట్‌ఫారమ్‌లను వెడల్పు చేయించవలసి వచ్చింది.