అంధురాలైన రేషమ్ తల్వార్ తన భవిష్యత్తు బాగుండాలంటే బ్రెయిలీ నేర్చుకోక తప్పదని తొమ్మిదేళ్ల వయసులోనే గ్రహించింది. బ్రెయిలీలోనే ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఇగ్నోలో పి.జి చేసింది. ఆ చదువు ఆమెకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేడు సక్సెస్‌ఫుల్ రేడియో జాకీగా ఆమెకు ఉపాధిని ఇస్తోంది. చెన్నైకి చెందిన అంధురాలు బెనో జెఫైన్ బ్రెయిలీలో దొరికే మెటిరియల్‌లో ఐ.ఏ.ఎస్‌కు ప్రిపేర్ అయ్యి ఐ.ఎఫ్.ఎస్ సాధించిన తొలి అంధ మహిళగా రికార్డు స్థాపించింది. స్త్రీలు అంధులైతే కుటుంబాలు వారిని ఇంట కూచోబెడతాయి. కాని బ్రెయిలీ అనే అలీబాబా దీనిన్ని రుద్ది వారు అద్భుత విజయాలు సాధిస్తూనే ఉన్నారు. చీకటి తమ వెలుతురుకు అడ్డు కాదంటున్నారు.
మన దేశంలో కోటీ యాభై లక్షల మంది పాక్షిక/పూర్తి అంధులు ఉన్నారు. వారిలో 2 లక్షల మంది చిన్నారులు. భారత్ వంటి వెనుకబడిన దేశాలలో అంధుల శాతం ఎక్కువ. దీనికి కారణం గర్భధారణ సమయంలో సరైన పరీక్షలు చేయించకపోవడం, పుట్టిన వెంటనే కంటి సమస్యలను గుర్తించకపోవడం, జన్మించాక వచ్చే ఐ ఇన్ఫెక్షన్స్‌కు సరైన చికిత్స చేయించకపోవడం, పిల్లల్లో వచ్చే హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి వంటి సమస్యలకు కూడా అద్దాల వంటి సహాయక పరికరాలను ఉపయోగించకపోవడం. అంధులుగా జన్మించడం అంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొనడం. అబ్బాయిలు అంధులుగా పుడితే కుటుంబం ఏదో ఒక మేరకు వారికి తర్ఫీదు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాని అమ్మాయి అంధురాలైతే చాలామటుకు నిరుత్సాహమే ఎదురవుతుంది.
అంధుల అక్షరాస్యత
కళ్లున్న వాళ్లకు అక్షరాస్యత ఉన్నట్టే అంధులకు కూడా అక్షరాస్యత ఉంటుంది. మన దేశంలో అంధుల అక్షరాస్యత కేవలం ఒక శాతం. బ్రిటన్‌లో ఇది 4 శాతం ఉంది. అంధుల అక్షరాస్యత అంటే బ్రెయిలీని చదవడం రాయడం రావడమే. లూయిస్ బ్రెయిలీ అనే ఫ్రెంచ్ అంధ విద్యావేత్త రూపకల్పన చేసిన బ్రెయిలీ కోడ్ పుట్టి 200 ఏళ్లు అయినా 70 ఏళ్ల క్రితమే భారతీయ భాషల కోసం ఉమ్మడి ‘భారతీ బ్రెయిలీ’ని మనం తయారు చేసుకున్నా నేటికీ బ్రెయిలీ అంధ విద్యార్థులకు అందని ఫలంగానే ఉంది.
సంప్రదాయ బ్లైండ్ స్కూళ్లు, కాలేజీలలో బ్రెయిలీ నేర్పిస్తున్నా సమ్మిళితంగా (ఇన్‌క్లూజివ్) మామూలు పిల్లలతో కలిసి చదువుకోవాలనుకునే పిల్లలకు బ్రెయిలీ అందడం లేదు. దీనికి కారణం తగినంత మంది స్పెషల్ టీచర్లు లేకపోవడం, విద్యార్థులు ఎక్కువగా ఆడియో పాఠాల మీద ఆధారపడటం. కాని ఆడియో పాఠాలు విని సహాయకునితో పరీక్ష రాసి పాసైనప్పటికీ బ్రెయిలీ చదవడం, సొంతగా రాయడం రాక΄ోతే వారు నిరక్షరాస్యులు అవుతారు. తాముగా చదవగలం, రాయగలం అనే భావనే ఆత్మవిశ్వాసం ఇవ్వగలదు.
ప్రతికూలతలను దాటి
ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా అంధత్వాన్ని జయించి ముందుకు సాగిన స్త్రీలు స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నారు. చెన్నైకి చెందిన బెనో జెఫైన్ పుట్టుకతో అంధురాలైనా బ్రెయిలీలో చదువుకుంది. ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బ్యాంక్ ఆఫీసర్ అయ్యింది. అయినప్పటికీ ఇంకా సాధించాలనే ఉద్దేశంలో ఉద్యోగం చేస్తూనే బ్రెయిలీలో దొరికిన మెటీరియల్ చదివి 2015లో ఐ.ఏ.ఎస్ పరీక్షలు రాస్తే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యింది. ఇప్పటివరకు ఐ.ఎఫ్.ఎస్‌లో అంధులకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ మేరకు బెనో చరిత్ర సృష్టించింది.
ఇప్పుడామె ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. వివాహం చేసుకుని భర్త, కుమార్తెతో ముందుకు సాగుతోంది. బ్రెయిలీ భాష మాత్రమే ఆమెను ఇక్కడి వరకూ చేర్చింది. అలాగే ఢిల్లీకి చెందిన పాతికేళ్ల రేషమ్ తల్వార్ అక్కడి రేడియో ఉడాన్‌లో జాకీగా పని చేస్తోంది. పూర్తి అంధురాలైన రేషమ్‌ను తల్లిదండ్రులు అలాగే వదిలేయ దలచుకోలేదు. మామూలు విద్యార్థులతో΄ాటు కలిసి చదివేలా చేశారు. బ్రెయిలీలో స్కూలు పాఠాలు చదివించడంలో శ్రద్ధ చూపారు. రేషమ్ ఆగలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌గా నిలిచింది. అంతేకాదు, ఆ ఆత్మవిశ్వాసంతో రేడియో జాకీగా చేరింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టు గా పని చేస్తోంది.
నిపుణుల సూచన
ఇవాళ అంధ విద్యార్థులకు సాయపడే యాప్స్ (టెక్ట్స్‌బుక్స్‌ను ఆడియోగా మారుస్తాయి) ఉన్నప్పటికీ బ్రెయిలీలో చదవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పాఠ్యపుస్తకాలే కాదు సాహిత్యం, కథలు, పురాణాలు, గ్రంథాలు... ఏవి బ్రెయిలీలో అందుబాటులో ఉంటే అవన్నీ చదవడం వల్ల మాత్రమే అంధులకు తమ మీద తమకు విశ్వాసం ఏర్పడుతుందని సలహా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు, ముఖ్యంగా అంధ విద్యార్థినులు బ్రెయిలీ భాషను నేర్చుకోవడం గురించి, ఆ విషయంలో వారు ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి విద్యాశాఖ దృష్టిపెట్టడం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment