Voice Over artists
-
Tamara Dsouza: లవ్ తమారా
తమారా డిసూజా గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పలేం! ఆమె.. ప్రతిభా గని! యాక్ట్రెస్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, గాయని, ఉకులెలె ప్లేయర్ కూడా!ఆ గుర్తింపు తమారా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దాంతో నటననే ఫుల్‌టైమ్ జాబ్‌గా ఎంచుకుంది. ఆమె తాజా చిత్రం ‘లవ్ సితారా’ జీ5లో స్ట్రీమ్ అవుతోంది.తమారా తన నటనతోనే కాదు గాత్రంతోనూ ఆకట్టుకుంటోంది. ప్రీతమ్, షాన్, నీతీ మోహన్, ఏఆర్ రెహమాన్ లాంటి మహామహులతో కలసి పాడుతోంది. నటన, సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్లతో క్షణం తీరికలేని షెడ్యూల్స్‌లో ఎప్పుడన్నా సమయం చిక్కితే సోలో ట్రావెల్‌కి వెళ్లిపోతూ, ఉకులెలె ప్లే చేస్తూ ఆస్వాదిస్తోంది.తమారా .. ముంబైలో పుట్టి, పెరిగింది. కామర్స్ అండ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పుచ్చుకుంది.చదువైపోగానే ‘రెయిన్ డ్రాప్ మీడియా’ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయింది. విద్యా బాలన్, శ్రుతి హాసన్, ఫరా ఖాన్, బొమన్ ఇరానీ లాంటి యాక్టర్స్ కోసం పనిచేసింది. అంతేకాదు రేస్ 2, వికీ డోనర్, హౌస్‌ఫుల్ 2 లాంటి సినిమాలకు పీఆర్ ఈవెంట్స్‌నూ నిర్వహించింది.ఏడాది తర్వాత ఆమె ఖీఐ్క ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో చేరింది.. మార్కెటింగ్, ప్రమోషన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా. ఆమె పనితీరుకు ముచ్చటపడిన వైకింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. సద్వినియోగం చేసుకుంది తమారా. ఇందులో ఉన్నప్పుడే ఆమె చురుకుదనం, సమయస్ఫూర్తికి మెచ్చి పలు యాడ్ ఏజెన్సీలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసే చాన్స్నిచ్చాయి. అలా తమారా.. తనిష్క్, టైటాన్, డ్యూరోఫ్లెక్స్ వంటి ఫేమస్ బ్రాండ్స్ కమర్షియల్ యాడ్స్‌లో కనిపించింది.ఆ కమర్షియల్ యాడ్సే తమారా వెబ్‌స్క్రీన్ ఎంట్రీని ఖరారు చేశాయి. మేడిన్ హెవెన్, లిటిల్ థింగ్స్, హెలో మినీ లాంటి వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాన్నిచ్చాయి. ఆమె నటనకు సిల్వర్‌స్క్రీన్ కూడా స్పేస్ ఇచ్చింది. ‘క్లాస్ ఆఫ్ 83’ , ‘అటాక్’ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు పొందింది.యాడ్స్, వెబ్, సినిమా.. ఈ మూడిట్లో నటించే అవకాశం.. నాకు యాదృచ్ఛికంగా అందిన వరమని చెప్పుకోవచ్చు! సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్ వగైరా వగైరా.. నేను ఇష్టపడి, నేర్చుకుని ఆ దిశగా ప్రయత్నిస్తే సాధించినవి. కానీ నటన విషయం అలాకాదు. నటిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. కంటిన్యూ అవుతోంది. – తమారా డిసూజా -
ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనంతరాం కన్నుమూత
ప్రముఖ తెలుగు డబ్బింగ్ , వాయిస్ ఆర్టిస్ట్ అత్తిలి అనంతరాం శనివారం అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. అడ్వర్టైంజింగ్ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా సేవలందించిన అనంతరాం కొన్ని వందల యాడ్స్‌కు, కార్పోరేట్ ఫిల్మ్స్‌కు వాయిస్ ఇవ్వడంతో పాటు స్క్రిప్ట్ కూడా అందించారు. అమితాబ్, సచిన్,మహేశ్‌బాబు వంటి బిగ్ సెలబ్రెటీలతో పాటు అనేక బాలీవుడ్ స్టార్ల ప్రకటనలకు వాయిస్ అందించారు. 2012లో జరిగిన IPL మ్యాచ్‌కి సంబంధించిన పాటను తెలుగులో రాయడమే కాకుండా స్వయంగా తానే పాట పాడటం మరో విశేషం. నేషనల్, ఇంటర్నేషనల్ యాడ్ ఏజన్సీలన్నీ ఎక్కువశాతం ముంబయ్‌లో ఉంటాయి. అక్కడ తెలుగు వాయిస్‌లకు, రైటింగ్స్కు మంచి డిమాండ్. దీంతో స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబయ్ చేరుకుని 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉంటున్నారు. తెలుగుపై అత్యంత మక్కువ కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లో తెలుగుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా తరచూ హాజరవుతూ ఉండేవారు. తెలుగు అడ్వర్టైజింగ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అత్తిలి అనంతరాం దూరం కావడం తమకు తీరని లోటని పలు యాడ్ సంస్థలు తమ సంతాపాన్ని తెలిపాయి. -
ఆపిల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?
స్మార్ట్‌ఫోన్‌లా పుణ్యమా అని మనం ఎక్కడికైనా వెళ్లాలన్నా..లేదా దారి తెలియకపోయినా ఏ మాత్రం భయం లేకుండా హాయిగా వెళ్లిపోతున్నాం. జస్ట్ అలా ఫోన్లో మ్యాప్ ఓపెన్ చేసి చెవిలో అలా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని..అందులో జీపీఎస్ ఆన్ చేసి..టెక్స్ట్ వాయిస్‌తో ఇచ్చే డైరెక్షన్‌ని బేస్ చేసుకోవడంతో.. జర్నీ ఈజీ అయిపోయింది. కానీ ఎప్పుడైనా ఆలోచించామా ఆ వాయిస్ ఎవ్వరిది? ఏ మహిళ మాట్లాడుతుంది అని. ప్రపంచం నలుమూలల ఆమె వాయిస్ అందరికీ సుపరిచితమే. ఇంతకి ఆమె ఎవరంటే.. ఆమె పేరు కరెనా జాకబ్సెన్. ఆస్ట్రేలియన్ మహిళ. స్మార్ట్ ఫోన్లో ఉండే జీపీఎస్ ఫీచర్లో ఉండే సిరి అనే వర్చువల్ వాయిస్‌కి స్వరాన్ని అందించిందే కరెనా. ఇంతకీ ఆమె 'జీపీఎస్ గర్ల్'గా ఎలా మారింది. ఆమె నేపథ్యం ఏమిటి? అంటే..కరెనా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మాకేలో జన్మించింది. ఏడు సంవత్సరాల వయసులో పాటలు రాయడం, పాడడం వంటివి చేసింది. ఆమె ఆస్ట్రేలియాలో ప్రముఖ సింగర్ అయిన ఒలివియా న్యూటన్-జాన్లా అవ్వలనేది కరెన్ డ్రీమ్. అందుకోసం అని సూట్‌కేస్ చేత పట్టుకుని న్యూయార్క్ వచ్చేసింది. తాను అనుకున్నట్టుగానే ఎన్నో పాటలు రాసింది, పాడింది. ఇలా ఎన్నో ఆల్బమ్‌లు రిలీజ్ చేసి కెరియర్ మంచి ఊపులో ఏ చీకుచింత లేకుండా సాగిపోతోంది. అంతేగాదు ఆమె పాటలు యూఎస్ నెట్వర్క్స్ టెలివజన్ లైసెన్స్ పొందడం విశేషం. ఎన్నో ప్రముఖ థియోటర్లో ప్రదర్శించబడ్డాయి. మాకే టు మాన్హాటన్ వరకు కరెన్ తన సంగీతంతో ప్రజలను అలరించింది. జీపీఎస్ గర్ల్‌గా టర్నింగ్.. నూయార్క్‌లో ఒక రోజు కరెన్ టెక్స్ట్ టు స్పీచ్ వాయిస్ సిస్టమ్‌ను రికార్డ్ చేయడానికి ఆడిషన్‌కి వెళ్లింది. అది తన వాయిస్‌ని ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకువెళ్తుందని ఊహించలేదు. ఆ ఒక్కసారి ఇచ్చిన వాయిస్ ఓవర్ కాస్త జీపీఎస్ గర్ల్‌గా బ్రాండ్ నేమ్‌ను తెప్పించింది. ఇక వెనుదిరిగి చూసుకోకుండా అన్ని రకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టేలా చేసింది ఆమె గాత్రం. ఒకరకంగా ఆమెను ఇంటర్నేషనల్ స్పీకర్ మార్చింది. ఆమె గాత్రం ఎన్నో యూనివర్సిటీలో టెడ్ఎక్స్ స్పీకర్‌గా ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రావెల్, రియల్ ఎస్టేట్‌తో సహా ఎన్నో బహుళ పరిశ్రమలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన స్వరాన్ని అందించింది. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్స్ ఎన్బీసీ టుడే షో, ఏబీసీ వరల్డ్ న్యూస్ టునైట్, సీబీఎస్ ఎర్లీ సో, సన్‌రైజ్, ఎన్వై డైలీ న్యూస్, ది గార్డియన్, గ్లామర్ మ్యాగజైన్, పీపుల్ మ్యాగజైన్ తదితర ఛానెల్స్ ఆమెను శక్తిమంతమైన మహిళగా కీర్తించాయి. కస్టమైజ్డ్ వాయిస్ సిస్టమ్స్‌లో, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్లలో కరెన్ వాయిస్ ఓవర్‌కి ఎంతో డిమాండ్ ఉంది. ఓ పాప్ సింగర్‌గా ఎన్నో అవార్డులు, రివార్డులతో ప్రభంజనం సృష్టించి కెరియర్ మంచి పీక్‌లో దూసుకుపోతుందనంగా చేసిన టెక్స్ట్ టు స్పీచ్ మరో సెలబ్రేటీ స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. ఆమె స్వరం ఓ వరంలా మారి ఆమెకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. (చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!) -
మునివేళ్లపై భవిష్యత్తు
అంధురాలైన రేషమ్ తల్వార్ తన భవిష్యత్తు బాగుండాలంటే బ్రెయిలీ నేర్చుకోక తప్పదని తొమ్మిదేళ్ల వయసులోనే గ్రహించింది. బ్రెయిలీలోనే ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఇగ్నోలో పి.జి చేసింది. ఆ చదువు ఆమెకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నేడు సక్సెస్ఫుల్ రేడియో జాకీగా ఆమెకు ఉపాధిని ఇస్తోంది. చెన్నైకి చెందిన అంధురాలు బెనో జెఫైన్ బ్రెయిలీలో దొరికే మెటిరియల్లో ఐ.ఏ.ఎస్‌కు ప్రిపేర్ అయ్యి ఐ.ఎఫ్.ఎస్ సాధించిన తొలి అంధ మహిళగా రికార్డు స్థాపించింది. స్త్రీలు అంధులైతే కుటుంబాలు వారిని ఇంట కూచోబెడతాయి. కాని బ్రెయిలీ అనే అలీబాబా దీనిన్ని రుద్ది వారు అద్భుత విజయాలు సాధిస్తూనే ఉన్నారు. చీకటి తమ వెలుతురుకు అడ్డు కాదంటున్నారు. మన దేశంలో కోటీ యాభై లక్షల మంది పాక్షిక/పూర్తి అంధులు ఉన్నారు. వారిలో 2 లక్షల మంది చిన్నారులు. భారత్ వంటి వెనుకబడిన దేశాలలో అంధుల శాతం ఎక్కువ. దీనికి కారణం గర్భధారణ సమయంలో సరైన పరీక్షలు చేయించకపోవడం, పుట్టిన వెంటనే కంటి సమస్యలను గుర్తించకపోవడం, జన్మించాక వచ్చే ఐ ఇన్ఫెక్షన్స్కు సరైన చికిత్స చేయించకపోవడం, పిల్లల్లో వచ్చే హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి వంటి సమస్యలకు కూడా అద్దాల వంటి సహాయక పరికరాలను ఉపయోగించకపోవడం. అంధులుగా జన్మించడం అంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొనడం. అబ్బాయిలు అంధులుగా పుడితే కుటుంబం ఏదో ఒక మేరకు వారికి తర్ఫీదు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాని అమ్మాయి అంధురాలైతే చాలామటుకు నిరుత్సాహమే ఎదురవుతుంది. అంధుల అక్షరాస్యత కళ్లున్న వాళ్లకు అక్షరాస్యత ఉన్నట్టే అంధులకు కూడా అక్షరాస్యత ఉంటుంది. మన దేశంలో అంధుల అక్షరాస్యత కేవలం ఒక శాతం. బ్రిటన్‌లో ఇది 4 శాతం ఉంది. అంధుల అక్షరాస్యత అంటే బ్రెయిలీని చదవడం రాయడం రావడమే. లూయిస్ బ్రెయిలీ అనే ఫ్రెంచ్ అంధ విద్యావేత్త రూపకల్పన చేసిన బ్రెయిలీ కోడ్ పుట్టి 200 ఏళ్లు అయినా 70 ఏళ్ల క్రితమే భారతీయ భాషల కోసం ఉమ్మడి ‘భారతీ బ్రెయిలీ’ని మనం తయారు చేసుకున్నా నేటికీ బ్రెయిలీ అంధ విద్యార్థులకు అందని ఫలంగానే ఉంది. సంప్రదాయ బ్లైండ్ స్కూళ్లు, కాలేజీలలో బ్రెయిలీ నేర్పిస్తున్నా సమ్మిళితంగా (ఇన్‌క్లూజివ్) మామూలు పిల్లలతో కలిసి చదువుకోవాలనుకునే పిల్లలకు బ్రెయిలీ అందడం లేదు. దీనికి కారణం తగినంత మంది స్పెషల్ టీచర్లు లేకపోవడం, విద్యార్థులు ఎక్కువగా ఆడియో పాఠాల మీద ఆధారపడటం. కాని ఆడియో పాఠాలు విని సహాయకునితో పరీక్ష రాసి పాసైనప్పటికీ బ్రెయిలీ చదవడం, సొంతగా రాయడం రాక΄ోతే వారు నిరక్షరాస్యులు అవుతారు. తాముగా చదవగలం, రాయగలం అనే భావనే ఆత్మవిశ్వాసం ఇవ్వగలదు. ప్రతికూలతలను దాటి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా అంధత్వాన్ని జయించి ముందుకు సాగిన స్త్రీలు స్ఫూర్తిమంతంగా నిలుస్తున్నారు. చెన్నైకి చెందిన బెనో జెఫైన్ పుట్టుకతో అంధురాలైనా బ్రెయిలీలో చదువుకుంది. ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి బ్యాంక్ ఆఫీసర్ అయ్యింది. అయినప్పటికీ ఇంకా సాధించాలనే ఉద్దేశంలో ఉద్యోగం చేస్తూనే బ్రెయిలీలో దొరికిన మెటీరియల్ చదివి 2015లో ఐ.ఏ.ఎస్ పరీక్షలు రాస్తే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యింది. ఇప్పటివరకు ఐ.ఎఫ్.ఎస్‌లో అంధులకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ మేరకు బెనో చరిత్ర సృష్టించింది. ఇప్పుడామె ఢిల్లీ కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. వివాహం చేసుకుని భర్త, కుమార్తెతో ముందుకు సాగుతోంది. బ్రెయిలీ భాష మాత్రమే ఆమెను ఇక్కడి వరకూ చేర్చింది. అలాగే ఢిల్లీకి చెందిన పాతికేళ్ల రేషమ్ తల్వార్ అక్కడి రేడియో ఉడాన్‌లో జాకీగా పని చేస్తోంది. పూర్తి అంధురాలైన రేషమ్‌ను తల్లిదండ్రులు అలాగే వదిలేయ దలచుకోలేదు. మామూలు విద్యార్థులతో΄ాటు కలిసి చదివేలా చేశారు. బ్రెయిలీలో స్కూలు పాఠాలు చదివించడంలో శ్రద్ధ చూపారు. రేషమ్ ఆగలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌గా నిలిచింది. అంతేకాదు, ఆ ఆత్మవిశ్వాసంతో రేడియో జాకీగా చేరింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టు గా పని చేస్తోంది. నిపుణుల సూచన ఇవాళ అంధ విద్యార్థులకు సాయపడే యాప్స్ (టెక్ట్స్‌బుక్స్‌ను ఆడియోగా మారుస్తాయి) ఉన్నప్పటికీ బ్రెయిలీలో చదవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పాఠ్యపుస్తకాలే కాదు సాహిత్యం, కథలు, పురాణాలు, గ్రంథాలు... ఏవి బ్రెయిలీలో అందుబాటులో ఉంటే అవన్నీ చదవడం వల్ల మాత్రమే అంధులకు తమ మీద తమకు విశ్వాసం ఏర్పడుతుందని సలహా ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులు, ముఖ్యంగా అంధ విద్యార్థినులు బ్రెయిలీ భాషను నేర్చుకోవడం గురించి, ఆ విషయంలో వారు ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి విద్యాశాఖ దృష్టిపెట్టడం అవసరం. -
చూపు లేకపోతేనేం! చక్కని స్వరాలతో.. అవకాశాలు అందిపుచ్చుకొని..
వైకల్యాన్ని సాకుగా చూపి ఏమీ చేయకుండా కూర్చునే వారు కొందరైతే... ‘‘వైకల్యం ఉంటే ఏం? జీవితంలో వైకల్యం దగ్గరే ఆగిపోతామా? సాకల్యంగా ముందుకు సాగాలి’’ అంటూ మనోధైర్యంతో వివిధ రంగాల్లో రాణించేవారి జాబితా చెప్పకనే చెబుతుంది. ఈ జాబితాలో ఉన్న రేషమ్ తల్వార్... పుట్టుకతో చూపు లేకపోయినప్పటికీ 25 ఏళ్ల వయసులో గాయనిగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూ అబ్బురపరుస్తోంది. దిల్లీలో ఓ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టింది రేషమ్ తల్వార్. పుట్టగానే కళ్లు తెరిచి చూస్తే తనకు ఏమీ కనిపించలేదు. కళ్లు తెరిచినా..మూసినా అంతా చీకటే. తన చుట్టూ ఉన్న వాటిని చూడలేదు. అయినా ఏమాత్రం నిరాశపడలేదు. వస్తువులను తాకడం ద్వారా అవేంటో తెలుసుకోవడం ప్రారంభించింది. అలా రంగులు, భావోద్వేగాలను పసిగట్టగలిగింది. రేషమ్ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు చిన్నప్పుడే బ్లైండ్ అసోసియేషన్‌లో చే ర్పించి బ్రెయిలీ నేర్పించారు. బ్రెయిలీ నేర్చుకుని సాధారణ పాఠశాలలో రెండో తరగతిలో చేరింది. పదోతరగతి లో మంచి ప్రతిభను కనబరిచి సీబీఎస్సీ నుంచి ఇందిరా అవార్డును కూడా అందుకుంది. అలా చదువుకుంటూ డిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ, ఇగ్నోలో పీజీ పూర్తిచేసింది. అమ్మపాటలు వింటూ.. నాన్న మంచి మ్యూజీషియన్, అమ్మ మంచి గాయని కావడంతో ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉండేది. వివిధరాగాలు వింటూ నిద్రలేచే రేషమ్ చిన్నప్పుడు అమ్మ పాడే పాటలను చాలా ఆసక్తిగా ఆలకించేది. అమ్మతో పాటు హార్మోనియం వాయిస్తూ తను కూడా పాడడానికి ప్రయత్నించేది. సంగీతంపై ఉన్న మక్కువను ప్రోత్సహించేందుకు తొమ్మిదేళ్ల వయసులో రేషమ్‌ను తన తల్లి సంగీతం నేర్పించే మాష్టారు దగ్గర చేర్పించింది. అలా సంగీతం నేర్చుకుని స్కూలులో, కాలేజీలో వివిధ సందర్భాలలో జరిగే వేడుకల్లో పాటలు పాడుతూ సింగర్‌గా పాపులర్ అయ్యింది. అంతేగాక మిస్ ఫ్రెషర్, మిస్ ఫేర్వెల్ టైటిల్స్‌ను గెలుచుకుంది. మూడో తరగతి నుంచే.. తొలిసారి మూడో తరగతిలో పాటల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది. అప్పటి నుంచి స్కూలు, కాలేజీలో ఏ పోటీలో పాల్గొన్నా విన్నర్‌గా నిలిచేది. ‘‘ద వాయిస్, ఇండియన్ ఐడల్, స రే గ మ పా వంటి అనేక టెలివిజన్ రియాల్టి షోలలో కూడా పాల్గొంది. వెయ్యికి పైగా స్టేజ్షోలలో పాడిన అనుభవంతో.. వాయిస్ వోవర్ ఆర్టిస్ట్‌గా ఎదిగింది. అనేక హిందీ సినిమాలు, కమర్షియల్ ప్రకటనలకు డబ్బింగ్ చెప్పింది. ప్రారంభంలో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉద్యోగం కోసం వెతికిన రేషమ్ ఇప్పుడు తన గాత్రానికి వచ్చిన గుర్తింపుతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హేళన చేసిన ఎంతో మందికి తన గొంతుతోనే సగర్వంగా సమాధానం చెబుతోంది రేషమ్. స్కూల్లో ఉన్నప్పుడు స్నేహితులు, టీచర్లు సైతం నాకు కళ్లు కనిపించవని హేళన చేసేవారు. ఎన్నోసార్లు బాధగా అనిపించేది కానీ, వాటిని ఎప్పటికప్పుడు మనసులో నుంచి తీసేదాన్ని. ఇప్పటిదాకా నా లైఫ్ జర్నీలో అమ్మ నా వెన్నంటే ఉండి ప్రోత్సహించారు. నేను ఎప్పుడు బాధపడినా అన్నయ్య నాలో ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తూ కింద పడిన ప్రతిసారి పైకి లేపాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా కుటుంబం అండతో ఈ స్థాయికి చేరుకోగలిగాను. మనలో దాగున్న ప్రతిభను కష్టపడి వెలికితీస్తే ఏదైనా సాధ్యమే. అందుకే కష్టాన్ని నమ్ముకుంటే వైకల్యం ఏది ఉన్నా జీవితంలో ఉన్నతంగా ఎదగ గలుగుతారు. – రేషమ్ తల్వార్ చదవండి: Delhi: 11 మంది మహిళలు.. లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టి.. కార్పోరేట్ హోటళ్లలో ‘గెస్ట్ చెఫ్’గానూ.. -
స్వరమే ఇం‘ధనం’
వాయిస్ అరువిచ్చే వారు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు. డాక్యుమెంటరీలు, ప్రకటనలు, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాపుల్లో వినిపించే ఆడియోలు, వీడియోలు, రేడియోల్లో.. తెర వెనకాల నుంచి వచ్చే వినసొంపైన గాత్రం ప్రేక్షకుల మదిని గెలుస్తోంది. ఈ తియ్యటి గొంతుకలు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంటున్నాయి. ఇదే ఇప్పుడు ఎంతోమందికి కెరీర్ మార్గంగా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డిజిటల్ కంటెంట్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా అంతే స్థాయిలో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అవకాశాలు లభిస్తున్నాయి. వినసొంపైన స్వరం, మాటల్లో స్పష్టత, భాషపై పట్టు, గొంతుకలో వైవిధ్యం ప్రదర్శించగలిగితే చాలు..‘వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్’గా రాణించొచ్చు. స్వరాల సవరింపు ముఖ్యంగా వినసొంపైన, విలక్షణమైన స్వరం ఉన్నవారికి ఈ కెరీర్ నప్పుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎంచుకున్న భాషపై ప్రావీణ్యత తప్పనిసరి. ఉచ్ఛారణ కచ్చితంగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి తప్పులు దొర్లకుండా డైలాగ్ డెలివరీ చెప్పగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్వరాలను క్యారెక్టర్‌కు తగిన విధంగా సవరించుకోవాలి. ఉదాహరణకు డాక్యుమెంటరీకి చెప్పే వాయిస్ ఓవర్‌కు, కార్టూన్లకు చెప్పే వాయిస్ ఓవర్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి పాత్రకు తగ్గట్టు వాయిస్‌ను మాడ్యులేట్ చేసుకునే నైపుణ్యం ఉండాలి. చేసే ప్రాజెక్టుకు తగ్గట్లు యాసను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. యానిమేషన్లో బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా భావోద్వేగాలను పండించడానికి లిప్ సింక్రనైజేషన్ చాలా అవసరం. చుట్టు పక్కల వారిని గమనిస్తూ విభిన్నమైన మాట తీరును అర్థం చేసుకోగలగాలి. సాధనకు మించిందిలేదు వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌గా ఎదిగేందుకు ప్రాక్టీస్‌కు మించిన సాధనం మరొకటి లేదు. డెమో టేపులలో వాయిస్ రికార్డింగ్ చేసుకొని వినడం ద్వారా.. వాయిస్ క్లారిటీ, డిక్షన్, డైలాగ్ డెలివరీ, టోన్, ఎమోషన్లలో దొర్లిన తప్పులను గుర్తించవచ్చు. విద్యార్హతలు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు మన దేశంలో ప్రత్యేకమైన కోర్సులంటూ ఏమీ లేవు. అయితే కొన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్లు మాత్రం వాయిస్ సంబంధిత సర్టిఫికేషన్లు నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. కానీ, ఫొనెటిక్స్ కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్లో రాణించొచ్చు. సాధారణంగా ఆర్టిస్టులకు అడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే అవకాశం లభిస్తుంది. అవకాశాలు టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులకు గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. కాబట్టి ప్రకటనల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, రేడియో ప్రకటనల తయారీలో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అవకాశం లభిస్తుంది. టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలలో కూడా డిమాండ్ ఉంది. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో.. పోడ్కాస్ట్స్, ఈ–లెర్నింగ్ యాప్స్‌లో వివరించే వారు, ఆడియో బుక్స్, ఐవీఆర్‌కు వాయిస్ ఓవర్, వాయిస్ మెయిల్ మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వాయిస్ ఓవర్ డబ్బింగ్‌కు కూడా ప్రాధాన్యం కనిపిస్తోంది. టీవీ, వెబ్, రేడియో, అడ్వర్టయిజ్మెంట్, కార్పొరేట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్ వంటి వాటిల్లో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్టులకు అవకాశాలు లభిస్తాయి. వేతనాలు మన దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కెరీర్‌ను ఎంచుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వీరు ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగులుగా రాణించవచ్చు. వీరికి వేతనాలు సైతం ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. ప్రాజెక్ట్‌ను బట్టి రెమ్యూనరేషన్ అందుతుంది. ఎపిసోడ్స్ ఆధారంగా జీతాలు చెల్లిస్తున్నారు. పని చేస్తున్న ప్రాజెక్టును బట్టి రోజుకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు సంపాదించుకోవచ్చు. డాక్యుమెంటరీలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అందుకోవచ్చు. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా చక్కటి వేతనాలు దక్కించుకోవచ్చు. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్‌కు సంక్లిష్టత, క్యారెక్టర్‌ను బట్టి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అందుతుంది. సినిమాల్లో మంచి బడ్జెట్ ఫిలింలో క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెబితే రూ.1 లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు తీసుకోవచ్చు. ఒకసారి సక్సెస్ అయిన గొంతుకు మళ్లీమళ్లీ అవకాశం లభిస్తుంది. స్వరం.. జాగ్రత్త ఈ రంగంలో రాణించాలంటే.. గొంతును (స్వరం) జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అందుకోసం ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు, ధ్యానంతోపాటు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. చల్లని పదార్థాలు, పానీయాలు, చాక్లెట్లు, పికిల్స్, చిల్లీస్‌కు దూరంగా ఉండాలి. మాడ్యులేషన్ ముఖ్యం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా రాణించాలనుకునే వారు వాయిస్ మాడ్యులేషన్స్పై అవగాహన పెంచుకోవాలి. నైపుణ్యాలుంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించే అవకాశం లభిస్తుంది. రేడియో, టీవీ, మీడియా హౌసెస్ తమ అవసరాల మేరకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకుంటున్నాయి. పదాలపై పట్టు ఉన్నవారు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులుగా రాణించవచ్చు. వీరికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటోంది.–సునిత ఆర్జే, 91.1 -
గొంతును అరువిచ్చే.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
అప్‌కమింగ్ కెరీర్: రేడియో లేదా టీవీలో వచ్చే ప్రకటనల్లో కొన్ని గొంతులను వినగానే వారు మనకు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. వారితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ గొంతుకు, ఆ వ్యక్తికి అభిమానులుగా మారుతాం. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు ఉన్న శక్తి అది. అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాల సంఖ్య విసృ్తతమవుతుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అంతేస్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. వినసొంపైన స్వరసామర్థ్యం ఉన్నవారిని అధికంగా ఆకర్షిస్తున్న నయా కెరీర్.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. స్వరమే అసలైన పెట్టుబడి టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులు మాట్లాడే మాటలు నిజానికి వారివి కావు. వారికి గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుంది. గొంతును అరువిచ్చే కళాకారులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, సెల్‌ఫోన్ రింగ్టోన్లు, రేడియో ప్రకటనల రూపకల్పనకు వీరిని నియమిస్తున్నారు. ఇక టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలలో మంచి డిమాండ్ ఉంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల ప్రధాన బాధ్యత... కాగితంపై రాసి ఉన్నదాన్ని కమ్మటి గొంతుతో వీనులవిందైన స్వరంగా మార్చి, ప్రేక్షకులను రంజింపజేయడమే. మైక్రోఫోన్ ముందు కూర్చొని, కొన్ని గంటలపాటు మాట్లాడితే.. ఆకర్షణీయమైన ఆదాయం అందుకోవచ్చు. దీంతోపాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడం కళాకారులకు దక్కే బోనస్. ఈ రంగంలో ప్రవేశానికి స్వరమే అసలైన పెట్టుబడి. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్‌గా మనదేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కు మంచి అవకాశాలు లభిస్తుండడంతో ఇందులోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో పార్ట్‌టైమ్‌గా మాత్రమే పనిచేసేవారు. ఇప్పుడు ఫుల్‌టైమ్ ప్రొఫెషనల్స్‌గా ఈ వృత్తిలోకి అడుగుపెడుతున్నారు. వీలును బట్టి ఎలాగైనా పనిచేసుకొనే అవకాశం ఉంది. ఈ రంగంలో రాణించాలంటే గొంతును కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి ఉండాలి. అర్హతలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. దీనిపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులు లేవు. కానీ, ఫొనెటిక్స్పై కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్లో రాణించొచ్చు. మంచి ఆర్టిస్ట్ అయ్యేందుకు మంచి గొంతు ఉంటే చాలు. సాధారణంగా ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే ఎంపికైనట్లే. వేతనాలు: వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు సంతృప్తికరమైన వేతనాలు ఉంటాయి. ప్రోగ్రామ్‌ను బట్టి ఆదాయం లభిస్తుంది. సాధారణంగా ప్రారంభంలో నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా ఆర్జించొచ్చు. ప్రతిభకు సాన పెట్టుకుంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. సీనియర్ ఆర్టిస్టుకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌తో సమానంగా వేతనం లభిస్తుంది. వాయిస్, డిక్షన్‌తో రాణింపు ‘‘మీడియా రంగం విస్తరిస్తుండడంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు క్రేజ్ పెరిగింది. ఇక్కడ రాణించాలంటే ప్రాక్టిస్, ప్లానింగ్ ఎంత ముఖ్యమో భాషపై పట్టు అంత అవసరం. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంటే కెరీర్లో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. కనీసం తెలుగు స్పష్టంగా మాట్లాడగలిగినా చాలు. నగర యువత కంటే గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు భాషపై పట్టుతో ఈ రంగంలో పేరు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లో 7 ఎఫ్ఎం స్టేషన్లున్నాయి. సినిమా, టీవీ, నాటకం, డాక్యుమెంటరీ ఇలా ప్రతిచోటా పసందైన గొంతుకు స్థానం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే వాయిస్, డిక్షన్ రెండూ ముఖ్యమే. న్యూస్, ఆర్జే, డాక్యుమెంటరీ, డబ్బింగ్ చెప్పాలంటే.. ఒక్కోచోట గొంతును ఒక్కో విధంగా పలకాల్సి ఉంటుంది. కష్టపడేతత్వం, నిరంతర సాధనతో ఇవన్నీ సాధ్యమే. సృజనాత్మకత, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటే కెరీర్లో ఎదిగేందుకు వీలుంటుంది’’ -రాజేష్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్జే