
పెద్దలకు సినిమాలంటే ఎంత ఇష్టమో.. పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే ఇష్టం. అలా చిన్నపిల్లలు ఇష్టపడేవాటిలో డోరమాన్, నింజా హటోరి పాత్రలు ప్రధానంగా వినిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌కు చిన్నపిల్లల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాత్రలకు కిడ్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఈ కార్టూన్ సిరీస్‌లకు యానిమేషన్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.
ఇంత క్రేజ్ ఉన్న నింజా హట్టోరి, డోరేమాన్‌ల పాత్రలకు వాయిస్ అందించిన యానిమేషన్ లెజెండ్ జుంకో హోరీ మరణించారు. జపాన్‌కు చెందిన ఆమె నవంబర్ 18న మరణించినట్లు ఆమె టాలెంట్ ఏజెన్సీ ప్రొడక్షన్ బావోబాబ్ ఈ వారంలో ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతోనే జుంకో హోరీ మరణించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని నవంబర్ 25న తెలిపారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఆలస్యంగా ప్రకటన విడుదల చేశామని పేర్కొన్నారు. దయచేసి అభిమానులు ఆమె ఇంటిని సందర్శించడం మానుకోవాలని ప్రకటనలో వెల్లడించారు.