బ్రెయినీ పిల్లాడి బ్రెయిలీ ప్రింటర్ | Breyini child   Braille printer | Sakshi
Sakshi News home page

బ్రెయినీ పిల్లాడి బ్రెయిలీ ప్రింటర్

Published Thu, Mar 20 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

బ్రెయినీ పిల్లాడి  బ్రెయిలీ ప్రింటర్

బ్రెయినీ పిల్లాడి బ్రెయిలీ ప్రింటర్

 అమావాస్య చీకటి లాంటి అంధుల జీవితంలో పున్నమి వెలుగును పంచిన వ్యక్తి లూయీ బ్రెయిలీ. అంధులకంటూ ఒక ప్రత్యేకమైన లిపిని రూపొందించి వారికి ఒక వరాన్నిచ్చాడాయన. అయితే అది అందరికీ అందుబాటులోకి రావడం లేదు. ఎందుకంటే... అంధులకోసం పుస్తకాలను ముద్రించే ప్రింటర్ల ఖరీదు చాలా ఎక్కువ.


ఫలితంగా బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాల ధర లు కూడా ఎక్కువే! ప్రత్యేకించి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలకు చెందిన అంధులకు బ్రెయిలీ లిపిలోని పుస్తకం కొనడం తలకు మించిన భారమే! దీంతో అంధుల కోసం తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి, సరికొత్త ప్రింటర్‌ను రూపొందించాడు క్యాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయ కుర్రాడు శుభమ్ బెనర్జీ (12).
 

. ‘‘ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ దారిలో కొంతమంది వ్యక్తులు ‘అంధుల సంక్షేమార్థం’ నిధులు సేకరించడాన్ని గమనించాను. ఇంటికి వెళ్ళాక కూడా ఆ దృశ్యం నన్ను వెంటాడింది. అంధుల చుట్టూనే నా ఆలోచనలన్నీ తిరిగాయి. ఇంతకీ అంధులు ఎలా చదువుకొంటారు? అనే సందేహం వచ్చింది. ఆ విషయాన్నే అమ్మానాన్నలను అడిగితే,  ‘వెళ్లి ‘గూగుల్’ లో చూడు’ అన్నారు. అలా అంధులపై నా పరిశోధన మొదలైంది’’ అని శుభమ్ చెప్పుకొచ్చాడు. అంధులు బ్రెయిలీ లిపి ద్వారా చదువుతారని తెలుసుకొన్న శుభమ్ బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్ల ఖరీదు కూడా ఎక్కువని అర్థం చేసుకొన్నాడు.

 

అసలే వైకల్యంతో బాధపడుతున్న వాళ్లకు అలా ప్రింటర్ల ధర, పుస్తకాల ధర కూడా ఎక్కువగా ఉండడం ఏమిటా అన్న ఆలోచనలో పడ్డాడు. ‘‘వారికోసం తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంచొచ్చు కదా? అనే ఆలోచన వచ్చింది, సమాధానం కూడా నేను ఇచ్చుకోవాలనుకొని బ్రెయిలీ ప్రింటర్ రూపకల్పనకు పూనుకొన్నాను’’ అని క్యాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో సెవన్త్ గ్రేడ్ చదువుతున్న ఈ అబ్బాయి చెప్పాడు.

 

 బ్రె యిలీ ప్రింటర్ ఎలా పనిచేస్తుందనే విషయం గురించి పరిశోధించాడు. ఓ పక్కన స్కూలులో ఇచ్చిన ఎసైన్‌మెంట్లు చేసుకొని, ఆ తరువాత ఈ నవీన ఆవిష్కరణ కోసం కుస్తీలు పట్టేవాడు. ఈ చిన్న కుర్రాడు ఒక్కో రోజున అర్ధరాత్రి 2 గంటల దాకా మెలకువగా ఉండి మరీ పని చేసేవాడు. చివరకు తక్కువ ఖర్చులో బ్రెయిలీ ప్రింటర్ నమూనాను రూపొందించాడు. ‘‘నా ఊహాల్లోని ప్రింటర్‌కు నా తల్లితండ్రుల సహకారంతో ఒక రూపాన్నిచ్చాను. అది విజయవంతమైంది’’ అన్నాడు శుభమ్. అతను రూపొందించిన ఈ ప్రింటర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఉన్న ఫైల్స్‌కు కాగితంపై అక్షర రూపాన్నిస్తుంది. అయితే దాన్ని మార్కెటింగ్ చేసే ఉద్దేశం అతనికి లేదు. ‘‘నేను వ్యాపారిని కావడానికి దీన్ని రూపొందించలేదు. అంధుల సౌకర్యార్థమే ఈ ప్రయత్నం. అది విజయవంతం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే... ఇది పెద్ద ఎత్తున పుస్తకాల తయారీకి ఉపయోగపడదు. ఎవరికి వారు తమ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కిట్ గురించి పూర్తి వివరాలు నా వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

కావాలనుకొనే వాళ్లు ఆర్డర్ చేయవచ్చు. మీరే ఇంటి దగ్గర ఆ కిట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు’’ అని శుభమ్ బెనర్జీ వివరించాడు. ఈ మధ్య అమెరికాలోని ఓ సైన్స్ ప్రదర్శనలో శుభమ్ తన నమూనాను ప్రదర్శించినప్పుడు అందరూ ఆసక్తిగా గమనించారు. చూపు లేనివారికి ఉపయోగపడే ఈ కారు చౌక ప్రింటర్ ఇప్పుడు పెద్ద సంచలనమైంది. అమెరికన్ మీడియా అంతా చిన్న వయసులోనే పెద్ద మేధావి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తోంది.
 
 ఖరీదు తక్కువ!

 సాధారణంగా ఒక బ్రెయిలీ ప్రింటర్ ఖరీదు లక్షా ఇరవై వేల రూపాయల వరకూ ఉంటుంది. అయితే శుభమ్ బెనర్జీ రూపొందించిన మోడల్ ప్రింటర్ ఖరీదు కేవలం ఇరవై వేల రూపాయలకే అందుబాటులో ఉంటుంది. దీని పేరు ‘బ్రెయిగో’. అంధులకు లిపిని రూపొందించిన లూయీ బ్రెయిలీ పేరు, అందుకు సంబంధించిన ప్రింటర్ లెగో పేరు కలుపుతూ తన కొత్త ప్రింటర్‌కు ‘బెయిగో’ అని  పెట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement