త్రీ ఐడియాస్ | Three greatest people Ideas | Sakshi
Sakshi News home page

త్రీ ఐడియాస్

Published Wed, Aug 24 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

Three  greatest people Ideas

చెవులకు చూపించింది
అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న చిన్నారులలో కూడా కొందరు ఆర్థిక స్థితి బాగోలేకపోవడం వల్ల స్కూలుకు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. అలాటిది అసలు చూపు లేని పిల్లలయితే ఏమి చేస్తారు? ఎలా చదువుకుంటారు? సాంకేతిక విజ్ఞానం అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నా కూడా అలాంటి వారి కోసం బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలు తప్ప మరో విధమైన ఆధారం లేకపోవడం విచారకరం. దీనికి ప్రత్యామ్నాయం చూపించగలిగితే బాగుండుననుకుంది నిధి అరోరా. గుర్గావ్ కేంద్రంగా అంధులకోసం పని చేసే ఈషా అనే ఎన్జీవో వ్యవస్థాపకురాలీమె. తన సంస్థ ద్వారా నిధి అరోరా ‘సెంట్రల్ లైబ్రరీ ఆఫ్ ఆడియో బుక్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్’ (ఇఔఅఆఐఔ) అనే పథకాన్ని రూపొందించింది.


అదేమిటంటే దృష్టిలోపం వంటి సమస్యలతో రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లలేని వారికోసం ఆడియో బుక్స్ తయారు చేయడం. అలా తయారు చేసిన ఈ పుస్తకాలు సునో అనే యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లభిస్తాయి. వీటిలో ప్రేమ్‌చంద్, కబీర్ దాస్ వంటి వారి ఉత్తేజపూరితమైన జీవిత కథలతో సహా ఎన్నో క్లాసిక్ కథలు, జానపద కథలు కూడా చదువుకోవచ్చు... సారీ వినొచ్చు. ఇంగ్లిష్‌తో సహా 17 భారతీయ భాషల్లో మొత్తం 5,398 ఫైళ్లను ఇఔఅఆఐఔలో పొందుపరిచారు. ఇందుకోసం ఈశా సంస్థకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా పని చేసే వేలాది వాలంటీర్లు ఉన్నారు. అనేక సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం విహ ంచేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. - నిధి అరోరా



టైర్ల నుండి  డీజిల్ పిండాడు!
అరిగిపోయిన కారు టైర్‌లను ఏమి చేస్తారు? మామూలుగా అయితే విసిరి అవతలపారేస్తారు. లేదా వాటిని తగులబెట్టి పర్యావరణాన్ని పాడు చేస్తారు. కానీ అందరిలా వాటిని తాను అలా చేయదలచుకోలేదు గుర్గాన్‌కు చెందిన పదహారేళ్ల అనుభవ్ వాధ్వా. సర్వీస్ అయిపోయిన టైర్లతో పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని సంకల్పించాడు. పర్యావరణానికి పనికొచ్చే ఏదైనా ఒక మంచి పని చేయాలని ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుండేవాడు. అలా ఇతను రూపొందించిన టెక్ ఆప్టో అనే పథకం 600 స్టార్టప్ కంపెనీల్లో ఉత్తమమైందిగా నిలిచింది. ఓ రోజు అరిగి, పాడైపోతున్న పాత టైర్ల మీద అతని దృష్టి పడింది.

‘చెత్తనుంచి విద్యుత్‌ను, ఇంధనాన్ని తయారు చేస్తున్నప్పుడు, పేడనుంచి గోబర్ గ్యాస్‌ను తయారు చేస్తున్నప్పుడు టైర్లను ఉపయోగించి ఇంధనాన్ని ఎందుకు ఉత్పత్తి చేయకూడదు’ అనుకున్నాడు. అనేక ప్రయోగాల తర్వాత బయో డీజిల్‌ను ఉత్పత్తి చేయగలగడంలో సక్సెస్సయ్యాడు. పాత కారు టైర్లను సేకరించడం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌నూ రూపొందించాడు. అతనికి ఒక మెయిల్ ఇస్తే చాలు... కంపెనీ వారి ట్రక్ మన వద్దకు వచ్చి మరీ పాడైపోయిన టైర్లను తీసుకొని వెళ్తుంది. అలా పోగైన టైర్లను వర్గీకరించి, వాటిని రీ ట్రేడింగ్ చేస్తాడు. అందుకు కూడా పనికిరాని వృథా నుంచి బయో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తాడు. ఇలా తయారైన బయోడీజిల్ పూర్తి పర్యావరణహితమైంది. అనుభవ్ వాధ్వా


యార్డునే ఏరిపారేసింది!
పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ లేదా చెత్తకుండీ లేదా చెత్తను తీసుకుని వెళ్లే వాహనం ముందునుంచి వెళ్లవలసి వస్తే ఏం చేస్తాం? ఆ వాసన మన ముక్కుపుటాల్లోకి వెళ్లకుండా ముక్కును అదిమిపెట్టి పరుగు పరుగున దాటి వెళ్తాం. అయితే రోజూ ఆ వాసన మధ్యనే గడపవలసి వస్తే? స్లొవేకియాకు చెందిన లాయర్ జుజానా కపుటోవా ముక్కు మూసుకోలేదు. నోరు తెరిచి పదిమందినీ పోగేసింది. ఈమె ఇంటికి సమీపంలోనే ఒక పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ ఉంది. అది ఇరుగు పొరుగు దేశాల నుంచి డంప్ చేసుకున్న ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన చెత్త. అది చాలదన్నట్టు ఆ పట్టణంలో మరో చెత్త డంపింగ్ యార్డ్ కూడా పెట్టనున్నట్లు పత్రికల వార్తల ద్వారా తెలుసుకుంది.

ఒక్క యార్డు ఉంటేనే ఇంత వాసన వస్తుంటే, ఇక రెండో యార్డు కూడా తోడైతే? ఇంకేమైనా ఉందా? దాంతో ఇరుగుపొరుగును కూడగట్టుకుని చెత్త డంపింగ్ యార్డును తమ పట్టణంలో పెట్టకూడదంటూ ఉద్యమించింది. ఈ ఉద్యమంలో ఎంతోమంది భాగస్వాములయ్యారు. ఆమె చేపట్టిన ఈ ఉద్యమం స్లొవేకియా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఫలితం... ప్రజలు నివసించే ప్రదేశంలో చెత్త డంపింగ్ యార్డ్ పెట్టడమేమిటంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది. అంతేకాదు... అంతవరకూ ఉన్న డంపింగ్ యార్డునూ అక్కడినుంచి తరలించాలంటూ తీర్పు చెప్పింది. దాంతో ప్రభుత్వం దిగి వచ్చింది. జుజానే పుణ్యమా అని ఆ పట్టణప్రజలంతా ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చగలుగుతున్నారు. 
   
- జుజానా కపుటోవా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement