Car tire
-
‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్
స్మార్ట్‌ఫోన్‌లోని డిజిటల్ కెమెరా.. మెమరీ ఫోమ్ పరుపులు.. కారు టైర్లు.. గీతలు పడని లెన్స్.. వాటర్ ఫిల్టర్.. ఇవన్నీ ‘ఆకాశం’ నుంచి ఊడిపడ్డాయ్ తెలుసా? ఎందుకంటే ఇవన్నీ అంతరిక్ష ప్రయోగాల కోసం శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లోంచి పుట్టినవి. మనం నిత్యం వాడే వస్తువులుగా మారిపోయాయి. మరి వీటి విశేషాలు ఏమిటో చూద్దామా.. గ్రహాంతర ప్రయోగాలు.. ఫోన్ కెమెరా.. ►శాటిలైట్లలో బిగించేందుకు.. నాసాకు చెంది న జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) ఇంజనీర్ యూజీన్ లల్లీ మొదటిసారిగా 1960 దశకంలో డిజిటల్ కెమెరాలను రూపొందించారు. అవి పెద్ద పరిమాణంలో ఉండి, ఎక్కువ విద్యుత్ అవసరం పడేవి. దీంతో తక్కువ సైజులో ఉండే డిజిటల్ కెమెరాలపై పరిశోధన చేసిన జేపీఎల్ ఇంజనీర్ ఎరిక్ ఫోసమ్.. 1990 దశకం మొదట్లో ‘సీఎంఓఎస్– యాక్టివ్ పిక్సెల్ సెన్సర్ (ఏపీఎస్)’ ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఫోన్ కెమెరాలు, వెబ్‌క్యామ్‌లు వంటి మినియేచర్ కెమెరాల్లో వాడుతున్న టెక్నాలజీ ఇదే. అంతరిక్షంలోకి పంపకున్నా.. ఇళ్లలోకి వాటర్ ఫిల్టర్.. ►నాసా చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే.. వాళ్లకు మంచి నీళ్లు ఎలాగనే పరిశోధనలూ చేసింది. వాడిన నీటిని తిరిగి శుద్ధిచేసుకుని వినియోగించుకునేలా ‘ఎలక్ట్రోలైటిక్ సిల్వర్ అయాన్ జనరేటర్’ను అభివృద్ధి చేసింది. ఈ వాటర్ ఫిల్టర్‌ను అంతరిక్ష ప్రయోగాల్లో వాడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలోకి వచ్చేసింది. అయితే దీనికన్నా మెరుగైన, ఖరీదైన టెక్నాలజీని ‘అపోలో’ ప్రయోగాల్లో వాడారు. స్పేస్ షటిల్లో సీట్లు.. మెమరీ ఫోమ్ పరుపులు ►స్పేస్ షటిల్స్ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చేప్పుడు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. వాటిలో ఉండే వ్యోమగాము లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలా ఒత్తిడిని తట్టుకోవడంతో పాటు మృదువుగా, సౌకర్యవంతంగా ఉండేందుకు నాసా 1960వ దశకంలో ‘పాలీయూరేథీన్ సిలికాన్ ప్లాస్టిక్ (మెమరీ ఫోమ్)’ మెటీరియల్‌ను అభివృద్ధి చేసింది. స్పేస్ షటిల్ సీట్లలో అమర్చింది. అవే ఇప్పుడు మనం వాడుతున్న మెమరీ ఫోమ్ పరుపులు, దిండ్లు. అనుకోకుండా కనిపెట్టిన.. స్క్రాచ్ రెసిస్టెంట్ లెన్స్.. ►వ్యోమగాములు హెల్మెట్ కోసం గాజును వాడితే ప్రమాదకరం కావడంతో నాసా ఫైబర్ గ్లాస్‌ను వినియోగించింది. కానీ దానిపై సులువుగా గీతలు పడి ఇబ్బంది వస్తుండటంతో పరిష్కారంపై ప్రయోగాలు మొదలుపెట్టింది. అయితే చిత్రంగా టెడ్ వైడెవెన్ అనే శాస్త్రవేత్త వాటర్ ఫిల్టర్ కోసం చేస్తున్న ప్రయోగాల సందర్భంగా.. స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు కళ్లద్దాల నుంచి టీవీలు, మానిటర్లు, ఫోన్ స్క్రీన్ల దాకా ఈ కోటింగ్‌ను వాడుతున్నారు. మార్స్‌పై దిగే ప్యారాచూట్ తాళ్లు.. కారు టైర్లు.. ►1976లో నాసా ప్రయోగించిన ‘వైకింగ్ ల్యాండర్’ అంగారకుడిపై సురక్షితంగా దిగేందుకు ప్యారాచూట్లను వినియోగించారు. అసలే మార్స్‌పై తేలికైన వాతావర ణం, ఎక్కువ బరువున్న ప్రోబ్.. ప్యారా చూట్ తాళ్లు అత్యంత బలంగా ఉండాలి. దీనిపై నాసా విజ్ఞప్తి మేరకు.. ‘గుడ్ ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ’ ఉక్కుకన్నా బలమైన రబ్బర్ మెటీరియల్‌ను రూపొందించింది. తర్వాత దీనిని వాహనాల టైర్ల తయారీలో వాడటం మొదలుపెట్టారు. ఇంకా ఎన్నో.. ►స్పేస్ ఫ్లైట్లలో, విమానాల్లో వాడేందుకు నాసా తోపాటు యునైటెడ్ ఎయిర్ లైన్స్ శాస్త్రవేత్తలు కలిసి వైర్ లెస్ హెడ్‌సెట్‌ను అభివృద్ధి చేశారు. ►నాసా స్పేస్‌లో ఆల్గే (నాచు)ను ఉపయోగించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలు చేస్తుండగా.. పిల్లలకు పాలకు బదులుగా ఇచ్చే ‘బేబీ ఫార్ములా’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ►స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త డోగ్ ఎంగెల్బర్ట్.. నాసా చేసిన ఆర్థిక సాయం, సూచనలతోనే కంప్యూటర్ ‘మౌస్’ను తయారు చేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
త్రీ ఐడియాస్
చెవులకు చూపించింది అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న చిన్నారులలో కూడా కొందరు ఆర్థిక స్థితి బాగోలేకపోవడం వల్ల స్కూలుకు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. అలాటిది అసలు చూపు లేని పిల్లలయితే ఏమి చేస్తారు? ఎలా చదువుకుంటారు? సాంకేతిక విజ్ఞానం అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నా కూడా అలాంటి వారి కోసం బ్రెయిలీ లిపిలో ఉన్న పుస్తకాలు తప్ప మరో విధమైన ఆధారం లేకపోవడం విచారకరం. దీనికి ప్రత్యామ్నాయం చూపించగలిగితే బాగుండుననుకుంది నిధి అరోరా. గుర్గావ్ కేంద్రంగా అంధులకోసం పని చేసే ఈషా అనే ఎన్జీవో వ్యవస్థాపకురాలీమె. తన సంస్థ ద్వారా నిధి అరోరా ‘సెంట్రల్ లైబ్రరీ ఆఫ్ ఆడియో బుక్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజ్’ (ఇఔఅఆఐఔ) అనే పథకాన్ని రూపొందించింది. అదేమిటంటే దృష్టిలోపం వంటి సమస్యలతో రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లలేని వారికోసం ఆడియో బుక్స్ తయారు చేయడం. అలా తయారు చేసిన ఈ పుస్తకాలు సునో అనే యాప్ ద్వారా ఆన్లైన్లో లభిస్తాయి. వీటిలో ప్రేమ్‌చంద్, కబీర్ దాస్ వంటి వారి ఉత్తేజపూరితమైన జీవిత కథలతో సహా ఎన్నో క్లాసిక్ కథలు, జానపద కథలు కూడా చదువుకోవచ్చు... సారీ వినొచ్చు. ఇంగ్లిష్తో సహా 17 భారతీయ భాషల్లో మొత్తం 5,398 ఫైళ్లను ఇఔఅఆఐఔలో పొందుపరిచారు. ఇందుకోసం ఈశా సంస్థకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా పని చేసే వేలాది వాలంటీర్లు ఉన్నారు. అనేక సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం విహ ంచేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. - నిధి అరోరా టైర్ల నుండి డీజిల్ పిండాడు! అరిగిపోయిన కారు టైర్లను ఏమి చేస్తారు? మామూలుగా అయితే విసిరి అవతలపారేస్తారు. లేదా వాటిని తగులబెట్టి పర్యావరణాన్ని పాడు చేస్తారు. కానీ అందరిలా వాటిని తాను అలా చేయదలచుకోలేదు గుర్గాన్‌కు చెందిన పదహారేళ్ల అనుభవ్ వాధ్వా. సర్వీస్ అయిపోయిన టైర్లతో పర్యావరణ హితమైన బయో ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని సంకల్పించాడు. పర్యావరణానికి పనికొచ్చే ఏదైనా ఒక మంచి పని చేయాలని ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుండేవాడు. అలా ఇతను రూపొందించిన టెక్ ఆప్టో అనే పథకం 600 స్టార్టప్ కంపెనీల్లో ఉత్తమమైందిగా నిలిచింది. ఓ రోజు అరిగి, పాడైపోతున్న పాత టైర్ల మీద అతని దృష్టి పడింది. ‘చెత్తనుంచి విద్యుత్‌ను, ఇంధనాన్ని తయారు చేస్తున్నప్పుడు, పేడనుంచి గోబర్ గ్యాస్‌ను తయారు చేస్తున్నప్పుడు టైర్లను ఉపయోగించి ఇంధనాన్ని ఎందుకు ఉత్పత్తి చేయకూడదు’ అనుకున్నాడు. అనేక ప్రయోగాల తర్వాత బయో డీజిల్‌ను ఉత్పత్తి చేయగలగడంలో సక్సెస్సయ్యాడు. పాత కారు టైర్లను సేకరించడం కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌నూ రూపొందించాడు. అతనికి ఒక మెయిల్ ఇస్తే చాలు... కంపెనీ వారి ట్రక్ మన వద్దకు వచ్చి మరీ పాడైపోయిన టైర్లను తీసుకొని వెళ్తుంది. అలా పోగైన టైర్లను వర్గీకరించి, వాటిని రీ ట్రేడింగ్ చేస్తాడు. అందుకు కూడా పనికిరాని వృథా నుంచి బయో డీజిల్‌ను ఉత్పత్తి చేస్తాడు. ఇలా తయారైన బయోడీజిల్ పూర్తి పర్యావరణహితమైంది. అనుభవ్ వాధ్వా యార్డునే ఏరిపారేసింది! పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ లేదా చెత్తకుండీ లేదా చెత్తను తీసుకుని వెళ్లే వాహనం ముందునుంచి వెళ్లవలసి వస్తే ఏం చేస్తాం? ఆ వాసన మన ముక్కుపుటాల్లోకి వెళ్లకుండా ముక్కును అదిమిపెట్టి పరుగు పరుగున దాటి వెళ్తాం. అయితే రోజూ ఆ వాసన మధ్యనే గడపవలసి వస్తే? స్లొవేకియాకు చెందిన లాయర్ జుజానా కపుటోవా ముక్కు మూసుకోలేదు. నోరు తెరిచి పదిమందినీ పోగేసింది. ఈమె ఇంటికి సమీపంలోనే ఒక పెద్ద చెత్త డంపింగ్ యార్డ్ ఉంది. అది ఇరుగు పొరుగు దేశాల నుంచి డంప్ చేసుకున్న ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన చెత్త. అది చాలదన్నట్టు ఆ పట్టణంలో మరో చెత్త డంపింగ్ యార్డ్ కూడా పెట్టనున్నట్లు పత్రికల వార్తల ద్వారా తెలుసుకుంది. ఒక్క యార్డు ఉంటేనే ఇంత వాసన వస్తుంటే, ఇక రెండో యార్డు కూడా తోడైతే? ఇంకేమైనా ఉందా? దాంతో ఇరుగుపొరుగును కూడగట్టుకుని చెత్త డంపింగ్ యార్డును తమ పట్టణంలో పెట్టకూడదంటూ ఉద్యమించింది. ఈ ఉద్యమంలో ఎంతోమంది భాగస్వాములయ్యారు. ఆమె చేపట్టిన ఈ ఉద్యమం స్లొవేకియా సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఫలితం... ప్రజలు నివసించే ప్రదేశంలో చెత్త డంపింగ్ యార్డ్ పెట్టడమేమిటంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది. అంతేకాదు... అంతవరకూ ఉన్న డంపింగ్ యార్డునూ అక్కడినుంచి తరలించాలంటూ తీర్పు చెప్పింది. దాంతో ప్రభుత్వం దిగి వచ్చింది. జుజానే పుణ్యమా అని ఆ పట్టణప్రజలంతా ఇప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చగలుగుతున్నారు. - జుజానా కపుటోవా