బ్రెయిలీ ఆలయం | Flares from the community | Sakshi
Sakshi News home page

బ్రెయిలీ ఆలయం

Published Tue, Apr 28 2015 10:38 PM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

బ్రెయిలీ ఆలయం

బ్రెయిలీ ఆలయం

మిణుగురులు
సమాజానికి దివిటీలు

 
వారికి చూపులేదు. కానీ, వారి వేళ్లకు చూపుంది. అందుకే, ఆ వేళ్లతోనే ప్రపంచాన్ని వీక్షిస్తున్నారు. ఆ వేళ్లతోనే పాఠశాల అంధ బాలలకు కావల్సిన పుస్తకాలను ముద్రిస్తున్నారు. చేసే పనిని దైవకార్యంగా, ముద్రణాలయాన్ని దేవాలయంగా భావిస్తూ తమ జీవితాల్లో నిండుదనాన్ని నింపుకుంటున్నారు.
 
ప్రభుత్వ బ్రెయిలీ పాఠ్యపుస్తక ముద్రణాలయం అది. అక్కడ 12 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో ఎనిమిది మంది అంధులే! తాము నేర్చుకున్న విద్యను యంత్రాల సాయంతో బ్రెయిలీ పుస్తకాలను తయారు చేయడంలో నిమగ్నులై ఉంటారు వీరంతా! హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో ఉన్న ఈ ‘ఆలయం’ నుంచి ఇరవై తొమ్మిదేళ్లుగా ప్రభుత్వ అంధుల పాఠశాలలకు, స్వచ్ఛంద సంస్థలకు, కాలేజీలకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు వెళుతున్నాయి.

అచ్చంగా అచ్చు

ముందు గదిలో విశాలమైన బల్ల, దానిపై అల్యూమినియమ్ షీట్‌ను యంత్రానికి అమర్చి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో బటన్లను ఉపయోగిస్తూ బ్రెయిలీ లిపికి ప్రాణం పోస్తుంటారు. మార్బర్ స్టెరియో టైపర్ అనే ఈ యంత్రంపై చేసేవి ప్రాథమిక దశ పనులు.  ఈ మిషనరీ దగ్గర మొదటి నుంచీ పనిచేస్తున్న వెంకటేశ్వరరావు పూర్తిగా అంధులు. ‘‘1986లో తొమ్మిది మందితో ఈ ముద్రణాలయం ఏర్పాటైంది. అందులో మొదటి బ్యాచ్ నుంచీ పనిచేస్తున్నాను. ఈ పనికి ఎంపికవడానికి ముందు మద్రాస్‌లోని పల్లవరంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. నాతోపాటు మరో 8 మంది ఈ శిక్షణ తీసుకున్నారు. మా కమ్యూనిటీకి ఈ విధంగా సేవ చేసే భాగ్యం దక్కిందని, ఎంతో మంది అంధుల చేతుల్లో మేం తయారు చేసిన పుస్తకాలు ఉంటాయని, వారి వేళ్లకు మేం చూపుగా అయ్యామన్న ఆనందం, సంతృప్తితో ఈ పనులను చాలా ఇష్టంగా చేస్తుంటాం మేమంతా’’ అని వెంకటేశ్వరరావు వివరించారు.

స్టీరియోటైపర్ నుంచి కాస్త పక్కకు జరిగితే అక్కడే మరో బల్లపై ప్రూఫ్‌రీడింగ్ జరుగుతుంది. అచ్చులో వచ్చిన తప్పులను మరో యంత్రం సాయం తో సరిచేస్తారు. అంటే డాట్స్‌లో తేడాలు వస్తే వాటిని తీసేయడం, లేదా తిరిగి డాట్స్ వేయడం ఈ పద్ధతిలో జరుగుతుంది. 28 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న రమేష్‌కి చూపు బాగానే పనిచేస్తుంది. అంధులకు సహాయంగా ఉంటూ చేసే పని తన జన్మకు ధన్యతను చేకూర్చుని చెబుతూ ‘‘ఇక్కడ అచ్చు వేయడం దగ్గర నుంచి, పుస్తకం బయటకు వచ్చేవరకు అన్ని పనులు చేస్తుంటాను’’ అని తెలిపారు.
 
పుస్తకాల నిలయం

ప్రూఫ్ రీడింగ్ నుంచి ప్రింటింగ్ సెక్షన్‌కు వెళితే అక్కడ మరో మూడు పద్ధతుల్లో పనులు జరుగుతుంటాయి. అక్కడంతా గులాబీ, తెలుపు రంగులో పెద్ద పెద్ద చార్టులు, వాటిని పుస్తకరూపం లోకి మార్చి, పేర్చిన దొంతర్లు కనపడతాయి. ‘‘ముందు పుస్తకానికి కావల్సిన పరిమాణాన్ని ఎంపికచేయడానికి ఒక చార్ట్ వేసుకుంటాం. దాని ప్రకారంగా మిగతా అన్ని చార్ట్‌లను వరుసక్రమంలో ఉంచుతాం. ఇవన్నీ హీడెల్‌బర్గ్ ప్రింటింగ్ మెషిన్‌లో సెట్ చేస్తాం. ఎన్ని కాపీలు కావాలో ముందే నిర్ణయించుకుని ఉంటాం కాబట్టి, ఆ లెక్కన మిషనరీ సాయంతో కాపీలు తీసుకుంటాం’’ అని తెలిపారు కంటిచూపు కొంతవరకే (పార్షియల్ బ్లైండ్) బాగున్న మురళి. పాతికేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న జయప్రకాష్ కూడా అంధుడే. ‘‘ఇక్కడ ముద్రించిన కాపీలను కటింగ్ మిషన్ ద్వారా కావల్సిన సైజ్‌లో కట్ చేసి, బైండ్ చేస్తాం. అటు నుంచి పుస్తకాలన్నీ క్రమపద్ధతిలో అమర్చి, వచ్చిన ఆదేశాల ప్రకారం పంపిణీ చేస్తాం. అయితే, ఇంత సంఖ్య అని కచ్చితంగా ఉండదు’’ అని తెలిపారు జయప్రకాష్. బయట ఎన్ని సమస్యలున్నా, ఇక్కడికొచ్చామంటే అన్నీ మర్చిపోతాం. ఈ రోజు జరగాల్సిన కృషి ఏంటి.. అనే దాని మీద మా మధ్య చర్చలు ఉంటాయని తెలిపారు అక్కడ పనిచేస్తున్న మిగతా సభ్యులు.

పనులు వేగవంతం

కంప్యూటర్ ద్వారా ఉర్దూ పాఠ్యాంశాలను బ్రెయిలీ లిపిలో అందిస్తున్న సయ్యద్ యాదుల్లాను పలకరిస్తే -‘‘ఉర్దూ బ్రెయిలీ ప్రింటర్ అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. కంప్యూటర్‌లో ఉర్దూ బ్రెయిలీని టైప్ చేసి, ఆ తర్వాత ప్రింట్స్ తీసి, బైండింగ్ చేసే దగ్గరకు పంపిస్తుంటాను’’అని తెలియజేశారు సయ్యద్.
 
- నిర్మలారెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement