బ్రెయిలీæ పుస్తకాల ఆధారంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న మల్లాబత్తుల పోతురాజు
జ్ఞానం మూడో నేత్రం అంటారు. మరీ ముఖ్యంగా అంధులకు చదువు చాలా ముఖ్యం. కళ్లతో లోకాన్ని చూడలేకపోయినా ఆత్మస్థైర్యం, పట్టుదలతో ప్రపంచాన్ని జయించగలరు. అంధులకు ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జీవితమే దీనికి ఉదాహరణ. తన మూడు సంవత్సరాల వయస్సులోనే ఒక ప్రమాదంలో ఆయన చూపు కోల్పోయారు. కానీ ఆత్మస్థైర్యాన్ని వీడక బ్రెయిలీ పేపర్ మీద ఎత్తు చుక్కల ఆధారంగా ఒక భాష రూపొందించారు. ఈ చుక్కలను స్మర్శించడం ద్వారా కనిపించకపోయినప్పటీకీ చదివేలా లిపి రూపొందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నేడు ఆ చుక్కల భాషే ఎందరో అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన అంధ ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజుది ఇటువంటి ఆదర్శప్రాయమైన జీవితమే. నేడు లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆ వివరాలు ఇలా..
జంగారెడ్డిగూడెం రూరల్ :కంటి చూపు కోల్పోయినా పట్టుదలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజు. మేనరికం కారణంగా బాల్యం నుంచి చూపుకు దూరమైనా ఎంతో కష్టపడి పీజీ స్థాయి వరకు చదువుకొని తాను విద్యనభ్యసించిన పాఠశాలలోనే ఉపా«ధ్యాయుడిగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మల్లాబత్తుల పోతురాజు ఇదే గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల మెయిన్‌లో 7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. అనంతరం 8 నుంచి టెన్త్ వరకు హైదరాబాద్‌లోని జీబీహెచ్‌ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ మలక్‌పేటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో, పీజీ ఉస్మానియాలో, బీఈడీ నల్లగొండలో విద్యనభ్యసించారు.
2001 డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన అనంతరం పోతురాజు మాస్టారు 2002 జనవరిలో పోలవరం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2003 నుంచి జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి తన స్వగ్రామమైన శ్రీనివాసపరంలో ఉన్న తాను చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బా«ధ్యతలు చేపట్టారు. తన సొంత గ్రామంలో, చదివిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయడం పోతురాజు జీవితంలో మరిచిపోని అనుభూతిగా నిలిచింది. పోతురాజు బ్రెయిలీ ద్వారా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు.
ఆకట్టుకునే విద్యాబోధన
పోతురాజు మాస్టారు విద్యాబోధన అంటే విద్యార్థులకు ఎంతో ఆసక్తి. అంధత్వం ఉన్నా పాఠ్యాంశాలకు సంబంధించిన బ్రెయిలీ పుస్తకాలను తెప్పించుకుని మరీ విద్యను బోధిస్తున్నారు. బ్రెయిలీ పుస్తకంలో చుక్కలను చేతితో తాకుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. బోర్డు దగ్గరగా తన కళ్లను పెట్టి అక్షరాలను కూడా అవలీలగా రాస్తూ విద్యాబోధన చేస్తున్నారు. 2012 సంవత్సరంలో పోతురాజు మాస్టారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు.
నా ఆత్మస్థైర్యమే నన్ను నడిపించింది
నాకు చిన్ననాటి నుంచి అంధత్వం ఉన్నా ఏనాడు కుమిలిపోలేదు. ఆత్మస్థైర్యంతో చదివి అనుకున్నది సాధించాను. నా తల్లితండ్రులైన రాములు, సీతల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. నా స్వగ్రామంలో నేను చదవిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది. వైకల్యం కలిగిన వారిని చూసి అయ్యో పాపం అనేదాని కన్నా.. చేతనైనా సాయం చేస్తే ఎంతో మేలు చేసినవారవుతారు.
–మల్లాబత్తుల పోతురాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment