Teacher job
-
ఉద్యోగం నుంచి తొలగించడం సబబే
సాక్షి, అమరావతి: తనకు వినికిడి లోపం ఉందని నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి దివ్యాంగుల కోటాలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ మహిళను సర్వీస్ నుంచి తొలగిస్తూ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. సర్వీస్ నుంచి వెళ్లిపోయే స్వేచ్ఛను ఆ మహిళా టీచర్‌కు ఇస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.తనకు వినికిడి లోపం లేదని తెలిసి కూడా.. ఆ లోపం ఉన్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందినందుకు ఆ మహిళకు రూ.లక్ష ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు విశాఖపట్నంలో వినికిడి లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక స్కూల్ నిర్వహిస్తున్న ఓంకార్ అండ్ లయన్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెల్లించాలని ఆ మహిళను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కేసు పూర్వాపరాలివీ2012లో నిర్వహించిన డీఎస్సీలో దివ్యాంగుల కోటా (వినికిడి లోపం) కింద స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు జి.వెంకటనాగ మారుతి అనే మహిళ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆమె తనకు 70 శాతం వినికిడి వైకల్యం ఉందని దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో ఆమె ప్రకాశం జిల్లా పి.నాగులవరం జెడ్పీ హైసూ్కల్లో స్కూల్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అయితే.. వినికిడి లోపానికి సంబంధించి ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు ఆమెను సర్వీసు నుంచి తొలగిస్తూ 2015 మార్చిలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మారుతి ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ మారుతిని సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు ఆమెకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తూ 2017లో తీర్పునిచ్చింది. ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఆమె 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. దివ్యాంగుల కోటా కిందకు తాను రానని తెలిసి కూడా నాగ మారుతి అదే కోటా కింద దరఖాస్తు చేసి తప్పుడు వివరాలు పొందుపరచి, నకిలీ ధ్రువీకరణ పత్రం సమర్పించి ఉద్యోగం పొందారని ధర్మాసనం తేల్చింది. ఉద్యోగం పొందేందుకు పిటిషనర్ మోసపూరితంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించాల్సి ఉండగా, స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వెళ్లిపోయేందుకు అమెకు వెసులుబాటు కల్పించాలని అధికారులను ట్రిబ్యునల్ ఆదేశించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. అమెను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు సబబేనంది. -
ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది
చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుని పేరు పాలుపోక భాస్కరరావు. ఆయనది మక్కువ మండలంలోని కాశీపట్నం గ్రామం. బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఉపాధ్యాయుడు కావాలన్న ఆశయంతో రాత్రీపగలు కష్టపడి చదివారు. డీఎస్సీ– 1998లో క్వాలిఫై అయ్యారు. చేతికందొచ్చిన ఉద్యోగం వివాదాలతో దూరమైంది. 2001లో డీఎస్సీ రాయగా అరమార్కులో అనర్హుడయ్యారు. మరోమారు 2006లో స్కూల్ అసిస్టెంట్ బయోలజీలో ఒక్కమార్కులో ఉద్యోగం పోయింది. తరువాత అనారోగ్యం కారణంగా 2007, 2012 సంవత్సరాలలో పరీక్షలు రాయలేకపోయారు. 2009లో ఇన్ఫెక్షన్ సోకడంతో రెండుకాళ్లు తీసేయాల్సి వచ్చింది. అక్షరాలపై మమకారం, ఉపాధ్యాయ వృత్తిపై ప్రేమతో కృత్రిమ కాళ్లతో కొన్నాళ్ల పాటు కాశీపట్నం ప్రభుత్వ పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేశారు. కొన్నాళ్లకు వలంటీర్ వ్యవస్థను ఎత్తేయడంతో ఆ చిరుద్యోగమూ దూరమైంది. జీవనం భారంగా మారింది. పొట్టపోషణ కోసం కాశీపట్నం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకొని మక్కువలోని ఓ మీసేవా కేంద్రంలో పనిచేసేవారు. కొంతకాలం తర్వాత మీ సేవా కేంద్రం వేరే ప్రదేశానికి మార్పుచేయడంతో ఆ బాధ్యతలూ దూరమయ్యాయి. కొద్దిరోజుల తర్వాత మక్కువలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మేడ మెట్లకింద చిన్న కుర్చీవేసుకొని బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులకు బ్యాంకు ఫారాలు నింపుతూ సాయపడేవారు. అలా వారిచ్చిన ఐదు,పది రూపాయలతో రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు సంపాదించేవారు. భాస్కరరావు దీనస్థితిని చూసిన ఆ గ్రామ పెద్దలు ఆయన భార్య లక్ష్మికి అంగన్వాడీ ఆయా గా అవకాశం కల్పించారు. దంపతులిద్దరూ శ్రమిస్తూ అబ్బాయిని బీటెక్, అమ్మాయిని 9వ తరగతి చదివిస్తున్నారు. వారి కుటుంబ జీవితం అలలపై సాగుతున్న నావ. ఆ నావకు సీఎం జగన్మోహన్రెడ్డి దిక్సూచీగా మారారు. 23 ఏళ్లుగా ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తూ డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగ మార్గాన్ని సుగమం చేశారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. సీఎం రూపంలో మా జీవితంలోకి ఉద్యోగ ‘భాస్కరుడు’ ఉదయించాడంటూ సంతోషపడుతున్నారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామని చెబుతున్నారు. (చదవండి: మాటకు కట్టుబడి... జోరుగా సాగుతున్న నాడు నేడు) -
ఎంఎస్ ధోని..S/o సచిన్
రాయ్‌పూర్: సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కదా.. ఎంఎస్ ధోని అంటారేంటి.. అయినా ధోని టీచర్ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవడం ఏంటి అనేగా మీ డౌటు. కానీ మీరు వింటున్నది నిజమే. ఒక ఆకతాయి చేసిన పనితో చత్తీస్ఘడ్ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంటుందో మరోసారి ఈ వార్తతో తెలిసొచ్చింది. అసలే ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక అల్లాడిపోతున్న నిరుద్యోగులు ఇలాంటి దిక్కుమాలిన పనుల వల్ల మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. విషయంలోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా ముఖాముఖి ఇంటర్య్వూకు దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి 15 మంది అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌ను ఎంపిక చేశారు. ఆ షార్ట్ లిస్ట్‌లో తొలిపేరు మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ టెండూల్కర్ , రాజ్పూర్ జిల్లా అని రాసి ఉంది. అప్లికేషన్ ప్రకారం ఎంఎస్ ధోని దుర్గ్‌లోని సీఎస్‌వీటీయూ యునివర్సిటీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. ఇలాంటి పేర్లతో అప్లికేషన్లు వచ్చినప్పడు కనీసం అక్కడి అధికారులు ఒక్కసారి కూడా ఎంక్వైరీ చేసుకోకపోవడం విశేషం. కాగా శుక్రవారం ఆ 15 మందిని ఇంటర్య్వూకు పిలిచారు. అయితే ధోని పేరుతో ఉన్న అభ్యర్థి ఇంటర్య్వూకు రాలేదు. దీంతో అప్లికేషన్లో ఉన్న మొబైల్ నెంబర్‌కు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అప్పుడు విషయం అర్థం చేసుకున్న అధికారులు అప్లికేషన్ నకిలీదని గుర్తించారు. ఈ వ్యవహారం ఇంటర్య్వూకు వచ్చిన మిగతా అభ్యర్థులకు తెలియడంతో దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ధోని పేరుతో దరఖాస్తు ఎలా వచ్చిందా అని తలలు పట్టుకున్న అధికారులు అది నకిలీ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బిహార్‌లో టీచర్ జాబ్‌కు ఎంపికైన విషయం వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. -
టీచర్ ఉద్యోగం రాదని యువతి ఆత్మహత్య
రామారెడ్డి(ఎల్లారెడ్డి): ‘‘ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఐదేళ్లుగా కష్టపడి చదువుతున్నా.. ఆ చదువుకు ఫలితం లేకుండా పోయింది. ఓఎంఆర్ షీట్లో వరుస క్రమం తప్పి పొరపాటు చేశాను. జీవితంలో ఉపాధ్యాయ ఉద్యోగం తప్ప మారేదాన్ని ఊహించుకోలేను’’అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన జపా సుప్రియ(24) సెకండరీ గ్రేడ్ టీచర్ కావాలన్న లక్ష్యంతో ఐదేళ్లుగా చదువుతోంది. ఆదివారం ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (ఎస్జీటీ) రాసింది. కాగా, సోమవారం విడుదలైన కీ ని చూసుకుని నివ్వెరపోయింది. పరీక్ష హాల్లో సమయం గడిచిపోతోందన్న తొందరలో ఓఎంఆర్ షీట్లో ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్న జవాబు వేసినట్లు గుర్తించింది. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇలాగే జవాబులు రాయడంతో మనో వేదనకు గురైంది. ఇక తనకు ఉద్యోగం రాదని కలత చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో చేసిన పొరపాటుకు శిక్ష విధించుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తండ్రి లింగారెడ్డి దుబాయ్‌లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
రాజు ది గ్రేట్
జ్ఞానం మూడో నేత్రం అంటారు. మరీ ముఖ్యంగా అంధులకు చదువు చాలా ముఖ్యం. కళ్లతో లోకాన్ని చూడలేకపోయినా ఆత్మస్థైర్యం, పట్టుదలతో ప్రపంచాన్ని జయించగలరు. అంధులకు ప్రత్యేకంగా బ్రెయిలీ లిపి కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ జీవితమే దీనికి ఉదాహరణ. తన మూడు సంవత్సరాల వయస్సులోనే ఒక ప్రమాదంలో ఆయన చూపు కోల్పోయారు. కానీ ఆత్మస్థైర్యాన్ని వీడక బ్రెయిలీ పేపర్ మీద ఎత్తు చుక్కల ఆధారంగా ఒక భాష రూపొందించారు. ఈ చుక్కలను స్మర్శించడం ద్వారా కనిపించకపోయినప్పటీకీ చదివేలా లిపి రూపొందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నేడు ఆ చుక్కల భాషే ఎందరో అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన అంధ ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజుది ఇటువంటి ఆదర్శప్రాయమైన జీవితమే. నేడు లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆ వివరాలు ఇలా.. జంగారెడ్డిగూడెం రూరల్ :కంటి చూపు కోల్పోయినా పట్టుదలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయుడు మల్లాబత్తుల పోతురాజు. మేనరికం కారణంగా బాల్యం నుంచి చూపుకు దూరమైనా ఎంతో కష్టపడి పీజీ స్థాయి వరకు చదువుకొని తాను విద్యనభ్యసించిన పాఠశాలలోనే ఉపా«ధ్యాయుడిగా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మల్లాబత్తుల పోతురాజు ఇదే గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల మెయిన్‌లో 7 వ తరగతి వరకు విద్యనభ్యసించారు. అనంతరం 8 నుంచి టెన్త్ వరకు హైదరాబాద్‌లోని జీబీహెచ్‌ఎస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ మలక్‌పేటలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో, పీజీ ఉస్మానియాలో, బీఈడీ నల్లగొండలో విద్యనభ్యసించారు. 2001 డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన అనంతరం పోతురాజు మాస్టారు 2002 జనవరిలో పోలవరం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2003 నుంచి జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి తన స్వగ్రామమైన శ్రీనివాసపరంలో ఉన్న తాను చదివిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బా«ధ్యతలు చేపట్టారు. తన సొంత గ్రామంలో, చదివిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయడం పోతురాజు జీవితంలో మరిచిపోని అనుభూతిగా నిలిచింది. పోతురాజు బ్రెయిలీ ద్వారా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆకట్టుకునే విద్యాబోధన పోతురాజు మాస్టారు విద్యాబోధన అంటే విద్యార్థులకు ఎంతో ఆసక్తి. అంధత్వం ఉన్నా పాఠ్యాంశాలకు సంబంధించిన బ్రెయిలీ పుస్తకాలను తెప్పించుకుని మరీ విద్యను బోధిస్తున్నారు. బ్రెయిలీ పుస్తకంలో చుక్కలను చేతితో తాకుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. బోర్డు దగ్గరగా తన కళ్లను పెట్టి అక్షరాలను కూడా అవలీలగా రాస్తూ విద్యాబోధన చేస్తున్నారు. 2012 సంవత్సరంలో పోతురాజు మాస్టారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. నా ఆత్మస్థైర్యమే నన్ను నడిపించింది నాకు చిన్ననాటి నుంచి అంధత్వం ఉన్నా ఏనాడు కుమిలిపోలేదు. ఆత్మస్థైర్యంతో చదివి అనుకున్నది సాధించాను. నా తల్లితండ్రులైన రాములు, సీతల ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. నా స్వగ్రామంలో నేను చదవిన పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది. వైకల్యం కలిగిన వారిని చూసి అయ్యో పాపం అనేదాని కన్నా.. చేతనైనా సాయం చేస్తే ఎంతో మేలు చేసినవారవుతారు. –మల్లాబత్తుల పోతురాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు -
ఎందుకిలా తరచూ తలనొప్పి..?
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. గత కొన్ని రోజుల నుంచి తీవ్రంగా తలనొప్పి వస్తోంది. క్లాస్‌రూమ్‌లో పిల్లల గోల, పని ఒత్తిడితో తరచూ తలనొప్పి వస్తున్నదేమోనని కుటుంబసభ్యులు అంటున్నారు. ఇంటి దగ్గర డాక్టర్‌ను సంప్రదించి కొన్ని మందులు వాడాను. కొంత ఉపశమనం ఉన్నప్పటికీ మళ్లీ తలనొప్పి తీవ్రంగా వస్తోంది. ఇంత ఎక్కువగా తలనొప్పి రాకూడదని ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవమని ఫ్రెండ్స్ సలహా ఇస్తున్నారు. అసలు నాకు తలనొప్పి ఎందుకు వస్తోంది? నేనేవరిని సంప్రదించాలి? పరిష్కారం చూపండి. - వీణ, వైజాగ్ తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, రక్తప్రసరణలో మార్పులు, మెదడులో కణుతులు లాంటి అనేక కారణాలతో తలనొప్పి తీవ్రంగా రావచ్చు. మీరనుకుంటున్నట్లు వృత్తిరీత్యా వచ్చే తలనొప్పులు కూడా ఉంటాయి. అయితే మీకు ఒకవైపు తలనొప్పి వస్తోందా లేక రెండువైపులా వస్తోందా అన్నది మీ లేఖలో వివరించలేదు. అలాగే మీకు తలనొప్పి వచ్చినప్పుడు తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం లాంటి లక్షణాలు ఉన్నాయా అన్న అంశం కూడా తెలుపలేదు. ఒకవేళ మీరు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు పైన తెలిపిన లక్షణాలు కూడా ఉంటే మీకు మైగ్రేన్ ఉన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే స్త్రీలతో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఉద్యోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, పని ఒత్తిడితో మీ తలలోని రక్తనాళాలు ఒత్తిడి గురికావడం వల్ల కూడా మీకీ మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా కేవలం తీవ్రమైన తలనొప్పితో తరచూ బాధపడుతుంటే మాత్రం విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మీరు వెంటనే నిపుణులైన న్యూరాలజీ స్పెషలిస్ట్‌ను కలవండి. మీ తలనొప్పికి కారణాన్ని తెలుసుకోవడానికి రక్తపరీక్ష, సీటీ స్కాన్ లాంటి కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. మీ అసలు కారణాన్ని తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారు. ఒకవేళ మీకు మరింకేదైనా క్లిష్టమైన సమస్య ఉన్నా ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన అధునాతనమైన పురోగతి వల్ల మీకు మరింత మెరుగైన చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకుంటూ, మీ జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ కుటుంబపరంగా, వృత్తిపరంగా ఏమైనా ఒత్తిళ్లు ఉంటే వాటి నుంచి బయటపడేందుకు తగిన ప్రయత్నాలు చేయండి. డాక్టర్ జి.రాజశేఖర్‌రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజీగూడ, హైదరాబాద్ బ్రాంకైటిస్ తగ్గుతుందా..? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. కొంతకాలంగా కఫం, దగ్గుతో బాధపడుతున్నాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోంది. డాక్టర్ సంప్రదిస్తే బ్రాంకైటిస్ అన్నారు. మందులు వాడుతున్నప్పుడు ఉపశమనం ఉంటోంది. హోమియో ద్వారా సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. - నిరంజన్, మదనపల్లి శ్వాసనాళాల్లోకి ప్రవేశించి మార్గం ట్రాకియా రెండుగా చీలి ఉంటుంది. వీటిని ‘బ్రాంకై’ అంటారు. ఇవి మళ్లీ అతి సన్నటి భాగాలుగా విభజితమై ఉంటాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఇవి ఆల్వియోలై అనే అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తుల్లోకి చేరే శ్వాసనాళాల లోపలి భాగంలో శ్లేష్మపు పొర ఉంటుంది. ఏ కారణం చేతనైనా వీటిలో వాపునకు గురికావడాన్ని బ్రాంకైటిస్ అంటారు. వారం నుంచి మూడు వారాల పాటు బ్రాంకైటిస్ లక్షణాలు ఉంటే ఆ స్థితిని అక్యూట్ బ్రాంకైటిస్ అని, ఏడాదిలో మూడు నెలల పాటు దగ్గు, తెమడ ఉంటే క్రానిక్ బ్రాంకైటిస్ అని అంటారు. పొగతాగడం, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇన్ఫెక్షన్స్ వంటి అనేక కారణాల వల్ల బ్రాంకైటిస్ వస్తుంది. జన్యుసంబంధమైన అంశాలు, సిస్టిక్ ఫైబ్రోసిస్, గుండెజబ్బులు, రోగనిరోధక శక్తి లోపించడం వంటి ఇతర కారణాలతోనూ బ్రాంకైటిస్ వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు : కఫంతో కూడిన దగ్గు; కఫం తెలుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండి కొన్ని సందర్భాంల్లో రక్తంతో కూడిన తెమడ పడుతుండవచ్చు. ఆయాసం, శ్వాస తీసుకునే సమయంలో పల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం; నీరసం, గొంతునొప్పి, కండరాల నొప్పి, ముక్కుదిబ్బడ, తలనొప్పి, దీర్ఘకాలంగా దగ్గు వల్ల ఛాతీనొప్పి, జ్వరం వంటి లక్షణాలనూ గమనించవచ్చు. చికిత్స : అన్ని దశలలోని బ్రాంకైటిస్ సమస్యకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. జెనెటిక్ వైద్య విధానం ద్వారా దీర్ఘకాలికంగా వచ్చే దగ్గు, తెమ వంటి లక్షణాలను తగ్గించడమే గాకుండా శ్వాసనాళంలోని ఇన్ఫ్లమేషన్ లేదా వాపును తగ్గించడం జరుగుతుంది. హోమియో మందుల ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచి బ్రాంకైటిస్‌ను మళ్లీ రాకుండా చేయడం సాధ్యమవుతుంది. రోగి మానసిక, శారీరక లక్షణాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, అనువంశీకంగా ఉండే లక్షణాల వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వైద్యచికిత్స అందించడం ద్వారా కేవలం రోగ లక్షణాలను మాత్రమే కాకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
నకిలీ ధ్రువపత్రంతో టీచర్ ఉద్యోగం
శ్రీకాకుళం: జిల్లాలో ఇటీవల భర్తీ చేసిన డీఎస్సీ-14లో ఎస్జీటీ కేటగిరీ నుంచి ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థి నకిలీ ధ్రువపత్రం సమర్పించారని, మరో అభ్యర్థి జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. కింతలి అన్నపూర్ణ అనే అభ్యర్థి తనకు అంధత్వం ఉన్నట్టు ధ్రువీకరణపత్రం జతచేసి ఉద్యోగం పొందిందని కూర్మాపు మీన ఫిర్యాదులు పేర్కొంది. 2012లో ఇదే అభ్యర్థి మెదక్ జిల్లా నుంచి డీఎస్సీ పరీక్ష రాసినప్పుడు బీసీ-ఎ జనరల్ అభ్యర్థిగా పరీక్ష రాశారని, 2014 డీఎస్సీ సరికి వికలాంగ ధ్రువీకరణ పత్రంతో ఎలా పరీక్ష రాశారన్నదానిపై విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. ఈ వికలాంగురాలి పత్రం నకిలీదని తేలిస్తే డి.జయశ్రీ అనే నిజమైన వికలాంగురాలు ఉద్యోగం పొందుతుందని తెలిపారు. దీనిపై అధికారులు లోతైన దర్యాప్తు జరిపిస్తే ఫిర్యాదు వాస్తవమా, కాదా అన్నది తేటతెల్లమయ్యే అవకాశాలున్నాయి. ముస్లిం మైనారిటీ అభ్యర్థుల ఫిర్యాదు ఇదిలా ఉంటే ఓ ఇద్దరు ముస్లిం మైనారిటీ అభ్యర్థులు ఇటీవల కలెక్టర్‌కు ఓ ఫిర్యాదు చేశారు. తాము బీసీ-ఇ కేటగిరీకి చెందినవారమని, పొరపాటునో, మరో కారణంగానో బీసీ-బిగా నమోదైందని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తహసీల్దార్ ద్వారా విచారణ చేరుుంచి, ఇద్దరు అభ్యర్థులు బీసీ-ఇ కేటగిరీకి చెందినవారుగా నిర్ధారించారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణరుుంచి, అంతకుముందు బీసీ-ఇ కేటగిరీ నుంచి ఎంపిక చేసిన ఇద్దరు అభ్యర్థులను తప్పించాలని ఆదేశించారు. అయితే, వీరిద్దరు కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ తమ స్థానాల్లో ఉద్యోగం ఇవ్వాలని చూస్తున్న అభ్యర్థులు బీసీ-ఇ కేటగిరీకి చెందినవారు కాదని ఆరోపించారు. దీంతో అధికారులు ఈ విషయంపై విచారణ జరిపించేందుకు డీఆర్ఓకు నివేదించారు. డీఆర్ఓ నుంచి నివేదిక అందిన తరువాత ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా ఫిర్యాదు అందినమాట వాస్తవమేనన్నారు. అయితే రిఫరల్ ఆస్పత్రి నుంచి కూడా 40 శాతం అంగవైకల్యంతో ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. మైనారిటీల విషయమై డీఆర్ఓకు నివేదించినట్టు చెప్పారు. -
మెరిసిన మౌనిక
► ఎంపీసీలో 984 మార్కులు సాధించిన విద్యార్థిని ► ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులకు బ్రేక్ పాలకుర్తి : కష్టాలు ఎదురైనా.. పేదరికం వెక్కిరించినా.. ఆమె ధైర్యం కోల్పోలేదు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తోటి విద్యార్థుల కు ఆదర్శంగా నిలిచింది. మండల కేంద్రానికి చెందిన పన్నీరు మౌనికది నిరుపేద కుటుంబం. 8వ తరగతిలో ఉండగానే ఆమె తండ్రి అనారోగ్యం తో మృతి చెందాడు. దీంతో తల్లి సరోజన పాలకుర్తి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంచార గాజుల దుకాణం నిర్వహిస్తూ కూతురుతోపాటు కొడుకును పోషిస్తుంది. అరుుతే మౌనిక రెండేళ్ల క్రితం పదో తరగతి పరీక్షలో మంచి మార్కులు సాధించడంతో వరంగల్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల నిర్వాహకులు ఆమెకు ఎంపీసీలో ఉచి తంగా సీటు ఇచ్చారు. దీంతో ఈ ఏడాది జరిగిన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఆమె 984/1000 మార్కులు సాధించి సత్తా చాటుకుంది. అరుుతే ఇంటర్లో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికం కారణం గా మౌనిక చదువుకు స్వస్తి చెప్పి తల్లివెంట గాజులు అమ్మేందుకు వెళ్తుం ది. ప్రభుత్వం తనను ఆదుకుని చదివిస్తే టీచర్ ఉద్యోగం సంపాదిస్తానని చెబుతోంది. ఇదిలా ఉండగా, మౌనిక అన్నయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. -
‘రాజీ’కి వచ్చిన అత్తమామలపై దాడి
రామగుండం: పెళ్లయిన మూడు నెలలకే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడంతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 2011లలో మండలంలోని లింగాపూర్‌లో చోటు చేసుకుంది. భార్య మృతికి కారకుడైన భర్తపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ట్రయల్‌కు రావడంతో సదరు ఉపాధ్యాయుడు అత్తమామలతో రాజీ కుదుర్చుకునేందుకు రావడంతో చెల్లిని చంపి రాజీకి వచ్చారా? అంటూ మృతురాలి సోదరుడు అత్తామామలపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం లింగాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై విద్యాసాగర్ కథనం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గాలిపెల్లి ఎల్లయ్య కూతురు శ్యామలను 2011లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలంలోని చిన్నబోజాల గ్రామానికి చెందిన మేనల్లుడు మోకెనపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లయిన మూడు నెలలకే శ్రీనివాస్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక శ్యామలను అదనపు కట్నం పేరుతో శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె జూలై 2012న తల్లి గారిల్లైన లింగాపూర్‌కు వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కూతురు మృతికి కారణమైన అల్లుడిపై గాలిపెల్లి ఎల్లయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మోకెనపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచులు భూమక్క, నర్సక్కలపై 498(ఎ), 304(బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కేసు జిల్లా సెషన్‌కోర్టులో నడుస్తోంది. ఈ మధ్యలో ట్రయల్ రావడంతో మోకెనపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు మోకెనపల్లి రాజలింగం, దేవమ్మలతో పాటు లింగాపూర్‌కు చెందిన సమీప బంధువులు మోకెనపల్లి నారాయణ, మోకెనపల్లి బాలకృష్ణ, గోగెర్ల శేఖర్ తదితర పెద్దమనుషుల సహాయంతో ఆదివారం మృతురాలి తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకొని కేసును కొట్టివేయించుకునేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు గాలిపెల్లి శ్రీనివాస్ ఒక్కసారి ఆవేశానికి లోనయ్యాడు. చెల్లెలు మృతికి కారకుడై ఉండీ కేసును కొట్టేయించుకునేందుకు రాజీకి వచ్చారా? అంటూ మోకెన పల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో గోదావరిఖనికి తరలించారు. డాక్టర్లు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు. అనంతరం దేవమ్మ, రాజలింగంను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా..
ఆమెకు కంటిచూపు లేదు. అయినా బాధపడలేదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంది. ఎవరిపై ఆధారపడకుండా జీవితంలో స్థిరపడాలనుకుంది. పట్టుదలతో ముందుకు సాగింది. కుటుంబపోషణలో నేను సైతం అంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. పులివెందుల ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న వెంకటమహేశ్వరి సొంతగ్రామం వేముల మండలం కె.కె.కొట్టాల. ఈమె తల్లిదండ్రులు ఈశ్వరయ్య, లక్ష్మిదేవి. ఈమె పుట్టుకతోనే అంధురాలు. చూపు లేకపోవడంతో ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఆమె ఏమాత్రం ఎదురుచూడలేదు. చదువుకుని ఉన్నత స్థితికి చే రాలని నిర్ణయించుకుంది. అనంతపురం జిల్లాలో అంధుల పాఠశాలలో చేరింది. బ్రెయిలీ లిపిలో విద్య నేర్చుకుంది. ఆ తర్వాత కళ్యాణదుర్గంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చే వరకు మిన్నకుండకుండా బ్యాక్లాగ్ కోటాలో పులివెందుల మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ఉద్యోగం సాధించింది. రూ. 15 వేలు వేతనం తీసుకుంటూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. ఆమెను న్యూస్‌లైన్ పలకరిస్తే.. ఆత్మవిశ్వాసం.. స్థైర్యంతో భవిష్యత్తులో ఉపాధ్యాయురాలిని కావాలన్నదే తన లక్ష్యమంది. తనలాగా కళ్లులేని వారి గురించి తెలిస్తే వారికి తనవంతు సహాయం.. సహకారం అందిస్తాన ంటోంది. -
ప్చ్.. బీఎడ్
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : ఒకప్పుడు చాలా మంది విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో చేరేవారు. ఈ కోర్సు పూర్తి చేస్తే టీచర్ ఉద్యోగం తప్పక వస్తుందని భావించేవారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. బీఎడ్ అభ్యర్థులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హులుగా పరిగణిస్తుండడంతో కోర్సుకు ఆదరణ తగ్గిపోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు దూరం చేయడం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కూడా నిర్వహిస్తుండడంతో బీఎడ్‌లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీనికి బదులు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)లో గానీ, ఇతర కోర్సుల్లో గానీ చేరడం మేలని భావిస్తున్నారు. ఫలితంగా బీఎడ్ కళాశాలలు వెలవెలబోతున్నాయి. మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఎడ్‌లో ప్రవేశానికి ఈ నెల 13 వరకు తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల 16తో వెబ్ ఆప్షన్ల ఘట్టం పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఎస్కేయూతో పాటు 24 కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 2005, మేనేజ్మెంట్ కోటాలో 635 కలిపి మొత్తం 2,640 సీట్లు ఉన్నాయి. ఇందులో ఎస్కేయూ కళాశాలలో 100, సరస్వతి కళాశాల(అనంతపురం)లో 160, నాలుగు కళాశాలల్లో 120 చొప్పున, మరో 19 కళాశాలల్లో వంద చొప్పున సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలోని 2005 సీట్లకు గాను తొలి విడతలో 1,419 మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్‌కూ ఆదరణ కరువే బీఎడ్‌లో ఫిజికల్ సైన్సు మెథడాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకూ ఆదరణ కరువైంది. అన్ని కళాశాలల్లో రెండంకెల సీట్లు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. కోర్సులో చేరినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇస్తుందో, లేదోననే సందేహంతో పలువురు విద్యార్థులు వెనకడుగు వేశారని తెలుస్తోంది. ఆయా మెథడాలజీల్లో కనీసం పది మంది కూడా చేరకపోతే కళాశాలలు ఎలా నడపగలమని నిర్వాహకులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఇంగ్లిష్‌కు సంబంధించి ఎనిమిది కళాశాలల్లో ఎవరూ చేరలేదు. మరో 12 కళాశాలల్లో ఒక్కరు చొప్పున మాత్రమే చేరారు. ఫిజికల్ సైన్సు మెథడాలజీలో ఎక్కడా ఐదుగురికి మించలేదు. దీన్నిబట్టే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. భర్తీ అయిన సీట్లు ఇవే... కన్వీనర్ కోటా కింద మ్యాథమ్యాటిక్స్ మెథడాలజీలో 501 సీట్లకు గాను 328, ఫిజికల్ సైన్సులో 200కు గాను 95, బయలాజికల్ సైన్సులో 401 సీట్లకు 317, సోషియల్ స్టడీస్‌లో 703 సీట్లకు 646, ఇంగ్లిషులో 200 సీట్లకు 33 మాత్రమే భర్తీ అయ్యాయి. 2005 సీట్లున్న కన్వీనర్ కోటాలోనే 586 మిగిలిపోతే యాజమాన్య కోటాలోని 635 సీట్లను ఎలా భర్తీ చేసుకోవాలోనన్న సందిగ్ధతలో కళాశాలల యాజమాన్యాలు పడ్డాయి.