
రామారెడ్డి(ఎల్లారెడ్డి): ‘‘ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఐదేళ్లుగా కష్టపడి చదువుతున్నా.. ఆ చదువుకు ఫలితం లేకుండా పోయింది. ఓఎంఆర్ షీట్‌లో వరుస క్రమం తప్పి పొరపాటు చేశాను. జీవితంలో ఉపాధ్యాయ ఉద్యోగం తప్ప మారేదాన్ని ఊహించుకోలేను’’అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన జపా సుప్రియ(24) సెకండరీ గ్రేడ్ టీచర్ కావాలన్న లక్ష్యంతో ఐదేళ్లుగా చదువుతోంది.
ఆదివారం ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (ఎస్జీటీ) రాసింది. కాగా, సోమవారం విడుదలైన కీ ని చూసుకుని నివ్వెరపోయింది. పరీక్ష హాల్‌లో సమయం గడిచిపోతోందన్న తొందరలో ఓఎంఆర్ షీట్‌లో ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్న జవాబు వేసినట్లు గుర్తించింది. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇలాగే జవాబులు రాయడంతో మనో వేదనకు గురైంది. ఇక తనకు ఉద్యోగం రాదని కలత చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో చేసిన పొరపాటుకు శిక్ష విధించుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మృతురాలి తండ్రి లింగారెడ్డి దుబాయ్‌లో ఉంటున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment