శ్రీధర్, మౌనిక, నాగరాజు
కాటారం/నర్మెట/వాజేడు: తన కాళ్లపై తను నిలబడాలని తల్లిదండ్రులు మందలించడంతో చేతికి అందివచ్చిన కొడుకు ఇక ఎప్పటికీ అందనంత దూరం వెళ్లిపోయాడు. ధాన్యం విక్రయించేదాకా ఆగమని చెప్పినా వినకుండా, అడిగిన వెంటనే సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చి కానరాని లోకాలకు తరలిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని మనస్తాపంతో ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ ముగ్గురూ ఇరవై ఏళ్లకు అటుఇటుగా ఉన్నవారే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు యువకులు, ఓ యువతి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు.
తల్లిదండ్రులు మందలించారని..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లికి చెందిన సింగనవేణ మధునక్క, ఓదేలు కుమారు డు శ్రీధర్(23) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 12న పొలం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు.
సెల్ ఫోన్ కొనివ్వలేదని..
జనగామ జిల్లా నర్మెట మండలం కన్నెబోయినగూడెంకు చెందిన కీర్తి ఉప్పలమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. భర్త యాదగిరి 22 ఏళ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం చేస్తూ పిల్లలను పోషించుకుంటూ పెద్ద కూతురు, కుమారుడి వివాహాలు జరిపించింది. చిన్నకూతురు మౌనిక (23) తల్లిని ఇటీవల సెల్‌ఫోన్ కొనివ్వమని అడిగింది. ఇప్పుడు డబ్బులు లేవు.. ధాన్యం విక్రయించాక కొనిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 7న గడ్డి మందుతాగింది. హైదరాబాద్ నిమ్స్‌లో పరిస్థితి విషమించి మృతి చెందింది.
బైక్ రిపేర్ చేయించలేక పోయానని..
ములుగు జిల్లా వాజేడు మండలం ఏడ్జర్లపల్లికి చెందిన అంకని నాగరాజు(20) మూడే ళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ చేశాడు. ఆ సమయంలో ఆవతలి వ్యక్తి స్కూటీ దెబ్బతింది. పెద్ద మనుషుల పంచాయితీలో స్కూటీ బాగు చేసి ఇస్తా నని నాగరాజు హామీ ఇచ్చాడు. వెంటనే స్థానిక మెకానిక్‌కు ఇచ్చాడు. కానీ, మెకానిక్ ఇప్పటివరకు స్కూటీని మరమ్మతు చేసి ఇవ్వలేదు. స్కూటీని తిరిగి ఇవ్వలేకపోతున్నానని మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారంరాత్రి పురుగుల మందు తాగాడు. ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment