Bhupalapalli District
-
చిన్న, చిన్న కారణాలకే.. ఉసురు తీసుకున్నారు!
కాటారం/నర్మెట/వాజేడు: తన కాళ్లపై తను నిలబడాలని తల్లిదండ్రులు మందలించడంతో చేతికి అందివచ్చిన కొడుకు ఇక ఎప్పటికీ అందనంత దూరం వెళ్లిపోయాడు. ధాన్యం విక్రయించేదాకా ఆగమని చెప్పినా వినకుండా, అడిగిన వెంటనే సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చి కానరాని లోకాలకు తరలిపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని మనస్తాపంతో ఓ యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ ముగ్గురూ ఇరవై ఏళ్లకు అటుఇటుగా ఉన్నవారే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఇద్దరు యువకులు, ఓ యువతి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు మందలించారని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లికి చెందిన సింగనవేణ మధునక్క, ఓదేలు కుమారు డు శ్రీధర్(23) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఏదైనా పనిచేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 12న పొలం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగాడు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. సెల్ ఫోన్ కొనివ్వలేదని.. జనగామ జిల్లా నర్మెట మండలం కన్నెబోయినగూడెంకు చెందిన కీర్తి ఉప్పలమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. భర్త యాదగిరి 22 ఏళ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం చేస్తూ పిల్లలను పోషించుకుంటూ పెద్ద కూతురు, కుమారుడి వివాహాలు జరిపించింది. చిన్నకూతురు మౌనిక (23) తల్లిని ఇటీవల సెల్‌ఫోన్ కొనివ్వమని అడిగింది. ఇప్పుడు డబ్బులు లేవు.. ధాన్యం విక్రయించాక కొనిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 7న గడ్డి మందుతాగింది. హైదరాబాద్ నిమ్స్‌లో పరిస్థితి విషమించి మృతి చెందింది. బైక్ రిపేర్ చేయించలేక పోయానని.. ములుగు జిల్లా వాజేడు మండలం ఏడ్జర్లపల్లికి చెందిన అంకని నాగరాజు(20) మూడే ళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ చేశాడు. ఆ సమయంలో ఆవతలి వ్యక్తి స్కూటీ దెబ్బతింది. పెద్ద మనుషుల పంచాయితీలో స్కూటీ బాగు చేసి ఇస్తా నని నాగరాజు హామీ ఇచ్చాడు. వెంటనే స్థానిక మెకానిక్కు ఇచ్చాడు. కానీ, మెకానిక్ ఇప్పటివరకు స్కూటీని మరమ్మతు చేసి ఇవ్వలేదు. స్కూటీని తిరిగి ఇవ్వలేకపోతున్నానని మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారంరాత్రి పురుగుల మందు తాగాడు. ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు. -
పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు మృతి చెందాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బైక్ ఎన్ఓసీ విషయంలో బాలిజీ మోటర్స్ షోరూం యజమానితో ఈ నెల 10న ప్రశాంత్, శ్రావన్ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. దీనిపై షోరూం యజమాని గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశాంత్, శ్రావన్‌లను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధింపులు భరించలేకనే ఈ నెల 12 న ప్రశాంత్ పోలిసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. 12 రోజులుగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. ఈ ఘటనలో గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్, షోరూం యజమానిపై కేసులు నమోదు అయ్యాయి. ఎస్ఐ ఉదయ్‌కిరణ్‌కు సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
తిక్క రేగితే జైల్‌భరో చేస్తాం: రేవంత్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బదిలీని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన ఓ గిరిజన ప్రధానోపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాలనుకుంటే తమను నిర్బంధించారని మల్కాజ్గిఞరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తమకు తిక్క రేగితే జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని అన్నారు. పోలీసులతో కేసీఆర్ తమను అడ్డుకోవాలని చూస్తున్నారని, అందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులను అడ్డుకుంటారని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలో టీపీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో జరగనున్న ‘రైతులతో రచ్చబండ’కార్యక్రమానికి వెళ్లకుండా శుక్రవారం ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున పోలీసులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి చేరుకొని ఆయనను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి సమాచారం లేకుండా, లోక్‌సభ సభ్యుడిననే ప్రోటోకాల్ పాటించకుండా ఇలా ఇంటిని ముట్టడించడం ఏంటంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్న రేవంత్ పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పౌరస్వేచ్ఛను కేసీఆర్ సర్కారు హత్య చేస్తోంది, ప్రజాగ్రహం పెల్లుబి కిననాడు ప్రగతిభవన్‌లు, ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయి కేసీఆర్.. జాగ్రత్త’అంటూ హెచ్చరించారు. తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు... ఇలా ఏ వర్గమూ సంతోషంగా లేరని వ్యాఖ్యా నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యో గుల విభజన చేస్తున్నారని, స్థానికతను, ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనలను పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లడం సరైంది కాదన్నారు. కేసీఆర్, ఆయన తనయుడు, కేటీఆర్‌లకు ఉరేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. స్పీకర్‌కు ట్విట్టర్ లేఖ పోలీసులు తనను అడ్డుకుని గృహ నిర్బంధం చేయడంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు రేవంత్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా లేఖ రాశారు. ‘ఈ రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచి పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టి మోహరించారు. ఈ వారంలో ఇలా పోలీసులు మోహరించడం ఇది రెండోసారి. సమస్యల్లో రైతులతో మాట్లాడకుండా నన్ను అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాను’అని రేవంత్ తన ట్వీట్లో ఓం బిర్లాను కోరారు. -
Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..!
ప్రాణహిత, గోదావరి, కిన్నెరసాని నదుల వెంట ప్రయాణాన్ని సాగించిన మగ పులి ఆడతోడు కోసమే ఇటువైపుగా వచ్చినట్లు తెలుస్తోంది. 26 రోజులపాటు సాగిన ప్రయాణంలో తోడు దొరకకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు వెళ్తున్నట్లు దాని గమనం చూస్తుంటే స్పష్టమవుతోంది. ఈ పులి సిర్పూర్ ప్రాంతానికి చెందినదని, పేరు ఎస్–8 అని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ మగపులి ఉమ్మడి జిల్లాలో సాగించిన ప్రయాణం.. దాని ప్రత్యేకతలు, ఎందుకు.. ఎలా వచ్చిందన్న దానిపై ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనం.. – పోతరాజు రవిభాస్కర్, భూపాలపల్లి మహారాష్ట్రలోని తాడోబా రిజర్వ్ ఫారెస్ట్‌లో పుట్టిన ఈ మగపులి ప్రస్తుతం ఏడు నుంచి ఎనిమిదేళ్లు ఉంటుంది. రెండేళ్ల వయసులో తల్లినుంచి దూరమై అక్కడినుంచి కుమురం భీం జిల్లాలోని సిర్పూర్ ప్రాంతానికి వచ్చింది. అక్కడి అటవీశాఖ అధికారులు దీనిని గుర్తించి ఎస్–8గా నామకరణం చేశారు. పులులు అభయారణ్యంలో సుమారు 25 నుంచి 30 చదరపు కిలోమీటర్లు తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ తాను ఉన్న విషయాన్ని గుర్తించేలా ఆ ప్రాంతం చుట్టూ మలం, మూత్రం విసర్జిస్తుంది. మూత్రం ఎక్కువ కాలంపాటు రసాయనాల మాదిరిగా వాసన వస్తుంది. దీంతో అటువైపు ఇతర జంతువులు, పులులు రావు. కొన్ని సందర్భాల్లో బలమైన పులి వెళ్లి దాడికి పాల్పడినప్పుడు, అక్కడి పులి తన తోడును వదిలి దూరంగా వచ్చేస్తుంది. ఈ మాదిరిగానే ఎస్–8 పులి వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మేటింగ్ సీజన్ కావడంతో... పులులకు చలికాలంలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మేటింగ్(సంభోగం) సీజన్.. దీంతో సిర్పూర్ నుంచి బయలుదేరిన ఎస్–8 మేటింగ్ చేసేందుకు ఆడపులిని వెతుక్కుంటూ వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల అడవుల్లో తిరిగింది. ఆడతోడు కానరాకపోవడంతో తిరిగి సిర్పూర్‌కు బయలుదేరింది. ఎస్–8గా ఎలా గుర్తించారంటే.. సాధారణంగా పాదముద్రలు(పగ్‌మార్క్స్) ఆధారంగా పులిని గుర్తించి ఆడదా, మగదా అని నిర్ధారిస్తారు. పులుల చర్మంపై చారలు వేర్వేరుగా ఉంటాయి. ఒక పులి చారలను మరో పులి పోలి ఉండదు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పులిని మొదటిసారి గుర్తించిన చోటే దానికి నామకరణం చేస్తారు. 2020, అక్టోబర్ 11న సిర్పూర్ అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాకు చిక్కిన, ములుగు జిల్లా మంగపేట అడవిలో గత నెలలో సీసీ కెమెరాకు చిక్కిన పులి చారలు ఒకే మాదిరిగా ఉన్నాయి. దీంతో అది సిర్పూర్ నుంచి వచ్చిన ఎస్–8గా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించుకున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్ఈటర్ కాదని అటవీశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఒక పులి భూపాలపల్లి మీదుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగి తోడు దొరకకపోవడంతో మళ్లీ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మీదుగా సిర్పూర్ అడవులకు తిరిగి వెళ్లింది. అయితే గతంలో ఆ పులి ఎక్కడా కనిపించలేదు. దీంతో దానికి ఎం(ములుగు)–1గా నామకరణం చేశారు. ►గురువారం రాత్రి భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. భూపాలపల్లి జిల్లాలోని అడవుల మీదుగా కాళేశ్వరం గోదావరి వరకు వెళ్లి, నది దాటి తిరిగి సిర్పూర్ వైపునకు వెళ్లనున్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ►30న ములుగు అడవుల్లోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన రాత్రి ములుగు మండలం ఇంచర్ల గ్రామ సమీపంలో గల ఎన్‌హెచ్ 163 రహదారి దాటింది. తాజాగా గురువారం వెంకటాపూరం(ఎం) మండలం రామకృష్ణాపూర్ అడవిలో పులి అడుగులను గుర్తించారు. ►29వ తేదీన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటమీదుగా పాకాలకు చేరుకుంది. కొత్తగూడ వెళ్లే దారిలో రోడ్డుదాటుతుండగా ఇద్దరు వాహనదారులు గమనించి భయంతో పరిగెత్తారు. పులి ఆ రోజు మొత్తం ప్రయాణం సాగించింది. ►ఎస్–8 పులి సిర్పూర్ నుంచి అక్టోబర్ చివరి వారంలో బయలుదేరి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రలోని సిరొంచకు చేరుకుంది. అదే నెల 28వ తేదీన మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా పరిధిలోని పెంటిపాక గ్రామ సమీప అడవిలో పశువుల కాపరి దుర్గం మల్లయ్య(48)పై దాడి చేసి చంపింది. సుమారు వారం రోజులు అదే ప్రాంతంలో ఉంది. ►25వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు చేరుకొని గూడూరు మండలం నేలవంచ సమీప అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన రెండు లేగదూడలపై దాడి చేసి చంపింది. అనంతరం మూడు రోజులు అక్కడే ఉంది. ►12వ తేదీన మంగపేట నుంచి నర్సింహాపూర్ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి చేరుకుంది. అక్కడ పినపాక మండలం అమరారం సమీప అడవిలో పశువుల మందపై దాడి చేసి ఒక ఆవుని చంపింది. ఆజిల్లా అడవుల్లో సుమారు 12 రోజులు గడిపింది. ►8వ తేదీ రాత్రి ములుగు జిల్లాలోకి ప్రవేశించింది. రెండు రోజులపాటు ప్రయాణం చేస్తూ తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి, కామారం మీదుగా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామం చింతలమోరి వద్ద గల రోడ్‌ను క్రాస్ చేసి హీరాపూర్, తొండ్యాల లక్ష్మీపురం మీదుగా మంగపేట మండలంలోకి 11వ తేదీన చేరింది. ►గత నెల 7న గోదావరి నది దాటి కాళేశ్వరం, పలిమెల మీదుగా భూపాలపల్లి మండలంలోని దూదేకులపల్లి శివారు అడవిలో గల మద్దిమడుగుకు 8వ తేదీన చేరుకుంది. -
కొత్త రేషన్ కార్డులు నేటి నుంచి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.09 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు అందజేయనుంది. భూపాలపల్లి జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ప్రతీ మండల కేంద్రంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారని మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లికేషన్ లేకుండా అన్నింటిని పరిశీలించి కార్డులు జారీ చేశామన్నారు. ఈ 3.09 లక్షల కార్డుల ద్వారా 8,65,430 మంది లబ్ధిదారులు నూతనంగా ప్రతీ నెల 6 కిలోల బియ్యాన్ని పొందనున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ నెలకు 5,200 మెట్రిక్ టన్నులతో ఏడాదికి 62,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఉన్న కోటాకు అదనంగా పౌరసరఫరాల శాఖ అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం ఏటా ప్రభుత్వం రూ.168 కోట్లు అదనంగా వెచ్చించనుందన్నారు. ఇప్పటికే ఉన్న 87.41 లక్షల కార్డులకు కొత్తవి జత కావడంతో వాటి సంఖ్య 90.50 లక్షలకు చేరనుండగా, మొత్తం లబ్ధిదారులు 2.88 కోట్లు ఉంటారని చెప్పారు. బియ్యం పంపిణీకి ఏటా ప్రభుత్వం రూ.2,766 కోట్లు వెచ్చిస్తోందని వివరించారు. -
బ్లాక్ ఫంగస్: కన్ను తొలగించిన వైద్యులు, సాయం కోసం ఎదురుచూపు
సాక్షి, కాళేశ్వరం: బ్లాక్ ఫంగస్ ఓ రైతు కుటుంబాన్ని కకావికలం చేసింది. చికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చు చేయగా.. ప్రస్తుతం మందుల కోసం రోజుకు రూ.60 వేలు అవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబం.. ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి చెందిన రైతు వావిలాల సమ్మయ్య (42) గత నెలలో కరోనా రక్కసితో పోరాడి కోలుకున్నాడు. ఇంతలోనే పక్షవాతం రావడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సాధారణ స్థితికి చేరుకున్నాడు. గోరుచుట్టపై రోకలి బండలా.. వారం తర్వాత దురద మొదలై కుడి కన్ను ఎర్రగా మారింది. హన్మకొండ, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. ‘‘కంటికి ఇన్ఫెక్షన్ అయింది.. కుడి కన్నుపూర్తిగా తొలగించాలి.. లేదంటే ప్రాణానికి ప్రమాదం’అని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు తమకున్న మూడెకాల పొలాన్ని తనఖా పెట్టి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశారు. శస్త్ర చికిత్స చేసి వైద్యులు కుడి కన్నును తొలగించారు. మూడు రోజుల క్రితం బాధితుడిని డిశ్చార్జి చేశారు. పది రోజుల వరకు మందులు వాడాలని సూచించారు. అయితే.. రోజుకు రూ.60 వేల వరకు మందులకు ఖర్చు అవుతోందని, కూలి పనులు చేసుకునే తమకు అంతటి శక్తి లేదని ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని సమ్మయ్య భార్య పద్మ, పిల్లలు వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8008240915లో సందప్రదించాలని కోరారు. చదవండి: (టాయిలెట్ ద్వారా కరోనా వ్యాపిస్తుందా?) (బ్లాక్‌ఫంగస్ చికిత్సకు తీవ్ర కొరత.. మందులు తక్కువ.. బాధితులెక్కువ..!) -
సింగరేణిలో విషాదం: రూఫ్ కూలి ఇద్దరు దుర్మరణం
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి బొగ్గుగనుల్లో విషాదం ఏర్పడింది. పనులు చేస్తున్న సమయంలో బండ కూలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలోలోని కాకతీయ 6వ బొగ్గు గనిలో జరిగింది. అయితే చీకటి పడడంతో వారికి సహాయక చర్యలు చేపట్టడానికి ఆలస్యమైంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. కాకతీయ 6వ బొగ్గు గనిలో 2వ షిఫ్ట్‌లో విధులు నిర్వహించేందుకు సపోర్ట్ మెయిన్ కార్మికులు శంకరయ్య నరసయ్య వచ్చారు. పనులు చేస్తున్న సమయంలో పై నుంచి ఒక్కసారిగా బండ (రూఫ్) కూలి వారిద్దరిపై పడింది. తీవ్ర గాయాలపాలయ్యారు. దీన్ని గుర్తించి వెంటనే తోటి కార్మికులు, అధికారులు స్పందించి వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న సింగరేణి అధికారులు చేపట్టారు. చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మృతదేహాలను లోపలి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు. -
ప్రియురాలి సమాధి వద్ద ప్రియుడి ఆత్మహత్య
సాక్షి, భూపాలపల్లి: ప్రియురాలి లేని జీవితం వ్యర్థం అనుకున్నాడో యువకుడు. ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి అనారోగ్యంతో మృతి చెందడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి నుంచి ఆమె జ్ఞాపకాలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆ ప్రియుడు చివరకు ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహదేవ్పూర్ మండలం కుదురుపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికంగా నివాసం ఉంటున్న మహేశ్..ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఆ యువతి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి మహేశ్ ఆమె ఆలోచనలతోనే గడుపుతున్నాడు. చివరకు యువతి సమాధి వద్దే అతడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. (ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. బేరం కుదుర్చుచుకుని కిడ్నాప్) -
500 మీటర్లలోపు మైనింగ్ జరపవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భూపాలపల్లి జిల్లా కాకతీయ గని–2లో పర్యావరణ నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు 500 మీటర్లలోపు బ్లాస్టింగ్ ద్వారా ఓపెన్‌కాస్ట్ మైనింగ్ నిర్వహించ వద్దంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన కేసును జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌లో బ్లాస్టింగ్ వల్ల వెలువడే వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, పర్యావరణానికి హాని కలుగుతోందని, పేలుళ్ల శబ్దానికి నివాసాలు ధ్వంసం అవుతున్నాయని పిటిషనర్ రాజలింగమూర్తి తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ 500 మీటర్లలోపు మైనింగ్ నిర్వహించుకోవచ్చంటూ గతంలో కేంద్ర పర్యావరణ శాఖ సవరించిన పర్యావరణ నిబంధనలను తోసిపుచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ కార్యకలాపాల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్ర మండలి సంయుక్తంగా తనిఖీ చేసి ఒక నెల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ కూడా తనిఖీ చేపట్టాలని ఆదేశించింది. నివేదిక అందిన అనంతరం తదుపరి విచారణ జరుపుతామన్న బెంచ్ పర్యావరణ నిబంధనలు అమలు చేసేవరకు 500 మీటర్ల పరిధిలో పేలుళ్ల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. సవరించిన పర్యావరణ నిబంధనల అమలుకు కేంద్ర పర్యావరణ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని బెంచ్ అభిప్రాయపడింది. -
మెకానిక్‌ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా
భూపాలపల్లి అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్స్ మెకానిక్‌ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక ఎస్ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్‌ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రకాల వృత్తుల వారు అభివృద్ధి చెందున్నప్పటికీ మెకానిక్‌లు మాత్రం వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు అంబేడ్కర్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సదస్సుకు సుమారు రెండు వేల మంది మెకానిక్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థానిక నాయకులు తోడేటి బాబు, స్వామి, రమేష్, ఆశోక్‌రెడ్డి, సుజేందర్, రాము, రవికాంత్, లక్ష్మణ్, రాజు, రాజినీకాంత్, మనోహర్, జాఫర్, రమేష్, పాషా, శంకర్, సురేష్, వినయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్ దహనం
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటల్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోవడంతో చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో వెనుకగల మార్కెట్లో 25 మంది వ్యాపారులు కూరగాయలు, నిత్యావసర సరుకులు విక్రయిస్తుంటారు. అమ్మకాలు ముగిసిన తర్వాత రోజులాగే సోమవారం రాత్రి సుమారు 11 గంటలకు వ్యాపారులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు రాత్రి 12 గంటలకు కోరె కృష్ణ, షేక్ ఈసుబ్, ఠాకూర్ మోహన్‌సింగ్ దుకాణాలపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే ఆయా దుకాణాలు తాత్కాలిక షెడ్లు కావడంతో పైన, కింద పెట్టిన గోనె సంచులు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాప్తిచెంది పక్కనే ఉన్న దుకాణాలను వ్యాపించాయి. మంటలు భారీగా చెలరగడంతో విషయాన్ని గమనించిన స్థానికులు కేటీపీపీ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలను చల్లార్పేలోపే ఠాకూర్ మోహన్‌సింగ్, అంబాల రవి, ఠాకూర్ హరిసింగ్, కృష్ణవేణి, షేక్ ఈసుబ్, కోరె క్రిష్ణ, కాగితపు నారాయణ, డి కోటేశ్వర్రావుకు చెందిన దుకాణాలు పూర్తిగా దహనమయ్యాయి. దుకాణాల్లో ఉన్న కూరగాయలు, నిత్యావసర సరుకులు మొత్తం కాలిపోయాయి. అంబాల రవికి చెందిన 15 నాటుకోళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక్కొక్కరు సుమారు రూ.లక్షకుపైగా నష్టపోగా మొత్తం రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత వ్యాపారులు వాపోయారు. నిత్యం చోరీలు.. కూరగాయల మార్కెట్లో నిత్యం చోరీలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు పది దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక హోల్‌సేల్ దుకాణం కౌంటర్లోని రూ.20 వేలు, ఇతర దుకాణాల్లో రూ.వేయి నుంచి రూ.2 వేల వరకు పోయాయి. వారం రోజుల క్రితం అదే హోల్‌సేల్ షాపులో చోరీ జరగగా చిల్లర డబ్బులు పోయాయి. నాలుగు రోజుల క్రితం ఐదు దుకాణాల్లో దొంగలు చొరబడి చిల్లర డబ్బులు, నిత్యావసర సరుకులు ఎత్తుకెళ్లారు. అదేరోజున ఓ దుకాణంలోని మద్యం బాటిల్ తీసుకొని పక్కనే ఉన్న షాపులో కూర్చొని తాగిన అనంతరం బాటిళ్లను పగులగొట్టి వెళ్లారు. అయితే వరుస సంఘటనలు జరుగుతుండటంతో కొందరు వ్యాపారులు రాత్రి వేళల్లో మార్కెట్లోనే నిద్రిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి వ్యాపారులెవరూ నిద్రించకపోవడాన్ని గమనించిన దొంగలు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. 16 ఏళ్ల క్రితం.. గత 16 ఏళ్ల క్రితం భూపాలపల్లి పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల సమీ పంలో కూరగాయల మార్కెట్ ఉండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుం ది. ఆ ప్రమాదంలో సుమారు 20కి పైగా దుకాణాలు, 10 తోపుడుబండ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో తీవ్ర నష్టం వాటిల్లి వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతమైంది. -
సామాజిక న్యాయంతోనే సమగ్ర అభివృద్ధి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రేగొండ (భూపాలపల్లి): సామాజిక న్యాయంతోనే తెలంగాణలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చేరుకోగా, రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రేగొండలో తమ్మినేని మాట్లాడుతూ గత పాలకులు అవలంభించిన విధానాలనే సీఎం కేసీఆర్ అనుసరిస్తు న్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల వాటా ప్రకారంగా సంక్షేమ నిధులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మళ్లించి దోచుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు పాదయాత్రలో 21 జిల్లాలలో 2,500 కిలోమీటర్ల వరకు నడిచి 900 గ్రామాలను సందర్శించినట్టు తమ్మినేని చెప్పారు. -
భూపాలపల్లి (జయశంకర్) సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్ ఎ.మురళి ఫోన్: 9701962226 ఎస్పీ ఆర్.భాస్కరన్ ఆచార్య జయశంకర్ జిల్లా విస్తీర్ణంలో రాష్ట్రంలో మూడోస్థానం, అడవుల్లో మొదటి స్థానంలో ఉంది. మండలాలు 20: భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్ళపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్రావు, కాటారం, మహదేవ్పూర్, పలిమెల, మహాముత్తారం, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు రెవెన్యూ డివిజన్లు 2: భూపాలపల్లి, ములుగు మున్సిపాలిటీలు 1: భూపాలపల్లి నగర పంచాయతీ గ్రామ పంచాయతీలు: 262 భారీ పరిశ్రమలు: సింగరేణి, కేటీపీపీ, బిల్ట్ కాగితపు పరిశ్రమ ఇరిగేషన్: మేడిగడ్డ, దేవాదుల, చెరువులు(గణపసముద్రం, రామప్ప, లక్నవరం) ఎమ్మెల్యేలు: సిరికొండ మధుసూదనాచారి, పుట్ట మధు, అజ్మీరా చందూలాల్ పర్యాటకం, ఆలయాలు: రామప్ప, లక్నవరం, మల్లూరు, మేడారం సమ్మక్క–సారలమ్మ, కోటగుళ్ళు, పాండవులగుట్ట, కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి, బోగత జలపాతం జాతీయ రహదారులు గుడెప్పాడ్ నుంచి కాళేశ్వరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రైల్వే లైన్లు: లేవు హైదరాబాద్ నుంచి దూరం: 222 కి.మీ.