రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బదిలీని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన ఓ గిరిజన ప్రధానోపాధ్యాయుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాలనుకుంటే తమను నిర్బంధించారని మల్కాజ్‌గిఞరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తమకు తిక్క రేగితే జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామని, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని అన్నారు.
పోలీసులతో కేసీఆర్ తమను అడ్డుకోవాలని చూస్తున్నారని, అందుకు నిరసనగా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా మంత్రులను అడ్డుకుంటారని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలో టీపీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో జరగనున్న ‘రైతులతో రచ్చబండ’కార్యక్రమానికి వెళ్లకుండా శుక్రవారం ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్దఎత్తున పోలీసులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి చేరుకొని ఆయనను గృహనిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి సమాచారం లేకుండా, లోక్‌సభ సభ్యుడిననే ప్రోటోకాల్ పాటించకుండా ఇలా ఇంటిని ముట్టడించడం ఏంటంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు ఇంట్లోనే ఉన్న రేవంత్ పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పౌరస్వేచ్ఛను కేసీఆర్ సర్కారు హత్య చేస్తోంది, ప్రజాగ్రహం పెల్లుబి కిననాడు ప్రగతిభవన్‌లు, ఫామ్‌హౌస్‌లు బద్ధలైపోతాయి కేసీఆర్.. జాగ్రత్త’అంటూ హెచ్చరించారు.
తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు... ఇలా ఏ వర్గమూ సంతోషంగా లేరని వ్యాఖ్యా నించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యో గుల విభజన చేస్తున్నారని, స్థానికతను, ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనలను పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లడం సరైంది కాదన్నారు. కేసీఆర్, ఆయన తనయుడు, కేటీఆర్‌లకు ఉరేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు.
స్పీకర్‌కు ట్విట్టర్ లేఖ
పోలీసులు తనను అడ్డుకుని గృహ నిర్బంధం చేయడంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు రేవంత్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా లేఖ రాశారు. ‘ఈ రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచి పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టి మోహరించారు. ఈ వారంలో ఇలా పోలీసులు మోహరించడం ఇది రెండోసారి. సమస్యల్లో రైతులతో మాట్లాడకుండా నన్ను అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కులను, స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాను’అని రేవంత్ తన ట్వీట్‌లో ఓం బిర్లాను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment