
సాక్షి, న్యూఢిల్లీ: భూపాలపల్లి జిల్లా కాకతీయ గని–2లో పర్యావరణ నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు 500 మీటర్లలోపు బ్లాస్టింగ్ ద్వారా ఓపెన్‌కాస్ట్ మైనింగ్ నిర్వహించ వద్దంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన కేసును జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌లో బ్లాస్టింగ్ వల్ల వెలువడే వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, పర్యావరణానికి హాని కలుగుతోందని, పేలుళ్ల శబ్దానికి నివాసాలు ధ్వంసం అవుతున్నాయని పిటిషనర్ రాజలింగమూర్తి తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు.
వాదనలు విన్న ట్రిబ్యునల్ 500 మీటర్లలోపు మైనింగ్ నిర్వహించుకోవచ్చంటూ గతంలో కేంద్ర పర్యావరణ శాఖ సవరించిన పర్యావరణ నిబంధనలను తోసిపుచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ కార్యకలాపాల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్ర మండలి సంయుక్తంగా తనిఖీ చేసి ఒక నెల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ కూడా తనిఖీ చేపట్టాలని ఆదేశించింది. నివేదిక అందిన అనంతరం తదుపరి విచారణ జరుపుతామన్న బెంచ్ పర్యావరణ నిబంధనలు అమలు చేసేవరకు 500 మీటర్ల పరిధిలో పేలుళ్ల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. సవరించిన పర్యావరణ నిబంధనల అమలుకు కేంద్ర పర్యావరణ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని బెంచ్ అభిప్రాయపడింది.