opencast
-
పరిహారం కోసం రైతు ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి: సింగరేణి ఓపెన్‌కాస్ట్ ఏర్పాటులో ఉన్న భూమి పోయింది. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో విసిగివేసారిన ఓ రైతు కలెక్టరేట్లో ప్రజావాణి వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఇల్లందు క్లబ్‌హౌస్‌లోని మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్య అనే రైతు క్లబ్‌హౌస్ బయట క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. అక్కడున్న వారు అతడిని లేపి ఏమైందని అడగ్గా.. తనకు అన్యాయం జరిగిందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో పురుగుమందు తాగానని చెప్పాడు. మాధవరావుపల్లిలో సర్వే నంబర్ 318/92లో తనకు ఎకరన్నర భూమిలో 500 టేకు చెట్లు ఉండేవని, 2019లో సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్ట్–3 నిర్మాణంలో భాగంగా ఆ భూమిని సేకరించిందన్నాడు. ఎకరన్నర భూమికి గాను ఎకరాకే పరిహారం వచ్చిందని, మిగిలిన 20 గుంటల పరిహారం ఓ దళారి పేరుపై వచ్చిందని వాపోయాడు. అలాగే, 78 చెట్లకు కూడా పరిహారం రాలేదన్నాడు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. గతంలో గణపురం తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే.. విధులకు ఆటంకం కలిగించానని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పది రోజులు జైల్లో ఉండి వచ్చానని సాంబయ్య పేర్కొన్నాడు. రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వెంటనే సిబ్బందిని పంపి రైతును ఆస్పత్రిలో చేర్పించారు. సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. -
సింగరేణిలో కొత్త ఓసీపీ
గోదావరిఖని: సింగరేణిలో శనివారం మరో ఓపెన్ కాస్ట్‌గని (ఓసీపీ) ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లాలోని ఈ గనిలో 33 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. 11 సంవత్సరాల పాటు ఏటా 3 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీయనున్నారు. రూ.471 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అధికారులు ప్రభావిత గ్రామాలైన సుందిళ్ల, ముస్త్యాల, జనగామల్లో ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేశారు. ఇప్పటికే ఓబీ పనులు ప్రారంభమయ్యాయి. సంస్థలో ప్రస్తుతం 18 ఓసీపీలు ఉన్నాయి. కొత్త ఓసీపీ ఏర్పాటుతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు చేతులమీదుగా గనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా ఓసీపీలో పేలుళ్ల కారణంగా ఇబ్బందులు వస్తాయని, అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతాయనే ఆందోళన ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. కాగా, సంస్థలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
కరీంనగర్: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
-
500 మీటర్లలోపు మైనింగ్ జరపవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: భూపాలపల్లి జిల్లా కాకతీయ గని–2లో పర్యావరణ నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు 500 మీటర్లలోపు బ్లాస్టింగ్ ద్వారా ఓపెన్‌కాస్ట్ మైనింగ్ నిర్వహించ వద్దంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన కేసును జస్టిస్ రఘువేంద్ర రాథోర్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌లో బ్లాస్టింగ్ వల్ల వెలువడే వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతంలోని ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, పర్యావరణానికి హాని కలుగుతోందని, పేలుళ్ల శబ్దానికి నివాసాలు ధ్వంసం అవుతున్నాయని పిటిషనర్ రాజలింగమూర్తి తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ 500 మీటర్లలోపు మైనింగ్ నిర్వహించుకోవచ్చంటూ గతంలో కేంద్ర పర్యావరణ శాఖ సవరించిన పర్యావరణ నిబంధనలను తోసిపుచ్చింది. ఇప్పటి వరకు జరిగిన మైనింగ్ కార్యకలాపాల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్ర మండలి సంయుక్తంగా తనిఖీ చేసి ఒక నెల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ కూడా తనిఖీ చేపట్టాలని ఆదేశించింది. నివేదిక అందిన అనంతరం తదుపరి విచారణ జరుపుతామన్న బెంచ్ పర్యావరణ నిబంధనలు అమలు చేసేవరకు 500 మీటర్ల పరిధిలో పేలుళ్ల ద్వారా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. సవరించిన పర్యావరణ నిబంధనల అమలుకు కేంద్ర పర్యావరణ శాఖ ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని బెంచ్ అభిప్రాయపడింది. -
ఓపెన్‌కాస్టు సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
ఏం ఇస్తారో చెప్పి సర్వేలు చేయాలి దుబ్బగూడెం గ్రామస్తులు కాసిపేట : మండలంలోని దుబ్బగూడెం గ్రామస్తులు మంగళవారం ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు కోసం గ్రామంలో చేస్తున్న సర్వేను అడ్డుకుని అధికారులను తిప్పి పంపారు. సింగరేణి యాజమాన్యం కేకే ఓపెన్‌కాస్టు కోసం దుబ్బగూడెంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. వైశాల్యం సర్వే అనంతరం ఇంటి విలువ లెక్కించేందుకు తిరిగి సర్వే చేయాల్సి ఉంది. దీంతో సర్వే చేసేందుకు ఏంఆర్ఐ కమల్‌సింగ్ ఆధ్వర్యంలో సర్వేయర్లు సర్వే చేస్తుండగా ముందు ఏం ఇస్తారో చెప్పి సర్వేలు చేయాలని అప్పటి వరకు నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ ప్రజల ఒప్పందం లేకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఒకపక్క ఓసీ వద్దని ప్రజలు ఆందోళనలు చేస్తుంటే కనీసం వారికి ఏం ఇస్తారో, ఎక్కడ స్థలం ఇస్తారో చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సర్వేలు పూర్తి అవుతున్నాయని ప్రకటించడం దారుణమన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారులు నడుచుకోవాలని సూచించారు. అధికారులతో వాదనకు దిగిన గ్రామస్తులు సర్వే నిలిపివేసి అధికారులను అక్కడి నుంచి పంపించారు. నాలుగు రోజులు గడువు ఇవ్వాలి – జెడ్పీటీసీ సత్తయ్య సర్వేలకు నాలుగు రోజులు గడువు ఇవ్వాలని జెడ్పీటీసీ రౌతు సత్తయ్య కోరారు. సర్వే అడ్డగించిన అనంతరం అక్కడకు చేరుకున్న జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రజలు ఏం ఇస్తారో చెప్పాలని కోరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రజల సూచన మేరకు నాలుగు రోజులు గడువు ఇచ్చి అనంతరం సర్వేలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట ప్రజలకు పునరావాసంపై అవగహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులున్నారు. -
ఓసీ కోసం ఇంటింటి సర్వే ప్రారంభం
కాసిపేట : మండలంలోని దుబ్బగూడెంలో మంగళవారం ఉదయం నుంచి రెవెన్యూ, సింగరేణి అధికారులు కెకె ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుకు సంబంధించి గహాల సర్వేలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వేలు చేశారు. ఇంటి విస్తీర్ణం మాత్రమే సర్వేచేయడం జరుగుతుందని తెలిపారు. ఈసర్వేల అనంతరం ఇంజనీరింగ్ అధికారులు ఇంటివిలువ, ఇతర నిర్మాణాలు, చెట్లు తదితర అంశాలపై సర్వేచేసి పూర్తివిలువ నిర్ధారించనున్నట్లు తెలిపారు. సర్వేలో ఏంఆర్ఐ కమల్‌సింగ్, బెల్లంపల్లి, నెన్నెల సర్వేయర్లు అలోవ్‌సింగ్, మణిరాజ్, సింగరేణి సర్వేయర్లు, సిబ్బంది తదితరులున్నారు. సర్వేను అడ్డుకున్న ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కెకె ఓపెన్‌కాస్టు కోసం దుబ్బగూడెంలో చేస్తున్న ఇళ్ల సర్వేను సాయంత్రం ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ప్రజల ఇష్టం పక్కన పెడితే వారికి చెల్లించే పరిహారంపై ఆమోదం లేకుండానే సర్వేలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఓసీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ గాదేవేణి బుచ్చయ్య, కోకన్వీనర్ బోగె పోశం, నాయకులు గోనెల శ్రీనివాస్ తదితరులున్నారు. -
ఓపెన్‌కాస్ట్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల ధర్నా
ఆదిలాబాద్ (మందమర్రి): ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం ఎర్రగుంటపల్లి గ్రామస్తులు ఓపెన్‌కాస్ట్‌కు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. తమ గ్రామం ఓపెన్ కాస్ట్ వల్ల నాశనం అవుతుందని, పకృతికి కూడా ఇది ప్రమాదకరమని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఓపెన్‌కాస్ట్ నుంచి తమ గ్రామాన్ని మినహాయించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. దీక్షకు దిగిన గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఆర్డీఓ నస్రత్, డీఎస్పీ రమణా రెడ్డి రంగంలోకి దిగారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.