పురుగు మందు తాగి పడిపోయిన సాంబయ్య
భూపాలపల్లి: సింగరేణి ఓపెన్‌కాస్ట్ ఏర్పాటులో ఉన్న భూమి పోయింది. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో విసిగివేసారిన ఓ రైతు కలెక్టరేట్‌లో ప్రజావాణి వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం కలెక్టరేట్ పక్కన ఉన్న ఇల్లందు క్లబ్‌హౌస్‌లోని మీటింగ్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
ఈ క్రమంలో గణపురం మండలం మాధవరావుపల్లికి చెందిన జిట్టబోయిన సాంబయ్య అనే రైతు క్లబ్‌హౌస్ బయట క్రిమిసంహారక మందు తాగి పడిపోయాడు. అక్కడున్న వారు అతడిని లేపి ఏమైందని అడగ్గా.. తనకు అన్యాయం జరిగిందని, ఎవరూ పట్టించుకోకపోవడంతో పురుగుమందు తాగానని చెప్పాడు. మాధవరావుపల్లిలో సర్వే నంబర్ 318/92లో తనకు ఎకరన్నర భూమిలో 500 టేకు చెట్లు ఉండేవని, 2019లో సింగరేణి సంస్థ ఓపెన్‌కాస్ట్–3 నిర్మాణంలో భాగంగా ఆ భూమిని సేకరించిందన్నాడు.
ఎకరన్నర భూమికి గాను ఎకరాకే పరిహారం వచ్చిందని, మిగిలిన 20 గుంటల పరిహారం ఓ దళారి పేరుపై వచ్చిందని వాపోయాడు. అలాగే, 78 చెట్లకు కూడా పరిహారం రాలేదన్నాడు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని చెప్పాడు. గతంలో గణపురం తహసీల్దార్‌ను ప్రశ్నిస్తే.. విధులకు ఆటంకం కలిగించానని పోలీసులకు ఫిర్యాదు చేశారని, పది రోజులు జైల్లో ఉండి వచ్చానని సాంబయ్య పేర్కొన్నాడు. రైతు ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న కలెక్టర్ భవేష్ మిశ్రా వెంటనే సిబ్బందిని పంపి రైతును ఆస్పత్రిలో చేర్పించారు. సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment