మిరపతోట కుళ్లిపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య
కురవి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగు చేసిన మిర్చి పంట కుళ్లిపోవడం.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురైన యువ రైతు భూక్య హత్తిరాం (33) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు హరిదాసు తండా జీపీ పరిధిలోని హర్య తండాలో శుక్రవారం జరిగింది. హత్తిరాం తనకున్న రెండు ఎకరాలకు తోడు మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. గతేడాది మిర్చి సాగు చేయగా నల్లి రోగంతో పంట నాశనమైంది. అప్పుడు పంట కోసం రూ.6 లక్షల అప్పులు చేశాడు.
ఆ అప్పులు తీరలేదు. ఈ ఏడాది అదే పంటను నమ్ముకుని తిరిగి మిర్చి సాగు చేశాడు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వేసిన మిరప తోట కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన హత్తిరాం గురువారం తోట వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. అస్వస్థతకు గురైన హత్తిరాం కుటుంబ సభ్యులకు మందు తాగినట్లు చెప్పాడు. అప్పటికే పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు వెంటనే మహబూబాబాద్‌లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి భూక్య స్వామి (సామ్య) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. మృతుడికి భార్య మీనా, అరవింద్, అరుణ్ కుమారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment