
వ్యాపార విస్తరణపై ప్రత్యేక దృష్టి
కాలుష్యరహిత ఉత్పత్తిపై ఆసక్తి
11 రకాల కీలక ఖనిజాల ఉత్పత్తికి సింగరేణి నజర్
క్వీన్స్‌లాండ్ మైనింగ్‌కు నోడల్ ఏజెన్సీగా సింగరేణి
గోదావరిఖని: క్రిటికల్ మినరల్స్‌పై సింగరేణి ఆసక్తి చూపుతోంది. కీలక ఖనిజాలు, మైనింగ్ రంగంలో సింగరేణికి సహకరించేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్‌లాండ్‌తో అవగాహన కుదుర్చుకుంది. బొగ్గు వెలికితీతతో పాటు థర్మల్, సౌర విద్యుదుత్పత్తి చేస్తూ సింగరేణి అపార అనుభవం గడించింది. కొద్దిరోజుల్లో పవన, జల విద్యుదుత్పత్తి సాధించనుంది. ఇతర రంగాల్లోనూ వివిధ సంస్థలకు శిక్షణ ఇస్తోంది.
ఈనెల 24న హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి శిక్షణ మంత్రి రోస్‌బేట్స్‌తో సింగరేణి ప్రతినిధులు భేటీ అయ్యారు. వివిధ పలు అంశాలపై పరస్పర అవగాహనకు వచ్చారు. దేశంలో విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టంలకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. క్రిటికల్ మినరల్స్‌కు మంచి భవిష్యత్ ఏర్పడింది.
ఈ రంగానికి అవసరమైన వనడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం వంటి 11 రకాల కీలక ఖనిజాలకు ప్రా«ధాన్యం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ కీలక ఖనిజాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుండగా, ఇక్కడే తయారు చేయడమా లేక ముడిసరుకు దిగుమతి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించడమా? అనే ఆలోచనలో సింగరేణి ఉంది. కీలక ఖనిజాల లభ్యత క్వీన్స్‌లాండ్‌లో అధికంగా ఉంది.
వీటి ఉత్పత్తి, విక్రయానికి పరస్పర లబ్ధి చేకూరే వ్యాపార ఒప్పందంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. 2029–30 నాటికి తెలంగాణ రాష్ట్రం 20 వేల మెగావాట్ల గ్రీన్‌ఎనర్జీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలవాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తెలంగాణ – క్వీన్స్‌లాండ్ మధ్య సంయుక్త మైనింగ్, మినరల్ వ్యాపారానికి సింగరేణి ఒక నోడల్ ఏజెన్సీగా ఐఐటీ సంస్థతో కలిసి పని చేయాలని నిర్ణయించింది.
క్వీన్స్‌లాండ్స్‌తో వ్యాపార బంధం
సింగరేణి ఇప్పటికే క్వీన్స్‌లాండ్స్‌తో రక్షణకు సంబంధించి పలు యంత్రాలు, విడిభాగాల కొనుగోలుపై ఒప్పందం చేసుకుంది. సరఫరా కూడా చేస్తోంది. సిమ్టార్స్ సంస్థతో మైనింగ్, టెక్నాలజీకి, సీఎస్‌ఐ, ఆర్‌వో తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకొంది. ప్రస్తుతం క్వీన్స్‌లాండ్ మంత్రి సమక్షంలో కీలక ఖనిజాల వెలికితీత, భారీఖనిజ ఉత్పత్తి యంత్రాలు సాంకేతికత, రక్షణ పెంపు, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి ఆధునిక సాంకేతికత అంశాలపై ముందుకు సాగుతోంది.
త్వరలో క్వీన్స్‌లాండ్‌కు సింగరేణి బృందం
క్రిటికల్ మినరల్స్‌పై లోతుగా అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి బృందాన్ని క్వీన్స్‌లాండ్‌కు పంపుతున్నారు. సింగరేణితో సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి క్వీన్స్‌లాండ్ మంత్రి ఆసక్తి కనబరిచారు.
కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్) కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాంటీమోనీ, రీనియం, ఇండియంతో పాటు రేర్‌ఎర్త్ మినరల్స్ వంటి కీలక ఖనిజాలను తమతో కలిసి ఉత్పత్తి చేయడానికి ఉమ్మడి భాగస్వామ్యంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. సౌర విద్యుత్, పవన విద్యుత్ రంగాల్లో పూర్తి సహకారానికి ఉభయులూ అంగీకరించారు.
సదస్సుకు ఆహ్వానం
ఈఏడాది మార్చిలో క్వీన్స్‌లాండ్‌లో పెద్దఎత్తున నిర్వహించే వ్యాపార సదస్సుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వీన్స్‌లాండ్ మంత్రి ఆహ్వానించారు. ఈ క్రమంలో వ్యాపార అనుబంధం మరింత పెరిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment