దగ్ధమైన కూరగాయల వద్ద యజమానులు
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటల్లో కూరగాయలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోవడంతో చిరు వ్యాపారులు లబోదిబోమంటున్నారు. భూపాలపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో వెనుకగల మార్కెట్‌లో 25 మంది వ్యాపారులు కూరగాయలు, నిత్యావసర సరుకులు విక్రయిస్తుంటారు. అమ్మకాలు ముగిసిన తర్వాత రోజులాగే సోమవారం రాత్రి సుమారు 11 గంటలకు వ్యాపారులంతా ఇళ్లకు వెళ్లిపోయారు.
విషయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు రాత్రి 12 గంటలకు కోరె కృష్ణ, షేక్ ఈసుబ్, ఠాకూర్ మోహన్‌సింగ్ దుకాణాలపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. అయితే ఆయా దుకాణాలు తాత్కాలిక షెడ్లు కావడంతో పైన, కింద పెట్టిన గోనె సంచులు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాప్తిచెంది పక్కనే ఉన్న దుకాణాలను వ్యాపించాయి. మంటలు భారీగా చెలరగడంతో విషయాన్ని గమనించిన స్థానికులు కేటీపీపీ ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు.
ఫైరింజన్ వచ్చి మంటలను చల్లార్పేలోపే ఠాకూర్ మోహన్‌సింగ్, అంబాల రవి, ఠాకూర్ హరిసింగ్, కృష్ణవేణి, షేక్ ఈసుబ్, కోరె క్రిష్ణ, కాగితపు నారాయణ, డి కోటేశ్వర్‌రావుకు చెందిన దుకాణాలు పూర్తిగా దహనమయ్యాయి. దుకాణాల్లో ఉన్న కూరగాయలు, నిత్యావసర సరుకులు మొత్తం కాలిపోయాయి. అంబాల రవికి చెందిన 15 నాటుకోళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక్కొక్కరు సుమారు రూ.లక్షకుపైగా నష్టపోగా మొత్తం రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత వ్యాపారులు వాపోయారు.
నిత్యం చోరీలు..
కూరగాయల మార్కెట్‌లో నిత్యం చోరీలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సుమారు పది దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక హోల్‌సేల్ దుకాణం కౌంటర్‌లోని రూ.20 వేలు, ఇతర దుకాణాల్లో రూ.వేయి నుంచి రూ.2 వేల వరకు పోయాయి. వారం రోజుల క్రితం అదే హోల్‌సేల్ షాపులో చోరీ జరగగా చిల్లర డబ్బులు పోయాయి. నాలుగు రోజుల క్రితం ఐదు దుకాణాల్లో దొంగలు చొరబడి చిల్లర డబ్బులు, నిత్యావసర సరుకులు ఎత్తుకెళ్లారు.
అదేరోజున ఓ దుకాణంలోని మద్యం బాటిల్ తీసుకొని పక్కనే ఉన్న షాపులో కూర్చొని తాగిన అనంతరం బాటిళ్లను పగులగొట్టి వెళ్లారు. అయితే వరుస సంఘటనలు జరుగుతుండటంతో కొందరు వ్యాపారులు రాత్రి వేళల్లో మార్కెట్‌లోనే నిద్రిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి వ్యాపారులెవరూ నిద్రించకపోవడాన్ని గమనించిన దొంగలు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది.
16 ఏళ్ల క్రితం..
గత 16 ఏళ్ల క్రితం భూపాలపల్లి పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాల సమీ పంలో కూరగాయల మార్కెట్ ఉండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుం ది. ఆ ప్రమాదంలో సుమారు 20కి పైగా దుకాణాలు, 10 తోపుడుబండ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో తీవ్ర నష్టం వాటిల్లి వ్యాపారులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అదే పరిస్థితి ఇప్పుడు పునరావృతమైంది.
Comments
Please login to add a commentAdd a comment