సామాజిక న్యాయంతోనే సమగ్ర అభివృద్ధి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
రేగొండ (భూపాలపల్లి): సామాజిక న్యాయంతోనే తెలంగాణలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చేరుకోగా, రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రేగొండలో తమ్మినేని మాట్లాడుతూ గత పాలకులు అవలంభించిన విధానాలనే సీఎం కేసీఆర్ అనుసరిస్తు న్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల వాటా ప్రకారంగా సంక్షేమ నిధులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మళ్లించి దోచుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు పాదయాత్రలో 21 జిల్లాలలో 2,500 కిలోమీటర్ల వరకు నడిచి 900 గ్రామాలను సందర్శించినట్టు తమ్మినేని చెప్పారు.