వైఎస్ జ‘గన్’.. ఆ పేరులోనే ఉంది డైనమిజం. జగన్ అంటే జన ప్రభంజనం. జగనన్నగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న యేదుగురి సందింటి జగన్మోహనరెడ్డి రాజకీయ చతురతతో, పాలనా దక్షతతో అనతి కాలంలోనే డైనమిక్ లీడర్‌గా ఎదిగి, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులలో ఒకరిగా గుర్తింపు పొందిన తీరు ఆదర్శప్రాయం.
మహిళల అభివృద్ధితో రాష్ట్ర అభివృద్ది ముడి పడి ఉందని నమ్మి అక్క చెల్లెమ్మల సంక్షేమమే ఊపిరిగా, మున్నపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఆడబిడ్డకు ప్రయోజనం చేకూర్చేలా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఎంతోమంది మహిళలకు అండగా నిలిచారు జగనన్న. ఆంగ్ల భాషా ప్రావీణ్యంతో విద్యార్థినులు విజయపతాకను ఎగురేసేలా విప్లవాత్మక అడుగు వేశారు ‘జగన్ మామ’.
మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన చరిత్ర ఆయనది. అమ్మ ఒడి నుంచి డ్వాక్రా సున్నావడ్డీదాకా, జగనన్న పెళ్లి కానుక, ఇంకా పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళ పేరు మీదనే స్థలమిచ్చారు. అంతేకాదు రాజకీయంగా అన్ని స్థాయిల్లోనూ మహిళా నేతలకు పదవులు కట్టబెట్టడమే కాకుండా తన కేబినెట్‌లో కూడా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. మహిళా భద్రతకు భరోసా ఇచ్చిన ‘దిశ యాప్’ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి.
అంతేనా.. 2019 ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించిన వైఎస్ జగన్ 'నవరత్నాలు' అమలుతో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చిన జననేత. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనం చేత జన నీరాజనాలు అందుకొని, సంక్షేమ ప్రభుత్వంగా మన్ననలు పొంది, రాజకీయ జీవితంలో శిఖరాలను అధిరోహించినా... ఆయన చూపు జనం మీదనే. ఏ కష్టం కాలం వచ్చినా, తక్షణమే బాధితులకు అండగా నిలబడ్డారు. అకాల వర్షాల్లో రైతులకు భరోసా ఇచ్చినా, వరదల్లో బాధితులకు నేనున్నాంటూ అండగా నిలబడినా, విద్యార్థులకు, మహిళలకు, ఒకరనేమిటి, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు నభూతో నభవిష్యతి. రాజకీయ జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఒదిగి ఉండే నైజం ఆయనది. అంతేకాదు తాజా ఎన్నికల్లో ఊహించని పరాజయం ఆయన ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం దెబ్బతీయలేదు. ఈ పరిణామానికి సాకులు వెదకలేదు. ఎవర్నీ నిందించలేదు. అత్యంత నిబ్బరంతో ప్రజల ముందుకొచ్చిన వైనమే ఇందుకు నిదర్శనం.
పదవి, అధికారంతో సంబంధం లేకుండా, తానెప్పుడూ బాధితుల పక్షమేననీ, జనంతోనే పయనం, జనం కోసమే పోరాటం అంటూ ప్రకటించిన పోరు పతాక వైఎస్ జగన్. అన్నమాట ప్రకారమే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటూ, ప్రజాసమస్యలపై గొంతెత్తుతున్న జననేత జగన్. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై గళం విప్పడంలో మహిళలకు అండగా నిలబడటంలో అప్పుడూ, ఇప్పుడూ అదే తెగువ.. అదే నిబద్ధత!
అప్పుడైనా,ఇప్పుడైనా, ఎప్పుడైనా... జగన్ అంటే జనప్రభంజనం అంటోంది బడుగు బలహీన లోకం.
ఆనాటి పాదయాత్ర నుంచి నిన్నామొన్నటి కర్నూలు పర్యటన దాకా జగన్ వెంటే జనం, జనంతోనే జగన్ అంటోంది మహిళాలోకం.
జగన్ మామకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటోంది చిన్నారి లోకం.
Comments
Please login to add a commentAdd a comment