జగన్ పాలన –మహిళా స్పందన కార్యక్రమంలో అభివృద్ధిపై పోస్టర్లను ఆవిష్కరిస్తున్న వాసిరెడ్డి పద్మ తదితరులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన రాష్ట్రంలో మహిళలకు స్వర్ణ యుగమని, మహిళలే కేంద్రంగా వారి సంక్షేమం, అభివృద్ధికి సీఎం విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని పలువురు మహిళా మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు. విజయవాడలోని ఒక హోటల్‌లో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన–మహిళా స్పందన’ అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో 90 శాతం మహిళలకు సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు.
ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు యునిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత, సంక్షేమంపై మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీత లఖంరాజు రూపొందించిన నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రాష్ట్రంలో ‘జగన్ సంక్షేమ పాలన కావాలో.. బాబు దోపిడీదారుల పాలన కావాలో’ తేల్చుకునే సమయం ఆసన్నమైందని, మళ్లీ జగన్‌ను గెలిపించుకునేలా తాము సిద్ధమంటూ పలువురు వక్తలు ప్రతినబూనారు.
మహిళా సంస్కర్త జగన్
మహిళా సాధికారతతోనే సమాజం వృద్ధి చెందుతుందని నమ్మిన గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికం మహిళలే కేంద్రంగా అమలు చేస్తున్నారు. మహిళను హోంమంత్రిగా చేయడంతోపాటు ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కుకునేలా సున్నా వడ్డీ అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్సార్. ఇప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేసింది సీఎం జగన్ ఒక్కరే. పేదలు, మహిళల అభ్యున్నతికి జగన్ ఒక మహర్షిలా పాటు పడుతున్నారు. –డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్
జగన్ పాలనలో రూ.11.41 కోట్ల సంపద
సీఎం జగన్ 58 నెలల పాలనలో రాష్ట్రంలోని మహిళలకు సుమారు రూ.11.41 లక్షల కోట్ల సంపద సమకూరింది. మరే రాష్ట్రంలో ఏ సీఎం కూడా మహిళల కోసం ఇంతలా చేయలేదు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఒక్కో సెంటు విలువ రూ.2.50 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన ఇళ్ల స్థలాల విలువ రూ.7.75 లక్షల కోట్లు. 31 సంక్షేమ పథకాలతో మహిళా లబ్ధిదారులకు రూ. 2.66 లక్షల కోట్లు అందించారు. సుమారు రూ.లక్ష కోట్లతో లక్షలాది గృహాలు నిర్మించి ఇస్తున్నారు. మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శమని ‘జర్నల్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నొవేటీవ్ రీసెర్చ్’ పుస్తకంలో కూడా పేర్కొన్నారు. –వీవీఆర్ కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
జగన్ ప్రభుత్వం వచ్చాకే ప్రాధాన్యం
నేను 25 ఏళ్లుగా సర్వీస్ సెక్టార్‌లో పనిచేస్తున్నాను. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చాకే మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరిగింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో జగన్‌లా మహిళలకు ఎవరూ పెద్దపీట వేయలేదు. సీఎం జగన్ దార్శనికతతో మహిళలు సాధికారత దిశగా ఆడుగులు వేశారు. –బండ్లమూడి రోజారాణి, యునిసెఫ్ ప్రతినిధి
పెరిగిన మహిళల తలసరి ఆదాయం
జగన్ ప్రభుత్వం వచ్చాకే మహిళలకు తలసరి ఆదాయం పెరిగిందని నివేదికలే చెబుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా నేరుగా మహిళల ఖాతాలకు నగదు జమ చేయలేదు. 58 నెలల జగన్ పాలనలో మహిళలకు సంపద సృష్టించి రికార్డు నెలకొల్పారు. –సునీత లఖంరాజు, మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు
వైద్యానికి అధిక ప్రాధాన్యం
జగన్ ప్రభుత్వం వచ్చాక వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 17 మెడికల్ కాలేజీలు పెట్టడంతో జగన్ చరిత్ర సృష్టించారు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ చాలా గొప్ప నిర్ణయం. గడప గడపకు వైద్యులు వెళ్లి వైద్యం అందించడం గొప్ప పని. –డాక్టర్ షమా, హోప్ విన్ హాస్పిటల్స్ ఫౌండర్
లా చదివేందుకు మహిళల ఆసక్తి
న్యాయవాదులను ప్రోత్సహించేలా సీఎం జగన్ లా నేస్తం ద్వారా నెలకు రూ.5 వేలు అందిస్తున్నారు. లా నేస్తం పథకంలో మహిళా లాయర్లు ఉండటంతో వారికి ప్రోత్సాహంగా ఉంది. దీని వల్ల లా చదివేందుకు మహిళల్లో ఆసక్తి పెరిగింది. –నరహరశెట్టి జ్యోతి, బెజవాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ
మహిళా సాధికారతకు ఐకాన్ జగన్
మహిళా సాధికారతలో సీఎం జగన్ ఐకాన్‌గా నిలిచారు. జగన్‌ను మళ్లీ సీఎం చేయడం ద్వారా రానున్న రోజుల్లో మహిళలు మరింత సాధికారత దిశగా అడుగులు వేస్తారు.
–అరవింద రాజా గాలి, సామాజిక కార్యకర్త
జగన్ దయతో బిడ్డల్ని చదివిస్తున్నా
నా ఇద్దరు బిడ్డల్లో ఒకరినే చదివిద్దామనుకున్నా. జగన్ దయ వల్ల ఇద్దరు బిడ్డల్ని చదివించుకోగలుగుతున్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్, సంక్షేమ పథకాలతో నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డాను – నక్కా సుసన్న, గృహిణి
మళ్లీ జగన్ రావాలి
జగన్ పాలన మళ్లీ వస్తేనే మహిళలకు భద్రతతోపాటు మరింత మేలు చేకూరుతుంది. మహిళలకు మేలు చేస్తున్న జగన్‌ను మనమంతా గుర్తించుకోవాలి. జగన్ రాకపోతే మళ్లీ దోపిడీకి గురవుతాం. – పులుగు సుశీలా రెడ్డి, సామాజిక కార్యకర్త
మహిళల భద్రతకు భరోసా
అయోధ్యలో రాముడి కోసం ఎదురు చూసినట్లు మహిళలంతా జగన్ కోసం చూశారు. జగన్ అందించిన భరోసా వల్లే మహిళలు నేడు తలెత్తుకుని తిరుగుతున్నారు. దిశా బిల్లు వంటి అనేక కార్యక్రమాలతో జగన్ ప్రభుత్వం మహిళలకు భరోసా ఇచ్చింది. – శిష్ట్లా ధనలక్ష్మి, బ్యాంకింగ్ రంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment