రాష్ట్రంలో పెరిగిన మహిళల డిపాజిట్ ఖాతాలు.. పెరిగిన మహిళల అధికారం, కుటుంబ పొదుపు
2019 మార్చి నుంచి 2023 మార్చికి రాష్ట్రంలో పెరిగిన మహిళా డిపాజిట్ల ఖాతాలు 90.4 లక్షలు.. గత ఎన్నికలకంటే ఈ ఎన్నికల్లో మహిళా ఓట్లలో పెరుగుదల 8.4 లక్షలు
దేశవ్యాప్తంగానూ పెరిగిన మహిళల డిపాజిట్ల ఖాతాలు..
ఫలితంగా సార్వత్రిక ఎన్నికల్లో 1.73 కోట్ల మహిళా ఓటర్లు అధికంగా ఓట్లు వేశారు
ఆరు దశల పోలింగ్ సరళిపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై వారు నిలబడటమే కాకుండా, కుటుంబానికి కూడా ఆర్థికంగా తోడ్పాటునందించడానికి పలు పథకాలు ప్రవేశపెట్టారు. చిన్న వ్యాపారాల నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు వారికి అండదండగా నిలిచారు. దీంతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొన్నారు.
కుటుంబంలో వారి ప్రాబల్యం పెరిగి, కుటుంబ పొదుపు పెరిగింది. రాష్ట్రంలో మహిళలు సాధించిన ఈ సాధికారత పెరిగిన డిపాజిట్ల ఖాతాల రూపంలో, ఈ ఎన్నికల్లో మహిళల ఓట్ల రూపంలో ప్రతిబింబించిందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. 2019 మార్చి నుంచి 2023 మార్చి వరకు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా మహిళల డిపాజిట్ల ఖాతాల్లో పెరుగుదల, రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన 6 దశల లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన మహిళల ఓట్లను ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది.
ఆంధ్రప్రదేశ్‌లో 2019 మార్చి నుంచి 2023 మార్చికి మహిళా డిపాజిట్ ఖాతాలు 90.4 లక్షలు పెరిగాయని తెలిపింది. తద్వారా మహిళలు నిర్ణయాత్మకంగా మారారని, దాని ఫలితంగానే 2019 ఎన్నికలను మించి 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అదనంగా 8.4 లక్షల మంది మహిళలు ఓటు వేశారని నివేదిక వెల్లడించింది. ఈ సంవత్సరం ఎన్నికల్లో పురుషులకన్నా మహిళా ఓటర్లు పోలింగ్‌లో అత్యధికంగా పాల్గొన్నారని తెలిపింది.
రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఓట్ల పెరుగుదల జనరల్ కేటగిరీ నియోజకవర్గాలకంటే ఎక్కువగా ఉండటం స్వాగతించదగ్గ అంశమని పేర్కొంది. ఆసక్తికరంగా, ప్రతి అదనపు 100 మంది పురుష ఓటర్లకు, ఎస్సీ నియోజకవర్గాల్లో 115 మంది, ఎస్టీ నియోజకవర్గాల్లో 111 మంది మహిళా ఓటర్లు ఉన్నారని, సాధారణ నియోజకవర్గాల్లో 105 మంది మహిళలు ఉన్నారని నివేదిక పేర్కొంది.
6 దశల్లో 54.3 కోట్ల మంది ఓటు వేశారని..
దేశవ్యాప్తంగా జరిగిన ఆరు దశల పోలింగ్‌లోనూ మహిళల ఓట్లు గతంలోకన్నా బాగా పెరిగాయని తెలిపింది. కేరళ, మణిపూర్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో 2019 ఎన్నికలకన్నా 2024 ఎన్నికల్లో మహిళా ఓట్లు 1.73 లక్షలు పెరిగినట్లు చెప్పింది. 2019 మార్చి నుంచి 2023 మార్చి నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళా డిపాజిట్ ఖాతాల సంఖ్య 30.97 కోట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో 4.18 కోట్ల మహిళా ఖాతాలు, ఆ తరువాత ఢిల్లీలో 3.32 కోట్ల మహిళా ఖాతాలు పెరిగినట్లు తెలిపింది.
2024లో మొత్తం 57.8 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 2019లో తొలి 6 దశల్లో 54.3 కోట్ల మంది ఓట్లు వేశారని, ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 3.45 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. పెరిగిన 3.45 కోట్ల మంది ఓటర్లలో, మహిళా ఓటర్లు 1.73 లక్షలు, పురుష ఓటర్లు 1.62 లక్షలుగా తెలిపింది. ఇలా మహిళా ఓటర్లు పురుషులకంటే నిర్ణయాత్మకంగా ఉన్నారని, ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 107 మంది మహిళా ఓటర్లు ఉన్నారని నివేదిక విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment