సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్‌లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న కొంతమందికి ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి.
అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్‌ఎస్‌బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్‌ఎల్‌పీ వంటి సంస్థలు ఉన్నాయి.
ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్‌లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది.
స్థానికంగా పరిశ్రమల అభివృద్ధి..
పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్‌పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పెట్టుబడులు సమకూర్చడంలో మేటి..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది.
గతంలో కంటే భారీగా పెరిగిన ఎంఎస్‌ఎంఈలు..
అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్‌ఎఫ్‌సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్‌ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్‌టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది.
జీఎస్‌డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది.
గత ప్రభుత్వ ఒప్పందాల్లో వ్యాజ్యాల పరిష్కారం
జగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్‌ప్రాజెక్ట్‌కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
ప్రభుత్వ చొరవతో చౌకైన విద్యుత్తు
సెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ప్రస్తుతం సగటు ధర యూనిట్‌కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment