ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి సంబంధించి రుణ ప్రణాళికలు రూపొందించేందుకు 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు రూ.5.4 లక్షలకోట్ల రుణ ప్రణాళికను సిద్ధం చేశారు.
ప్రభుత్వం రూపొందించిన రుణ ప్రణాళికలోని వివరాల ప్రకారం..విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాధాన్య రంగాలకు రూ.3,75,000 కోట్లు(గతంతో పోల్చితే 16 శాతం అధికం), ఇతర రంగాలకు రూ.1,65,000 కోట్లు అవసరం. వ్యవసాయ రంగానికి రూ.2,64,000 కోట్లు రుణాలు కావాల్సి ఉంది. గతంలో కంటే ఇది 14 శాతం పెరిగింది. డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32,600 కోట్ల రుణాలు అవసరం. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం వృద్ధికి గతేడాదిలో రూ.2,31,000 కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 90 శాతం అనగా రూ.2,08,136 కోట్లు మంజూరయ్యాయి.
ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే ఎంఎస్‌ఎంఈ రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69,000 కోట్లు రుణాలు కావాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లకు పెంచారు. గతంలో కంటే ఇది 26 శాతం అధికం. గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు, సాంప్రదాయేతర ఇంథన రంగానికి రూ.8000 కోట్లు రుణాలు కావాలని ప్రాణాళికలు సిద్ధం చేశారు.
ఐదు ప్రధాన విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
1. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడం.
2. పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం.
3. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం.
4. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం చర్యలు తీసుకోవడం.
5. సంపద సృష్టించే, జీఎస్‌డీపీ పెంచే రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం.
ఇదీ చదవండి: బడ్జెట్‌లో రైతన్న కోరుకుంటున్నవి..
ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఎల్‌బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment