వచ్చే మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరణ
నోటిఫై చేసిన రిజర్వు బ్యాంక్
ఇప్పటివరకు చంద్రబాబు పాలనలో బడ్జెట్ పరిధిలోని అప్పులే రూ.74,827 కోట్లకు చేరిక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ అప్పు చేస్తోంది. ఈసారి ఏకంగా రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ఈ నెల 31వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.
రాష్ట్ర ప్రభుత్వం 12 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 13 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,500 కోట్లు, 14 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.2,000 కోట్లు అప్పు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం నవంబర్ వరకు రూ.65,590 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రూ.4,237 కోట్లు అప్పు చేసింది.
ఈ నెల 31వ తేదీన మరో రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులే రూ.74,827 కోట్లకు చేరనున్నాయి. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసింది. దీనికి తోడు చంద్రబాబుతోపాటు కూటమి నేతలు కూడా అప్పులు ఎక్కువగా చేశారంటూ లేని అప్పులను కూడా కలిపి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పరిధిలోను, బడ్జెట్‌కు బయట పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నప్పటికీ ఎల్లో మీడియా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అప్పులు చేస్తే ఒప్పు... అదే గత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తే తప్పు... అన్నట్లుగా చిత్రీకరించడమే ఎల్లో మీడియా నైజంగా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment