సాక్షి, అమరావతి: మరో రూ.5 వేల కోట్లు అప్పు చేయడానికి చంద్రబాబు సర్కార్ రెడీ అయిపోయింది. మంగళవారం అప్పుకి ప్రభుత్వం ఇండెంట్ పెట్టేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు సమీకరించనుంది. మొత్తం రూ.74,872 కోట్లకు బడ్జెటరీ అప్పులు చేరనున్నాయి. 6 నెలల్లోనే రికార్డ్ స్థాయిలో బాబు సర్కార్ అప్పులు చేసింది.
కాగా, సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. నన్ను గెలిపించండి.. సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా.. నా కాన్సెప్ట్ పూర్ టు రిచ్’ అంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేయడం పైనే దృష్టి పెట్టారు. మంగళవారాన్ని పూర్తిగా అప్పుల వారంగా మార్చేశారన్న విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్‌డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment