సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపే నూతన రేషన్ కార్డుల జారీకి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 3.09 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు అందజేయనుంది. భూపాలపల్లి జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు ప్రతీ మండల కేంద్రంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందిస్తారని మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క పెండింగ్ అప్లికేషన్ లేకుండా
అన్నింటిని పరిశీలించి కార్డులు జారీ చేశామన్నారు. ఈ 3.09 లక్షల కార్డుల ద్వారా 8,65,430 మంది లబ్ధిదారులు నూతనంగా ప్రతీ నెల 6 కిలోల బియ్యాన్ని పొందనున్నట్లు చెప్పారు. ఇందుకుగానూ నెలకు 5,200 మెట్రిక్ టన్నులతో ఏడాదికి 62,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే ఉన్న కోటాకు అదనంగా పౌరసరఫరాల శాఖ అందించనున్నట్లు తెలిపారు. దీనికోసం ఏటా ప్రభుత్వం రూ.168 కోట్లు అదనంగా వెచ్చించనుందన్నారు. ఇప్పటికే ఉన్న 87.41 లక్షల కార్డులకు కొత్తవి జత కావడంతో వాటి సంఖ్య 90.50 లక్షలకు చేరనుండగా, మొత్తం లబ్ధిదారులు 2.88 కోట్లు ఉంటారని చెప్పారు. బియ్యం పంపిణీకి ఏటా ప్రభుత్వం రూ.2,766 కోట్లు వెచ్చిస్తోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment