సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఈ ఏడాది నీట్ ఉత్తీర్ణత తగ్గింది. కేవలం 51.3 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. టాప్ 50 జాబితాలో ఇద్దరు తమిళనాడు విద్యార్థులకు చోటు దక్కింది. వివరాలు.. వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం గత నెల నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు రాష్ట్రం నుంచి 1,32,167 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 67,787 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 54 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 51.3 శాతానికి పరిమితమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల ఉత్తీర్ణత మరీ తక్కువగా ఉంది.
అయితే, దేశవ్యాప్తంగా టాప్ 50లో తమిళనాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులకు చోటు దక్కించుకోవడం గమనార్హం. మదురైకు చెందిన త్రిదేవ్ వినాయక(ఓబీసీ కేటగిరిలో –705 మార్కులతో) 30వ స్థానం, హరిణి అనే విద్యార్ధిని జనరల్ కేటగిరిలో 702 మార్కులతో 43వ స్థానం దక్కించుకోవడం విశేషం. కాగా నీట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యల బాట పట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆవడి సమీపంలో ఓ విద్యార్థిని మరణించగా, తిరుత్తణిలో మరో విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నీట్ తప్పిన విద్యార్థులకు తల్లిదండ్రులు భరోసా ఇవ్వాలని, వారితోనే ఉండాలని, అవసరం అయితే, ప్రభుత్వం 104, 1100 నెంబర్లకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ తీసుకోవాలని అధికారులు సూచించారు.
యువతి బలవన్మరణం
తిరువళ్లూరు: నీట్ పరీక్షల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ఆవడి సమీపంలోని తిరుముల్‌లైవాయల్ ఇంది రా నగర్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు అముద కుమార్తె లక్ష్మీ శ్వేత(19) ప్లస్–2 పూర్తి చేసి రెండేళ్లుగా నీట్‌కు ఆన్‌లైన్ క్లాసుల ద్వారా కోచింగ్ తీసుకుంటోంది. గత నెలలో రాసిన నీట్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్షల్లో అర్హత మార్కులు సాధించకపోవడంతో ఆవేదనకు గురై ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment