పాలుపోక భాస్కరరావు
చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుని పేరు పాలుపోక భాస్కరరావు. ఆయనది మక్కువ మండలంలోని కాశీపట్నం గ్రామం. బీఎస్సీ, బీఈడీ పూర్తిచేశారు. ఉపాధ్యాయుడు కావాలన్న ఆశయంతో రాత్రీపగలు కష్టపడి చదివారు. డీఎస్సీ– 1998లో క్వాలిఫై అయ్యారు. చేతికందొచ్చిన ఉద్యోగం వివాదాలతో దూరమైంది. 2001లో డీఎస్సీ రాయగా అరమార్కులో అనర్హుడయ్యారు. మరోమారు 2006లో స్కూల్ అసిస్టెంట్ బయోలజీలో ఒక్కమార్కులో ఉద్యోగం పోయింది.
తరువాత అనారోగ్యం కారణంగా 2007, 2012 సంవత్సరాలలో పరీక్షలు రాయలేకపోయారు. 2009లో ఇన్‌ఫెక్షన్ సోకడంతో రెండుకాళ్లు తీసేయాల్సి వచ్చింది. అక్షరాలపై మమకారం, ఉపాధ్యాయ వృత్తిపై ప్రేమతో కృత్రిమ కాళ్లతో కొన్నాళ్ల పాటు కాశీపట్నం ప్రభుత్వ పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేశారు. కొన్నాళ్లకు వలంటీర్ వ్యవస్థను ఎత్తేయడంతో ఆ చిరుద్యోగమూ దూరమైంది. జీవనం భారంగా మారింది. పొట్టపోషణ కోసం కాశీపట్నం నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకొని మక్కువలోని ఓ మీసేవా కేంద్రంలో పనిచేసేవారు. కొంతకాలం తర్వాత మీ సేవా కేంద్రం వేరే ప్రదేశానికి మార్పుచేయడంతో ఆ బాధ్యతలూ దూరమయ్యాయి.
కొద్దిరోజుల తర్వాత మక్కువలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) మేడ మెట్లకింద చిన్న కుర్చీవేసుకొని బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులకు బ్యాంకు ఫారాలు నింపుతూ సాయపడేవారు. అలా వారిచ్చిన ఐదు,పది రూపాయలతో రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు సంపాదించేవారు. భాస్కరరావు దీనస్థితిని చూసిన ఆ గ్రామ పెద్దలు ఆయన భార్య లక్ష్మికి అంగన్‌వాడీ ఆయా గా అవకాశం కల్పించారు. దంపతులిద్దరూ శ్రమిస్తూ అబ్బాయిని బీటెక్, అమ్మాయిని 9వ తరగతి చదివిస్తున్నారు.
వారి కుటుంబ జీవితం అలలపై సాగుతున్న నావ. ఆ నావకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిక్సూచీగా మారారు. 23 ఏళ్లుగా ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తూ డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగ మార్గాన్ని సుగమం చేశారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. సీఎం రూపంలో మా జీవితంలోకి ఉద్యోగ ‘భాస్కరుడు’ ఉదయించాడంటూ సంతోషపడుతున్నారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment