ప్చ్.. బీఎడ్ | Too many students after completing a Bachelor of Education degree at once | Sakshi
Sakshi News home page

ప్చ్.. బీఎడ్

Published Sun, Oct 20 2013 3:30 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Too many students after completing a Bachelor of Education degree at once

 ఎస్కేయూ, న్యూస్‌లైన్ : ఒకప్పుడు చాలా మంది విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో చేరేవారు. ఈ కోర్సు పూర్తి చేస్తే టీచర్ ఉద్యోగం తప్పక వస్తుందని భావించేవారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. బీఎడ్ అభ్యర్థులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే అర్హులుగా పరిగణిస్తుండడంతో కోర్సుకు ఆదరణ తగ్గిపోతోంది. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టులకు దూరం చేయడం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కూడా నిర్వహిస్తుండడంతో బీఎడ్‌లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీనికి బదులు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్)లో గానీ, ఇతర కోర్సుల్లో గానీ చేరడం మేలని భావిస్తున్నారు.
 
 ఫలితంగా బీఎడ్ కళాశాలలు వెలవెలబోతున్నాయి. మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. బీఎడ్‌లో ప్రవేశానికి ఈ నెల 13 వరకు తొలివిడత కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ నెల 16తో వెబ్ ఆప్షన్ల ఘట్టం పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఎస్కేయూతో పాటు 24 కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 2005, మేనేజ్‌మెంట్ కోటాలో 635 కలిపి మొత్తం 2,640 సీట్లు ఉన్నాయి. ఇందులో ఎస్కేయూ కళాశాలలో 100, సరస్వతి  కళాశాల(అనంతపురం)లో 160, నాలుగు కళాశాలల్లో 120 చొప్పున, మరో 19 కళాశాలల్లో వంద చొప్పున సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలోని 2005 సీట్లకు గాను తొలి విడతలో 1,419 మాత్రమే భర్తీ కావడం గమనార్హం.
 
 ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్‌కూ ఆదరణ కరువే
 బీఎడ్‌లో ఫిజికల్ సైన్సు మెథడాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకూ ఆదరణ కరువైంది. అన్ని కళాశాలల్లో రెండంకెల సీట్లు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. కోర్సులో చేరినా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఇస్తుందో, లేదోననే సందేహంతో పలువురు విద్యార్థులు వెనకడుగు వేశారని తెలుస్తోంది. ఆయా మెథడాలజీల్లో కనీసం పది మంది కూడా చేరకపోతే కళాశాలలు ఎలా నడపగలమని నిర్వాహకులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఇంగ్లిష్‌కు సంబంధించి ఎనిమిది కళాశాలల్లో ఎవరూ చేరలేదు. మరో 12 కళాశాలల్లో ఒక్కరు చొప్పున మాత్రమే చేరారు. ఫిజికల్ సైన్సు మెథడాలజీలో ఎక్కడా ఐదుగురికి మించలేదు. దీన్నిబట్టే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
 
 భర్తీ అయిన సీట్లు ఇవే...
 కన్వీనర్ కోటా కింద మ్యాథమ్యాటిక్స్ మెథడాలజీలో 501 సీట్లకు గాను 328, ఫిజికల్ సైన్సులో 200కు గాను 95, బయలాజికల్ సైన్సులో 401 సీట్లకు 317, సోషియల్ స్టడీస్‌లో 703 సీట్లకు 646, ఇంగ్లిషులో 200 సీట్లకు 33 మాత్రమే భర్తీ అయ్యాయి. 2005 సీట్లున్న కన్వీనర్ కోటాలోనే 586 మిగిలిపోతే యాజమాన్య కోటాలోని 635 సీట్లను ఎలా భర్తీ చేసుకోవాలోనన్న సందిగ్ధతలో కళాశాలల యాజమాన్యాలు పడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement