రామగుండం: పెళ్లయిన మూడు నెలలకే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో అదనపు కట్నం కోసం భార్యను శారీరకంగా, మానసికంగా హింసించడంతో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 2011లలో మండలంలోని లింగాపూర్‌లో చోటు చేసుకుంది. భార్య మృతికి కారకుడైన భర్తపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ట్రయల్‌కు రావడంతో సదరు ఉపాధ్యాయుడు అత్తమామలతో రాజీ కుదుర్చుకునేందుకు రావడంతో చెల్లిని చంపి రాజీకి వచ్చారా? అంటూ మృతురాలి సోదరుడు అత్తామామలపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటన ఆదివారం లింగాపూర్‌లో చోటుచేసుకుంది.
స్థానిక ఎస్సై విద్యాసాగర్ కథనం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గాలిపెల్లి ఎల్లయ్య కూతురు శ్యామలను 2011లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలంలోని చిన్నబోజాల గ్రామానికి చెందిన మేనల్లుడు మోకెనపల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశాడు. పెళ్లయిన మూడు నెలలకే శ్రీనివాస్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక శ్యామలను అదనపు కట్నం పేరుతో శారీరకంగా, మానసికంగా హింసించడంతో ఆమె జూలై 2012న తల్లి గారిల్లైన లింగాపూర్‌కు వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు కూతురు మృతికి కారణమైన అల్లుడిపై గాలిపెల్లి ఎల్లయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు మోకెనపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచులు భూమక్క, నర్సక్కలపై 498(ఎ), 304(బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కేసు జిల్లా సెషన్‌కోర్టులో నడుస్తోంది. ఈ మధ్యలో ట్రయల్ రావడంతో మోకెనపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు మోకెనపల్లి రాజలింగం, దేవమ్మలతో పాటు లింగాపూర్‌కు చెందిన సమీప బంధువులు మోకెనపల్లి నారాయణ, మోకెనపల్లి బాలకృష్ణ, గోగెర్ల శేఖర్ తదితర పెద్దమనుషుల సహాయంతో ఆదివారం మృతురాలి తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకొని కేసును కొట్టివేయించుకునేందుకు వచ్చారు.
విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు గాలిపెల్లి శ్రీనివాస్ ఒక్కసారి ఆవేశానికి లోనయ్యాడు. చెల్లెలు మృతికి కారకుడై ఉండీ కేసును కొట్టేయించుకునేందుకు రాజీకి వచ్చారా? అంటూ మోకెన పల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో గోదావరిఖనికి తరలించారు. డాక్టర్లు ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు. అనంతరం దేవమ్మ, రాజలింగంను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు.
‘రాజీ’కి వచ్చిన అత్తమామలపై దాడి
Published Mon, Jan 19 2015 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement