న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో సుప్రీంకోర్టు గురువారం కీల కీలకతీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల కేసులో ఫిర్యాదుదారుల కుటుంబంతో నిందితుడు రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును కొట్టివేయడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ కేసులోనిందితుడికి ఉపశమనం కలిగిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం కొట్టివేసింది.
2022లో జస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ బాలిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) కేసులు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు విమల్ కుమార్ గుప్తా స్టాంప్ పేపర్‌పై బాలిక కుటుంబం నుంచి ఓ వాంగ్మూలాన్ని తెచ్చాడు.
అందులో తాము నిందితుడిని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఉపాధ్యాయుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదని బాధిత కుటుంబం పేర్కొన్నట్టుగా ఉంది. పోలీసులు దీనిని అంగీకరించి కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే కింది కోర్టు ఈ చర్యను తోసిపుచ్చింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధిత కుటుంబం వాంగ్మూలాన్ని అంగీకరించిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని పోలీసులను ఆదేశించింది.
అయితే హైకోర్టు తీర్పును రామ్‌జీ లాల్ బైర్వా అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు గమనించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది. రాజీ కుదుర్చుకున్నంత మాత్రాన కేసును రద్దు చేయలేమని స్పష్టం చేసింది.అలాగే ఈ కేసును తిరిగి విచారించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment