
ఆర్‌అండ్‌డీలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెంచే లక్ష్యం
ఆర్‌డీఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రైవేట్‌రంగం నుంచి పెట్టుబడులే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ ప్రగతిరథ వేగం పెరిగేందుకు నూతన ఆవిష్కరణలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశోధనాభివృద్ధిలో ప్రైవేట్‌రంగ పెట్టుబడులే లక్ష్యంగా ఏకంగా రూ.1 లక్ష కోట్ల మూల నిధితో రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్‌డీఐ) పథకానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. దేశ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక అవసరాలు, మరింత స్వావలంభన ధ్యేయంగా పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి విస్తృత స్తాయిలో నిధుల కేటాయింపునకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
ఆర్‌డీఐ రంగంలో ప్రైవేట్ సంస్థలకు తక్కువ వడ్డీకి లేదా వడ్డీరహిత రుణాలను మంజూరుచేయడం, రీఫైనాన్సింగ్ సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. రుణాలు పొందడంలో ప్రైవేట్ సంస్థలు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలను తొలగిస్తూ వ్యూహాత్మక రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను జోడించడం, పోటీతత్వాన్ని పెంచేలా పథకాన్ని రూపొందించామని మంత్రి చెప్పా రు. కీలక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా చేపట్టబోయే నూతన ప్రాజెక్టులకు సాయ పడటం, అవసరమైన అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవడంలో దోహదపడటం, అందుకు కావాల్సిన రుణాల మంజూరు వేగవంతం చేయడం వంటివి ఈ పథకంలో కీలకమైన అంశాలని మంత్రి వివరించారు.
ఆర్‌డీఐ పథకం అమలు, తీరు తెన్నులు, సమీక్ష బాధ్య తలను ప్రధాని మోదీ నేతృత్వంలోని అనుసంధాన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ (ఏఎన్ ఆర్‌ఎఫ్) పాలక మండలి తీసుకుంటుంది. ఈ పథకం మార్గదర్శకాలు, రంగాల వారీగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఆయా ప్రాజెక్టులకు ఫండ్ మేనేజర్‌లుగా ఏఏ సంస్థలు వ్యవహరిస్తాయనే అంశాలపై కేబినెట్ కార్యదర్శి సారథ్యంలోని భిన్న మంత్రిత్వశాఖ కార్యదర్శుల బృందం నిర్ణయాలు తీసు కుంటుంది. ఈ పథకానికి నోడల్ విభాగంగా శాస్త్ర, సాంకేతిక శాఖ వ్యవహరిస్తుంది.
ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1 లక్ష కోట్లు
ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1.07 లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భవిష్యనిధి సంస్థ అయిన ఈపీఎఫ్‌ఓ సారథ్యంలో కొనసాగే సామాజిక భద్రతా స్కీమ్‌ల ద్వారా వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.1.07 లక్షల కోట్లతో పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. తొలిసారిగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు రెండు విడతల్లో గరిష్టంగా రూ.15,000 వరకు అదనపు భత్యం ఇస్తారు. వీళ్లకు రెండేళ్లపాటు సంస్థ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మరోవైపు, తమిళనాడులో 87వ నంబర్ జాతీయ రహదారిలో భాగంగా పరమ కుడి– రామనాథపురం మధ్యలో నాలుగు వరసల రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర కేబినెట్ రూ.1,853 కోట్లు కేటాయించింది. ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో 46.7 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు.